అక్బరుద్దీన్‌కు 4 యేళ్లలో రూ.7 కోట్లు పెరిగిన ఆస్తులు.. మొత్తం రూ.24.3 కోట్లు
హైదరాబాద్ నగరంలోని ఓవైసీ సోదరుల్లో అక్బరుద్దీన్ ఓవైసీ ఒకరు. మజ్లిస్ పార్టీ నేత. ఈయన చాంద్రాయణగుట్ట అసెంబ్లీ స్థానం నుంచి తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఈయన తాజాగా తన చర, స్థిరాస్తుల వివరాలను వెల్లడించారు. మొత్తం రూ.24.3 కోట్ల ఆస్తులు ఉన్నట్టు ప్రకటించిన అక్బరుద్దీన్.. అప్పు కూడా రూ.11.39 కోట్లుగా ఉన్నట్టు పేర్కొన్నారు. అలాగే, తన వద్ద మూడు పిస్టల్స్ ఉన్నాయనీ, 14 కేసులు నమోదై ఉన్నట్టు తన నామినేషన్ పత్రాల్లో పేర్కొన్నారు.
ముఖ్యంగా, గడచిన నాలుగేళ్ల కాలంలో ఆయన ఆస్తులు ఏకంగా రూ.7 కోట్ల మేరకు పెరగడం గమనార్హం. చరాస్తుల్లో 4.38 కేజీల బంగారం ఉన్నట్టు వెల్లడించారు. హైదరాబాద్‌తో పాటు బెంగుళూరు నగరాల్లో ఒక్కో ఇల్లు ఉందని తెలిపారు. రంగారెడ్డి జిల్లా మంచిరేవులలో 2.05 ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నట్టు తెలిపారు.
గత 2012-13 ఆర్థిక సంవత్సరంలో ఆయన ఆదాయం రూ.55.99 లక్షలుగా ఉండగా, గత ఐదేళ్ల కాలంలో అది రూ.1.18 కోట్లకు చేరింది. వేతనాలు, అద్దెలు, బ్యాంకుల నుంచి వచ్చే వడ్డీలే ఆదాయ వనరులుగా ఉన్నాయని అక్బరుద్దీన్ వెల్లడించారు.