బుధవారం, 8 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Updated :విజయవాడ , మంగళవారం, 21 సెప్టెంబరు 2021 (11:10 IST)

సీఎం జగన్ కు, ఆచార్య చిరంజీవికి ఎక్క‌డ తేడా వ‌చ్చింది?

ఏపీ సీఎం జ‌గ‌న్ కు, మెగాస్టార్ చిరంజీవికి ఎక్క‌డ తేడా వ‌చ్చింద‌నేది ఇపుడు తెలుగు ఇండ‌స్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. సీఎంతో మ‌ర్యాద‌పూర్వ‌క స‌మావేశంలో మెగాస్టార్ చిరంజీవి రెండు సార్లు పాల్గొన్నారు. అయితే, మొన్నటి సినీ పెద్ద‌ల సమావేశానికి ముందు రోజు ఒక సినిమా ఈవెంట్ లో చిరంజీవి కీలక వ్యాఖ్యలు చేసారు. సినీ ఇండస్ట్రీలో నలుగురు లేదా అయిదుగురు హీరోల రెమ్యునరేషన్ మాత్రమే భారీగా ఉందని, మిగిలిన వారినీ అదే రకంగా చూడవద్దని కోరారు. సినిమాలు పూర్తి చేసినా, విడుదల చేస్తే రెవిన్యూ వస్తుందా? లేదా? అనే మీమాంసతో విడుదల చేయకుండా నిలిచిపోయానని చెప్పుకొచ్చారు. తన మూవీ ఆచార్య సైతం విడుదలకు రెడీగా ఉందని, కానీ, రెవిన్యూ అంచనాలు అందక విడుదల తేదీ ఖరారు చేయలేదని చెప్పుకొచ్చారు.

 
అస‌లు ముఖ్యమంత్రి జగన్, మెగాస్టార్ చిరంజీవి నాయకత్వంలో సినీ పెద్దల సమావేశం ఎందుకు వాయిదా పడుతోంది? గత నెలలో జరగాల్సిన సమావేశం ఇప్పటి వరకు ఎందుకు జరగలేదు? ఏపీలో సినీ ఇండస్ట్రీ సమస్యల మీద ఇప్పటికే మెగాస్టార్ టీం సీఎం జగన్‌ను కలిసింది. ఆ సమయంలో ప్రస్తావించిన అంశాల పైన తాము సానుకూలంగా స్పందించామని ఏపీ ప్రభుత్వం చెబుతోంది. ఇప్పటికే చిరంజీవి రెండుసార్లు సీఎం జగన్‌ను కలిసారు. తొలిసారి కలిసిన సమయంలోనే పరిశ్రమ అంశాలను ప్రస్తావించగా, మీరే లీడ్ తీసుకొని పరిశ్రమలోని పెద్దలను తీసుకురండి. ఖచ్చితంగా పరిష్కరిద్దాం... అంటూ సీఎం జగన్ హామీ ఇచ్చారు.

 
అదే విధంగా చిరంజీవి, నాగార్జున, దిల్ రాజు, రాజమౌళి, సీ కళ్యాణ్, సురేష్ బాబు మరోసారి సీఎంతో భేటీ అయి కొన్ని అంశాలను ప్రస్తావించారు. ఆ తరువాత ప్రభుత్వం కొన్నింటిని అమలు చేస్తూ, జీవోలు ఇచ్చింది. కరోనా తరువాత మిగిలిన అంశాలపైన చిరంజీవి టీం గత నెల రోజులుగా సీఎంతో చర్చలు ఉంటాయని చెబుతూ వచ్చింది. తమ సమస్యలను సీఎంకు వివరించేందుకు సినీ పెద్దలు సమయం కోరారు. మొదట విజయసాయిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి వంటి వారిని కలిసి సమస్యలను తెలియజేశారు.

