శనివారం, 25 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 19 నవంబరు 2024 (12:43 IST)

పవన్ కళ్యాణ్‌కు ఊరట.. క్రిమినల్ కేసును ఎత్తివేత!

Pawan kalyan
ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌కు గుంటూరు ప్రత్యేక కోర్టులో ఊరట లభించింది. ఆయనపై దాఖలైన క్రిమినల్ కేసును గుంటూరు కోర్టు ఎత్తివేసింది. గత వైకాపా ప్రభుత్వ హయాంలో నియమించిన వలంటీర్లను ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలపై కడప, గుంటూరు, కృష్ణా జిల్లాలకు చెందిన వలంటీర్లు ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. 
 
దీంతో పవన్‌పై క్రిమినల్ కేసు నమోదు చేయాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్‌ను ఆదేశిస్తూ అదే నెల 20వ తేదీన అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ ఆదేశాలిచ్చారు. ప్రభుత్వం నేరుగా ఆదేశించడంతో గుంటూరు జిల్లా పబ్లిక్ ప్రాసిక్యూటర్ గుంటూరు కోర్టులో ఫిర్యాదు చేయడంతో పవన్‌పై 499, 500 ఐపీసీ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఈ కేసుపై పవన్ హైకోర్టును ఆశ్రయించారు. మరోవైపు, గుంటూరు కోర్టు తాజా విచారణలో పవన్‌పై తాము ఫిర్యాదు చేయలేదని వలంటీర్లు తెలిపారు. ఆ సంతకాలు తమవి కావని చెప్పారు. దీంతో కేసును ఎత్తివేస్తూ గుంటూరు ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి శరత్ బాబు ఉత్తర్వులు జారీచేశారు. 
 
కాగా, గతంలో వలంటీర్లను ఉద్దేశించి పవన్ కళ్యాణ్ ప్రసంగిస్తూ, వలంటీర్లు అసాంఘిక శక్తులుగా మారారంటూ ఆరోపించరు. గత యేడాది జూలై 9వ తేదీన ఏలూరులో నిర్వహించిన వారాహి సభలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 
 
ఇంట్లో మగవాళ్లు లేని సమయంలో వెళుతున్నారని, దండుపాళ్యెం బ్యాచ్‌ తరహాలో మారిపోయారంటూ ఆరోపించారు. దీంతో వైకాపా నేతల ఒత్తిడి మేరకు పలువురు వలంటీర్లు ప్రభుత్వానికి ఫిర్యాదు చేయడం, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశం మేరకు కేసు నమోదైంది.