1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 14 జులై 2023 (15:25 IST)

నకిలీ నోట్ల చెలామణిలో టీచర్ - కానిస్టేబుల్ - వలంటీరు..

money
నకిలీ కరెన్సీ నోట్ల చెలామణిలో ముగ్గురు చిక్కారు. వీరిలో ఒకరు ఉపాధ్యాయుడు, మరొకరు కానిస్టేబుల్, ఇంకొకరు వలంటీరు కావడం గమనార్హం. వీరికి వస్తున్న జీతభత్యాలు చాలవన్నట్టుగా అక్రమ ఆదాయానికి తెరతీశారు. ఈ మోసం కర్నూలు జిల్లాలో వెలుగు చూసింది. వీరంతా కలిసి నకిలీ నోట్ల చలామణీ మొదలుపెట్టారు. దీనిని ఆస్పరి పోలీసులు గుట్టురట్టు చేశారు. నిందితుల్లో ఇద్దరిని గురువారం కస్టడీలోకి తీసుకున్నారు. లోతుగా విచారిస్తే తమ పేర్లు ఎక్కడ బయటపడతాయోనని మరికొందరు పాత్రధారుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి.

దొంగనోట్ల చలామణీ కేసులో నిందితులు నలుగురూ కోసిగి గ్రామానికి చెందిన వారే కావడం గమనార్హం. గోపాలకృష్ణ గ్రామ వాలంటీరుగా, అతని అన్న రామకృష్ణారెడ్డి కోసిగి మండలం దొడ్డిబెళగల్‌ గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుుడిగా పనిచేస్తున్నారు. వీరికి తోడుగా గ్రామానికి చెందిన మెడికల్‌ ఏజెన్సీ నిర్వాహకుడు నరేష్‌ కుమార్‌ భాగస్వామ్యం వహించారు.

గ్రామ వాలంటీరు గోపాలకృష్ణ, నరేశ్‌ కొంత కాలంగా దొంగనోట్ల వ్యవహారంలో కీలకపాత్ర పోషిస్తున్నట్టు సమాచారం. అనంతపురం జిల్లా గుంతకల్లు పోలీసు స్టేషన్‌లోనూ వీరిద్దరిపై దొంగనోట్ల వ్యవహారంపై కేసులు నమోదైవున్నాయి. నకిలీ నోట్ల వ్యవహారంలో అరెస్టైన నలుగురు నిందితుల వెనుక మరికొందరి పాత్ర ఉందని సమాచారం. దొంగనోట్ల వ్యవహారంతో నష్టపోయిన బాధితులు ఎవరైనా ఉంటే నిర్భయంగా ఆయా పోలీసు స్టేషన్లకు వచ్చి ఫిర్యాదు చేయవచ్చని పోలీసు అధికారులు తెలిపారు.