 
సినీ నిర్మాతలతో ప్రభుత్వం సమావేశం, ఆ తర్వాత సినీ ఇండస్ట్రీ సమస్యలపై సీఎం జగన్‌తో మాట్లాడేందుకు చిరంజీవితో పాటు మరికొందరని ఆహ్వానించినట్లు ప్రభుత్వం తరపు నుంచి మంత్రి పేర్ని నాని ఓ ప్రకటన చేశారు. ఆ ప్రకటన తర్వాత చిరంజీవి, సినీ ఇండస్ట్రీలోని నిర్మాతలు, డైరెక్టర్లు, డిస్ట్రిబ్యూటర్లను పిలిచి తన ఇంట్లో సమావేశం ఏర్పాటు చేశారు. ఇండస్ట్రీ సమస్యలన్నింటినీ తెలుసుకుని సీఎం దృష్టికి తీసుకువెళ్లేందుకు చిరు రెడీ అవుతున్న సమయంలో ఆన్ లైన్ టిక్కెట్ల వ్యవహారం తెర మీదకు వచ్చింది. ఈ అంశంలో ప్రభుత్వంపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. జ‌గ‌న్ ప్ర‌భుత్వం సినిమా టిక్కెట్ల వ్యాపారంలోనూ వేలు పెట్టింద‌ని ప్ర‌తిప‌క్షాలు విమ‌ర్శించాయి.

 
అయితే, తెలుగు ఫిలిం ఇండస్ట్రీ నుంచే ఈ ప్రతిపాదన వచ్చిందనే విషయం, ప్రభుత్వమే వెల్లడించే వరకూ చిరంజీవి టీంలోని ఎవరూ ప్రభుత్వానికి మద్దతుగా రాకపోవటంపై ప్రభుత్వంలోని ముఖ్యులు  కొంత నొచ్చుకున్నట్లు తెలుస్తోంది. దీంతో, ఆ తరువాత మంత్రి పేర్ని నాని ఈ ప్రతిపాదన చిరంజీవి టీం నుంచే వచ్చిందని తేల్చి చెప్పారు. ఇక, ఈ అంశం పైన ముందుగా చర్చించేందుకు టాలీవుడ్‌కి చెందిన నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు పేర్ని నానితో సమావేశమై చర్చలు నిర్వహించారు. తామే ఈ ప్రతిపాదన చేసామంటూ, తమకు ఆన్ లైన్ విధానం ఆమోదయోగ్యమైనదే అంటూ వారు స్పష్టం చేసారు.

 
రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు తాము ఇప్పటికే కొన్ని అంశాలను నివేదించామని గుర్తు చేసారు. సీఎం జ‌గ‌న్‌ని త‌మ సమస్యలను పరిష్కరించమని కోరుతున్నానంటూ, చిరంజీవి చెప్పుకొచ్చారు. ఇక, నిన్న‌టి సమావేశం తరువాత మంత్రి పేర్ని నాని ఆన్ లైన్ టిక్కెట్ల విషయంలో ముందుకే వెళ్తామని స్పష్టం చేసారు. మరో విడత సినీ ప్రముఖులతో చర్చిస్తామని వెల్లడించారు. వారితోనూ చర్చించిన తరువాత ఏ విధంగా ముందుకు వెళ్లాలో సీఎం వద్ద చర్చించి తుది కార్యాచరణ ఖరారు చేస్తామని చెప్పారు.

పైగా చిరంజీవి అంటే జగన్‌కు అభిమానమే అంటూ, ఇదే సమయంలో చిరంజీవి అంటే సీఎం జగన్‌కు గౌరవమని, సోదర భావంతో చూస్తారని మంత్రి పేర్ని నాని వివరించారు. ఇక, ప్రభుత్వ సమావేశానికి హాజరైన నిర్మాతలు సైతం ఆన్ లైన్ టిక్కెట్ విధానానికి మద్దతు ప్రకటించారు. దీంతో, పేర్ని నాని గతంలో చెప్పిన విధంగా చిరంజీవి టీంకు, ఎప్పుడు సీఎం జగన్ అప్పాయింట్ మెంట్ ఇస్తారనేది ఇప్పుడు ఆసక్తి కరంగా మారుతోంది.