శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : శనివారం, 5 జనవరి 2019 (12:46 IST)

గ్యాంగ్ స్టర్ నయీంకు రూ.1200 కోట్ల ఆస్తులు.. వంట మనిషి పేరుపై రూ.100 కోట్లు

రెండు తెలుగు రాష్ట్రాలను గడగడలాడించిన గ్యాంగ్ స్టర్ నయీం. 2016 సంవత్సరం ఆగస్టు 8వ తేదీన షాద్‌నగర్‌లో తెలంగాణ పోలీసుల ఎన్‌కౌంటర్‌లో హతమయ్యాడు. ఈ కేసును సిట్ (ప్రత్యేక దర్యాప్తు బృందం) చేపట్టింది. ఈ విచారణలో అనేక ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి.
 
ముఖ్యంగా, నయీంకు ఏకంగా రూ.1200 కోట్ల విలువ చేసే చర, స్థిరాస్తులు ఉన్నట్టు లెక్కించారు. ఇందులో నయీం ఇంట్లో పనిచేసే వంటమనిషి ఫర్హానా పేరుపై ఏకంగా రూ.100 కోట్ల విలువ చేసే ఆస్తులు ఉన్నట్టు తేలింది. ఈమె పేరుపై ఏకంగా 48 ఇళ్ళ స్థలాలను రిజిస్ట్రేషన్ చేయడం గమనార్హం. 
 
ఎలాంటి ఆదాయమార్గం లేకుండానే కేవలం సెటిల్మెంట్లు, కబ్జాలు, బెదిరింపులు వంటి చర్యలకు పాల్పడుతూ వచ్చిన నయీం... తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోనేకాకుండా గోవా, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో ఆస్తులు ఉన్నట్టు సిట్ అధికారులు గుర్తించారు.
 
ముఖ్యంగా, హైదరాబాద్, రంగారెడ్డి, నల్గొండ జిల్లాల్లో 40 ఇళ్ళ స్థలాలు, 1015 ఎరకాల భూమి, వివిధ ప్రధాన ప్రాంతాల్లో వాణిజ్య భవన సముదాయాలు, బంగారం, వెండి, ఇతర ఆభరణాలతో కలుపుకుని మొత్తం 1200 కోట్ల ఆస్తులు ఉన్నట్టు నిర్ధారించారు. 
 
కేసు విచారణలో భాగంగా సిట్ అధికారులు సేకరించిన సమాచారాన్ని తీసుకున్న ఆదాయపన్ను శాఖ అధికారులు నయీం ఆస్తులు బినామీల పేర్లతో ఉన్నట్లు కనుగొన్నారు. షాద్‌నగర్‌లోని మిలీనియం టౌన్‌షిప్‌లోని ఇల్లు నయీం బావమరిది సాజిద్‌ పేరుతో ఉన్నట్లు గుర్తించారు. నయీం ఇంట్లో వంటమనిషి ఫర్హానా పేరుతో దాదాపు 40 ఇళ్ల స్థలాలు రిజిస్ట్రేషన్ చేయించాడు. సిట్‌తో పాటు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులుకూడా ఈ కేసును విరిస్తున్నారు.