సోమవారం, 25 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 2 డిశెంబరు 2020 (20:23 IST)

మా వద్దకు రండి.. జిలేబీ, పకోడీ, టీ ఇస్తామంటూ రైతుల ఆఫర్ (Video)

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆరు రాష్ట్రాలకు చెందిన రైతులు కదంతొక్కారు. ఢిల్లీ ఛలో పేరిట వీరు చేపట్టిన ఉద్యమం ఇపుడు దేశాన్ని ఓ ఊపు ఊపుతోంది. ఢిల్లీ సరిహద్దులకు చేరుకున్న రైతులు.. ఇపుడు ఢిల్లీకి వెళ్లే అన్ని రహదారులను దిగ్బంధించారు. దీంతో కేంద్ర మంత్రులు వివిధ రకాలుగా చర్చలు జరుపుతున్నారు. 
 
ఈ క్రమంలో కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్‌కు నిరసనలు తెలుపుతున్న రైతు సంఘాల నాయకుల నుంచి, తమ ప్రాంతానికి రావాలన్న ఆహ్వానం అందింది. తాము ఏర్పాటు చేసుకున్న సామూహిక వంటశాల వద్దకు వస్తే, జిలేబీ, పకోడీ, టీ ఇస్తామని వారు ఆహ్వానించారు. 
 
మంగళవారం రైతు నేతలతో సుదీర్ఘ సమావేశం జరిగిన వేళ, తోమర్ వారికి టీ పంపించారు. ఆపై రైతు నేత జమ్హురి కిసాన్ సభ చీఫ్ కుల్వంత్ సింగ్ సాధు, తమ వద్దకు వస్తే టీతో పాటు మరిన్ని అందిస్తామని అనడంతో అక్కడ నవ్వులు విరిశాయి.
 
"తోమర్ సాబ్ మమ్మల్ని టీ తీసుకోవాలని కోరారు. అందుకు ప్రతిగా, మేము నిరసనలు తెలుపుతున్న ప్రాంతానికి వస్తే, జిలేబీ, పకోడీలను కూడా కలిపి ఇస్తామని చెప్పాం. దీంతో అందరూ నవ్వారు" అని ఆయన సమావేశం తర్వాత పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. తమ చర్చల్లో ప్రభుత్వం ఓ కమిటీని ఏర్పాటు చేసే అంశం కూడా తెరపైకి వచ్చిందని అన్నారు.
 
ఈ భేటీలో రైతుల తరపున 35 మంది పాల్గొన్నామని, ప్రభుత్వం తమ డిమాండ్లను పరిష్కరించే ఉద్దేశంతో లేదని తెలుసుకున్నామని వ్యాఖ్యానించిన ఆయన, అందువల్లే రైతులు లేవనెత్తిన అంశాల పరిష్కారానికి కమిటీని వేస్తామన్న ప్రతిపాదనను తాము తిరస్కరించామని స్పష్టం చేశారు. 
 
ఇదిలావుంటే, కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ ఆందోళన చేస్తున్న రైతులు మరోసారి కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరుపనున్నారు. మంగళవారం జరిగిన చర్చలు ఫలపద్రం కాకపోవడంతో గురువారం మరోసారి సమాశమయ్యేందుకు ఇరువర్గాలు అంగీకరించాయి.
 
చర్చల సమయంలో రైతు సంఘాల ప్రతినిధులు ‘ఇప్పుడు కమిటీల ఏర్పాటు చేయడానికి సమయం లేదు’ అని స్పష్టం చేశారు. కొత్త చట్టాలను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. అప్పటివరకు నిరసన కార్యక్రమాలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌ ఎక్కువ మంది సభ్యులుంటే ఏకాభిప్రాయం రావడం కష్టమని, ఐదారుగురు నేతలు కమిటీగా రావాలని సూచించారు. 
 
ఏ చర్చకైనా ప్రభుత్వానికి అభ్యంతరం లేదు. నాలుగో రౌండ్‌ చర్చలు గురువారం జరుగుతాయని పేర్కొన్నారు. చర్చల్లో ఆందోళన చేస్తున్న 32 సంఘాలకు చెందిన రైతు సంఘాల ప్రతినిధులు, తోమర్‌తో పాటు రైల్వే శాఖ మంత్రి పీయుష్‌ గోయల్‌, పరిశ్రమల సహాయ మంత్రి సోమ్‌ ప్రకాశ్‌ పాల్గొన్నారు. 
 
ఈ సందర్భంగా రైతు సంఘాల ప్రతినిధులు, వ్యవసాయ నిపుణులు, ఇతర ప్రభుత్వ సంస్థలతో కూడిన ప్యానెట్‌ను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ముందుకు రాగా.. యూనియన్ల నేతలు ప్రతిపాదనను తిరస్కరించారు. మరో వైపు రైతులు తమ ఆందోళన కొనసాగిస్తున్నారు. ఢిల్లీ-ఖాజీపూర్‌ (ఢిల్లీ-యూపీ సరిహద్దు)లో రైతులకు అధికారులు భోజనం అందిస్తున్నారు.