శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : ఆదివారం, 23 జులై 2023 (20:19 IST)

పొత్తులపై జాతీయ నాయకత్వం నిర్ణయం తీసుకుంటుంది : పురంధేశ్వరి

Daggubati Purandeswari
తమ పార్టీ ఎవరితో పొత్తు పెట్టుకుంటుందనే విషయంపై బీజేపీ కేంద్ర నాయకత్వమే తుది నిర్ణయం తీసుకుంటుందని బీజేపీ ఏపీ శాఖ అధ్యక్షురాలు దగ్గుబాటి  పురంధేశ్వరి అన్నారు. ఇదే అంశంపై ఆమె మాట్లాడుతూ, పొత్తులపై సరైన సమయంలో ప్రకటన ఉంటుందని తెలిపారు. రాష్ట్రంలో తాము ఎవరితో పొత్తు పెట్టుకోవాలన్న అంశం తమ పార్టీ జాతీయ అధ్యక్షుడు నిర్ణయిస్తారని పురందేశ్వరి వెల్లడించారు.
 
పార్టీ హైకమాండ్ నిర్ణయం తమకు శిరోధార్యమని పేర్కొన్నారు. రాయలసీమ ప్రాంతంలోని ఏడు జిల్లాల జోనల్ సమావేశం కోసం పురందేశ్వరి నేడు కడప జిల్లా ప్రొద్దుటూరు విచ్చేశారు. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్. విష్ణువర్ధన్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్ తదితరులు ఆమెకు ఘనస్వాగతం పలికారు. ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పురందేశ్వరికి ఇదే తొలి రాజకీయ పర్యటన.
 
మరోవైపు, ఏపీలో వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బీజేపీ, జనసేన, టీడీపీ కలిసి పనిచేస్తాయన్న ప్రచారం జరుగుతోంది. బీజేపీ, జనసేన పార్టీలు తాము కలిసే ఉన్నామని పలు ప్రకటనల ద్వారా స్పష్టం చేస్తుండగా, ఇటీవల పవన్ కల్యాణ్‌కు ఎన్డీఏ భేటీ కోసం ఆహ్వానం అందడం, ఆయన హాజరుకావడం... ఈ అంశాలతో ఆ రెండు పార్టీల భాగస్వామ్యానికి మరింత బలం చేకూరింది. ఇక ఈ రెండు పార్టీలతో టీడీపీ జట్టు కడుతుందా అన్నదానిపై ఇంకా స్పష్టత రాలేదు.