శనివారం, 2 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 15 మార్చి 2024 (11:57 IST)

ఎన్నికల పనుల్లో వాలంటీర్లు పాల్గొనరాదు... జిల్లా కలెక్టర్లకు సీఎస్ ఆదేశాలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నియమించిన వాలంటర్లు ఇపుడు వైకాపా కార్యకర్తలుగా మారిపోయారు. ఆ పార్టీ కోసం ఎన్నికల్లో పని చేస్తున్నారు. ఇలాంటి వారిని గుర్తించి, ఎన్నికలతో ముడిపడిన ఎలాంటి పనులు అప్పగించరాదని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీచేశారు. 
 
నిజానికి అధికార పార్టీ సైనికులుగా చెప్పుకునే వాలంటీర్లను ఎన్నికలు విధులకు దూరంగా ఉండాలని ఎన్నికల సంఘం, కోర్టులు ఎన్ని మొట్టికాయలు వేచినా, వారి ఆదేశాలను వైఎస్సార్సీపీ నేతలు, వాలంటీర్లు భేఖాతరు చేస్తూ వస్తున్నారు. వాలంటీర్లను ఎన్నికల నిర్వహణలో పాల్గొనకూడదంటూ ప్రతిపక్షాలు అధికారులకు విన్నవించుకున్నారు. తాజాగా వాలంటీర్ల విధులపై సీఎస్ జవహర్ రెడ్డి జిల్లా కలెక్టర్లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
 
గ్రామ వాలంటీర్లపై జిల్లా కలెక్టర్లకు సీఎస్ జవహర్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికలతో ముడిపడిన ఎలాంటి ప్రక్రియలోనూ గ్రామ, వార్డు వాలంటీర్లు పాల్గొనకుండా చూడలని జిల్లా కలెక్టర్లను సీఎస్ ఆదేశించారు. అతి త్వరలో సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానున్న దృష్ట్యా వాలంటీర్లను అన్ని రకాల ఎన్నికల విధుల నుంచి తక్షణమే తొలగించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 
 
వారు ఎన్నికలకు సంబంధించిన ఎలాంటి ప్రక్రియలో పాల్గొన్నా ఈసీ మార్గదర్శకాల ఉల్లంఘనే అవుతుందని స్పష్టం చేశారు. పోలింగ్ కేంద్రాల్లో ఏజెంట్లుగా ఉండేందుకు కూడా అర్హులు కారని పేర్కొంటూ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. 
 
మరోవైపు, వాలంటీర్లను ఎన్నికల ప్రక్రియకు దూరంగా ఉంచాలని కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన ఉత్తర్వులను ఉల్లంఘిస్తున్న బాధ్యులపై చర్యలు తీసుకోవాలని సిటిజన్ ఫర్ డెమోక్రసీ సంస్థ ఇచ్చిన వినతిపై తగిన నిర్ణయం తీసుకోవాలని సీఈసీని హైకోర్టు ఆదేశించింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీరజ్సింగ్ ఠాకుర్, జస్టిస్ ఆర్. రఘునందన్ రావుతో కూడిన ధర్మాసనం బుధవారం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. 
 
వాలంటీర్లను ఎన్నికల ప్రక్రియకు దూరంగా ఉంచాలని కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ సక్రమంగా అమలు కావడం లేదని చీఫ్ ఎలక్టోరల్ అధికారి ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని పేర్కొంటూ సీఎఫ్ కార్యదర్శి నిమ్మగడ్డ రమేశ్ కుమార్ హైకోర్టులో వ్యాజ్యం వేశారు.
బుధవారం జరిగిన విచారణలో న్యాయవాది అశ్వనీకుమార్ వాదనలు వినిపించారు. వాటిని పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం పిటిషనర్ వినతిపై మూడు వారాల్లో తగిన నిర్ణయాన్ని వెల్లడించాలని కేంద్ర ఎన్నికల సంఘం సీఈఓను ఆదేశించింది. 
 
హైకోర్టు ఆదేశాల మేరకు ఇకనైనా ఎలక్షన్ కమిషన్, సీఈవో స్పందించి నష్ట నివారణ చర్యలు తీసుకోవాలని చెప్పటంతో సీఎల్డీ సంస్థ ఆశాభావం వ్యక్తం చేసింది. చర్యలు తీసుకోవడంలో విఫలమైతే అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని సీఎఫ్ఎ స్పష్టం చేసింది.
 
కాగా, ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో గ్రామ వాలంటీర్లు అధికార పార్టీ ప్రచారంలో తప్పనిసరిగా భాగస్వాములయ్యేలా వైఎస్సార్సీపీ నాయకులు పావులు కదుపుతున్నారు. ఒక గ్రామం లేదా సచివాలయ పరిధిలో ఉన్న వాలంటీర్లలో పార్టీపై వీర విధేయత ఉన్న వారిని బృంద నాయకులుగా ఎంపిక చేసి పర్యవేక్షణ, ప్రచార బాధ్యతలు అప్పగించేందుకు సిద్ధమవుతున్నారు. 
 
నాయకుల ఇళ్ల వద్ద సమావేశాలు కొద్ది రోజులుగా వైకాపా నాయకుల ఇళ్ల వద్ద వాలంటీర్లతో ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. సీఎం జగన్ బుణం తీర్చుకునే అవకాశం వచ్చిందని, జగన్ మరోసారి ముఖ్యమంత్రిగా గెలిపించాలని వాలంటీర్లకు ఉపన్యాసం చేస్తున్నారు. 'పార్టీ గెలుపు బాధ్యత మీ భుజస్కంధాలపైనే ఉందని, మీరే సైనికులంటూ వైఎస్సార్సీపీ నేతలు పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. ఈ తరుణంలో సీఎస్ ఆదేశాలు అధికార పార్టీ నేతలకు గట్టి షాక్ తగిలినట్లయింది.