శనివారం, 4 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 10 సెప్టెంబరు 2024 (15:53 IST)

ఉధృతంగా ప్రవహిస్తున్న గోదావరి నది : రెండో నంబర్ ప్రమాద హెచ్చరిక

godavari water level
గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తుంది. సోమవారం గోదావరి నీటి మట్టం 26 అడుగులుగా ఉన్న మంగళవారం మధ్యాహ్నానికి 46 అడుగులతో ప్రవహిస్తుంది. భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం మరో గంటలో 48 అడుగులకు చేరనుంది. దీంతో అధికారులు రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్నారు. మంగళవారం ఉదయం 7:30 గంటలకు గోదావరి నీటిమట్టం 43 అడుగులకు చేరుకోవడంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. 
 
ప్రస్తుతం భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతుండగా.. మరికొన్ని గంటల్లో  రెండో ప్రమాద హెచ్చరిక కూడా  జారీ కానుంది. సోమవారం నుంచి ఇప్పటివరకు గోదావరి నీటిమట్టం 20 అడుగులకు పైగా వేగంగా పెరిగింది. ఎగువ ప్రాంతాల నుంచి వచ్చే వరద కారణంగా గోదావరి నీటిమట్టం మరింత పెరిగే అవకాశం ఉందని కేంద్ర జలవనరుల శాఖ అధికారులు తెలిపారు. 
 
గోదావరి నీటిమట్టం పెరగడంతో పాటు దిగువ ప్రాంతంలో ఉన్న శబరి ఉపనది పోటెత్తడంతో ఏపీలోని పోలవరం ముంపు మండలాలకు రాకపోకలు నిలిచిపోయాయి. శబరి, సీలేరు ఉద్ధృతంగా ప్రవహించడంతో చింతూరు మండలంలోని పలు గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. భద్రాచలం వద్ద వేగంగా పెరుగుతున్న గోదావరిలో 11 లక్షల క్యూసెక్కులకు పైగా వరద నీరు దిగువకు ప్రవహిస్తోంది.