ఆదివారం, 5 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : ఆదివారం, 28 జులై 2024 (17:34 IST)

53 అడుగులకు చేరుకున్న గోదావరి తల్లి.. మూడో ప్రమాద హెచ్చరిక జారీ

Godavari
Godavari
భద్రాచలం వద్ద గోదావరి నది 53 అడుగులకు చేరుకోవడంతో మూడో ప్రమాద హెచ్చరికను ఇవ్వడం జరిగింది. శనివారానికే గోదావరి నది 53 అడుగుల వరద నీటిని కలిగివుంది. ముందుజాగ్రత్త చర్యగా ఇప్పటి వరకు 8 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ తెలిపారు. 
 
26 గ్రామాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. నీటిమట్టం పెరగడంతో  నీట మునిగిన గ్రామాల సంఖ్య పెరుగుతుందని అంచనా. వరద బాధిత కుటుంబాలకు బియ్యం, నూనె, కూరగాయలతో సహా సహాయక సామగ్రిని అందించారు. 
 
తాగునీరు సహా ఇతర నిత్యావసర సరుకులు కూడా అందిస్తున్నారు. యుద్ధ ప్రాతిపదికన మూడు బోరు బావులను తవ్వారు. 23 ఆర్‌ఓ ప్లాంట్ల నుంచి ట్యాంకర్ల ద్వారా నీటిని కూడా సరఫరా చేస్తున్నామని కలెక్టర్ తెలిపారు.
 
రిలీఫ్ సిబ్బంది దాదాపు 1.2 లక్షల వాటర్ ప్యాకెట్లు, 30,000 క్లోరిన్ మాత్రలు పంపిణీ చేశారు. ప్రజలకు చికిత్స అందించేందుకు 23 వైద్య శిబిరాలు ఏర్పాటు చేసినట్లు దినేష్‌కుమార్‌ తెలిపారు. వైద్యులు పడవల్లో ప్రతి ఆవాసాన్ని సందర్శించి ప్రజల ఆరోగ్యాన్ని పరిశీలిస్తున్నారు. 
 
నీటిమట్టం పెరగడం, మావోయిస్టులు అమరవీరుల వారోత్సవాలు నిర్వహిస్తున్నందున వరద ప్రభావిత ప్రాంతాల్లో వీఐపీలు వెళ్లకుండా చూడాలని పోలీసులు సూచించినట్లు కలెక్టర్‌ తెలిపారు.