శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : సోమవారం, 18 నవంబరు 2019 (17:31 IST)

గవర్నర్ దంపతులతో సీఎం జ‌గ‌న్ దంప‌తులు భేటీ

విజయవాడ రాజ్‌భవన్‌లో గవర్నర్ బిశ్వ‌భూషణ్ హరిచందన్ దంపతులతో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దంపతులు భేటీ అయ్యారు. సోమవారం మధ్యాహ్నం మర్యాద పూర్వకంగా జరిగిన ఈ సమావేశంలో విభిన్న అంశాలు చర్చకు వచ్చాయి. తాజా రాజకీయ పరిస్ధితులను గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌కు వివరించిన సీఎం అతిత్వరలో అసెంబ్లీ సమావేశాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 
 
రాష్ట్ర ప్రభుత్వం నవరత్నాల పేరిట ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను గురించి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి వివరించారు. ముఖ్యమంత్రి దంపతుల గౌరవార్దం గవర్నర్ దంపతులు ప్రత్యేకంగా రాజ్‌భవన్‌లో భోజన ఏర్పాట్లు చేయించారు. 
 
తొలుత రాజ్‌భవన్‌లో గవర్నర్ కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా, సంయుక్త కార్యదర్శి అర్జునరావు, ఇతర అధికారులు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని స్వాగతించారు. గవర్నర్ శాలువా, మెమెంటోలతో సిఎంను గౌరవించగా, ముఖ్యమంత్రి సైతం అదే తీరుగా గవర్నర్‌ను సత్కరించారు. సీఎం వెంబడి ముఖ్యమంత్రి కార్యక్రమాల కమిటీ ఛైర్మన్ తలశిల రఘురాం, ముఖ్యమంత్రి కార్యదర్శి ధనుంజయ రెడ్డి, ఇతర అధికారులు ఉన్నారు.