మంగళవారం, 26 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 15 ఫిబ్రవరి 2020 (13:51 IST)

అమరావతి కోసం 60వ రోజు రైతుల ఆందోళన..ఇద్దరు యువకుల దీక్ష

అమరావతినే రాజధానిగా కొనసాగించాలంటూ రైతులు చేస్తున్న దీక్షలు కొనసాగుతున్నాయి. 60 రోజుల సందర్భంగా మంగళగిరి మండలం కృష్ణాయపాలెంలో ఇద్దరు యువకులు 60 గంటల నిరాహార దీక్ష చేస్తున్నారు. తుళ్లూరులో 60 మంది మహిళలు దీక్షలో కూర్చోనున్నారు.
 
సీఎం గారూ అమరావతినే వద్దంటున్నారు.. నిధులు దేనికోసం?
అమరావతి అభివృద్ధిని నిలిపివేసిన ముఖ్యమంత్రి జగన్‌ కేంద్రాన్ని దేని కోసం నిధులు అడుగుతున్నారని రాజధాని రైతులు ప్రశ్నిస్తున్నారు.

అమరావతినే ఏకైక రాజధానిగా కొనసాగించాలంటూ తుళ్లూరు, మందడం, వెలగపూడి సహా పలు గ్రామాల్లో 60వ రోజూ ధర్నాలు చేస్తున్నారు. తుళ్లూరులో 60వ రోజు పోరాటాన్ని పురస్కరించుకుని 60 మంది మహిళలు దీక్షకు కూర్చుకున్నారు. జై అమరావతి జై ఆంధ్రప్రదేశ్ నినాదాలతో హోరెత్తిస్తున్నారు.
 
రాజధాని తరలింపుపై సానుకూల స్పందన రాలేదు
రాజధాని తరలింపు, మండలి రద్దుపై కేంద్రం నుంచి జగన్‌కు సానుకూల స్పందన రాలేదని మండలిలో ప్రతిపక్షనేత యనమల రామకృష్ణుడు అన్నారు. రాజధాని తరలింపు న్యాయపరిధిలో ఉందనే సమాధానం ఎదురైందని స్పష్టం చేశారు.

రాజధాని తరలింపు న్యాయపరిధిలో ఉందనే సమాధానం కేంద్రం నుంచి ఎదురైందని.. అమరావతి రాజధానిగా కొనసాగాలనేది న్యాయమైన అంశమని యనమల రామకృష్ణుడు అన్నారు. వైకాపా తప్ప రాష్ట్ర ప్రజలంతా ఇదే కోరుకుంటున్నారని స్పష్టం చేశారు.

సెలక్ట్ కమిటీని అడ్డుకునేందుకు వైకాపా అన్ని ప్రయత్నాలు చేస్తోందని విమర్శించారు. మండలి కార్యదర్శి కూడా ఛైర్మన్‌ ఆదేశాలు పాటించకుండా వైకాపా నియంత్రిస్తోందన్నారు. సెలక్ట్ కమిటీ దస్త్రం వెనక్కి పంపటం ద్వారా ఉల్లంఘనకు పాల్పడ్డారని యనమల విమర్శించారు.

ఛైర్మన్, సభాపతికి శాసన పరిషత్ ఇచ్చిన అధికారాలు ఎవరూ ధిక్కరించలేనివని గుర్తు చేశారు. క్రమశిక్షణ చర్యల కింద కఠిన నిర్ణయం తీసుకునే అధికారం ఛైర్మన్‌కు ఉందని యనమల రామకృష్ణుడు పేర్కొన్నారు.