ఆదివారం, 12 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ivr
Last Modified: మంగళవారం, 17 జనవరి 2017 (19:30 IST)

ఆంధ్రప్రదేశ్‌లో ఇకపై డిజిటల్ వ్యవసాయం... ఇక్రిశాట్, మైక్రోసాఫ్ట్ సహకారంతో యాప్

విజయవాడ : వ్యవసాయంలో అధిక దిగుబడి రావాలంటే.. తగిన సమయంలో విత్తనం నాటాలి. ఇందుకు భూసారం, వాతావరణం కూడా కలిసిరావాలి. ముఖ్యంగా చిన్న, సన్నకారు రైతుల్లో ఈ మాత్రం అవగాహన తప్పనిసరి. ఈ విషయంలో ఏ మాత్రం తేడా వచ్చినా.. పెద్దరైతుల మాదిరిగా ఒకటి రెండెకరాలున్న ర

విజయవాడ : వ్యవసాయంలో అధిక దిగుబడి రావాలంటే.. తగిన సమయంలో విత్తనం నాటాలి. ఇందుకు భూసారం, వాతావరణం కూడా కలిసిరావాలి. ముఖ్యంగా చిన్న, సన్నకారు రైతుల్లో ఈ మాత్రం అవగాహన తప్పనిసరి. ఈ విషయంలో ఏ మాత్రం తేడా వచ్చినా.. పెద్దరైతుల మాదిరిగా ఒకటి రెండెకరాలున్న రైతులు తట్టుకోలేరు. అందుకే చిన్న రైతుల కోసం.. విత్తనాలు నాటుకునే అదను ఇదని చెప్పే ఓ యాప్ ను తయారు చేయించింది రాష్ట్ర ప్రభుత్వం. వ్యవసాయానికి సాంకేతిక హంగులద్దడం ద్వారా.. తక్కువ సమయంలో ఎక్కువ మంది రైతులకు మెరుగైన సలహాలిచ్చి.. అధిక దిగుబడి సాధించేలా చేయాలన్నది ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచన. ఈ మేరకు వ్యవసాయాన్ని డిజిటలీకరించేందుకు ఇక్రిశాట్, మైక్రోసాఫ్ట్ సంస్థలు నడుం బిగించాయి. రాష్ట్ర ప్రభుత్వంతో కలసి ఓ యాప్ రూపొందించాయి. సోయింగ్ యాప్.. పేరుతో రూపొందించిన ఈ యాప్.. ప్రస్తుతం అద్భుతఫలితాలనిస్తోంది. హెక్టారు 30 శాతం అధిక రాబటి సాధించేందుకు ఈ యాప్ దోహదపడుతోంది.
 
కర్నూలు జిల్లా దేవనకొండ మండలం బైరవానికుంట గ్రామంలో జి.చిన్నవెంకటేశ్వర్లు అనే రైతుకు మూడెకరాల భూమి ఉంది. ఇక్రిశాట్ అధికారుల సూచనల మేరకు పొలం దున్ని క్రితం ఏడాది జూన్ 25న విత్తనం నాటాడు. ఆ తరువాత కూడా ఇక్రిశాట్ అధికారుల సలహాల ప్రకారమే పంట సస్యరక్షణ చర్యలు చేపట్టాడు. అక్టోబర్ 28 నాటికి పంట చేతికొచ్చింది. హెక్టారుకు 1.35 టన్నుల దిగుబడి వచ్చింది. గతంతో పోలిస్తే.. ఇది 30 శాతం అధిక దిగుబడి వచ్చినట్టుగా తేల్చారు.'
 
పైలట్ ప్రాజెక్టుగా చేపట్టిన ఈ ప్రయోగం విజయవంతం కావడంతో.. రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని భావిస్తోంది ప్రభుత్వం.. 2022 నాటికి వ్యవసాయ రంగంలో దేశంలో అధికోత్పత్తి సాధిస్తున్న తొలి మూడు రాష్ట్రాల్లో ఒకటిగా ఆంధ్రప్రదేశ్ ను నిలబెట్టాలన్నది ముఖ్యమంత్రి లక్ష్యం. ఈ మేరకు జిల్లాకు 10వేల హెక్టార్ల వంతున 13 జిల్లాల్లోని చిన్న రైతులకు చెందిన లక్షా 30వేల హెక్టార్లలో మార్కెట్ అవసరాలకు తగ్గ పంటలను ఈ యాప్ ద్వారా సాగు చేయించాలనుకుంటున్నారు.
 
ప్రతి గ్రామానికి ఓ డ్యాష్ బోర్డ్ తయారుచేయించి.. ఆయా గ్రామాల్లో భూసారం ఎలా ఉంది.. ఎలాంటి ఎరువులు వాడాలి.. వచ్చే వారంరోజుల్లో వాతావరణం ఎలా ఉండబోతోంది, వాతావరణంలో అనూహ్య మార్పులు చోటుచేసుకున్నప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.. తదితర వివరాలను రైతులకు అందజేస్తారు. రైతులు నాటే విత్తనానికి అనుగుణంగా భూమిని దున్నుకోవడం దగ్గర నుంచి,  విత్తనాల శుద్ధి, ఎంత లోతున విత్తనం నాటాలి, కలుపు నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సేంద్రీయ పద్దతుల్లో సాగు విధానాలు, పంటల కోత, వాటిని సరైన పద్దతిలో నిల్వ చేసుకోవడం వరకు ప్రతి దశలోనూ రిజిస్టర్ చేసుకున్న రైతుల సెల్ ఫోన్ లకు తెలుగులో మెసేజ్‌ల ద్వారా సమాచారం అందజేస్తారు. స్మార్ట్ ఫోన్ లేకపోయినా.. బేసిక్ ఫోన్లలో కూడా రైతులు.. తమ సొంత భాషలోనే సమాచారం తెలుసుకునేలా ఏర్పాట్లు చేయడం విశేషం.
 
ప్రతి యేటా జూన్ మొదటి వారం నుంచి సేంద్రీయ పద్దతుల్లో భూమిని సాగుకు సిద్ధం చేసుకోవడం దగ్గర నుంచి విత్తనం నాటుకోవడం వరకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సెల్ ఫోన్లకు మెసేజ్ లు వస్తుండటం రైతులను ఆకర్షిస్తోంది. దీంతో సోయింగ్ యాప్ ద్వారా రిజిస్టర్ చేసుకోడానికి రైతులు పెద్ద సంఖ్యలో ముందుకొస్తున్నారని దేవనకొండ గ్రామస్తులు చెబుతున్నారు. క్లౌడ్ టెక్నాలజీ ద్వారా రూపొందించిన ఈ యాప్ విజయవంతం కావడంపై అటు మైక్రోసాఫ్ట్, ఇటు ఇక్రిశాట్ అధికారులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. డిజిటల్ వ్యవసాయంతో రైతుల ఆదాయం పెరగడం తమకు సంతోషాన్నిస్తోందని చెబుతున్నారు.