శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : గురువారం, 15 జులై 2021 (09:16 IST)

కృష్ణాజిల్లా పాత కలెక్టర్ కు హైకోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ

కోర్టు ధిక్కరణ అంశంలో కృష్ణా జిల్లా పాత కలెక్టర్ ఎండి ఇంతియాజ్, డీఆర్‌డీఏ ప్రాజెక్టు డైరెక్టర్ (పీడీ) ఎం.శ్రీనివాసరావుపై హైకోర్టు నాన్  బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. 
 
వారిద్దరినీ అదుపులోకి తీసుకొని కోర్టులో హాజరుపరచాలని విజయవాడ పోలీసు కమిషనర్‌ను ఆదేశిస్తూ
విచారణను ఈనెల 28కి విచారణను వాయిదా వేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ బుధవారం ఈ మేరకు ఆదేశాలిచ్చారు. 
 
అర్హత ఉన్నప్పటికీ తమకు 'వైఎస్సార్ చేయూత' పథకం వర్తింపచేయడం లేదంటూ కృష్ణా జిల్లా చందర్లపాడు గ్రామానికి చెందిన 20 మంది ఎస్సీ, ఎస్టీ,బీసీ మహిళలు హైకోర్టును ఆశ్రయించారు.
 
వారికి ప్రయోజనాలు కల్పించాలని గతేడాది అక్టోబరు 22న హైకోర్టు అధికారులకు ఆదేశాలిచ్చింది. ఈ నేపథ్యంలోనే 2020-21 సంవత్సరానికి అధికారులు నిధులు మంజూరు చేశారు. 
 
అయితే 2019-2020 సంవత్సరానికి ప్రయోజనాలు కల్పించలేదని బాధితులు కోర్టు ధిక్కరణ వ్యాజ్యం వేశారు. కోర్టు ధిక్కరణ వ్యాజ్యం విచారణకు వస్తున్నందున ఉలిక్కిపడిన అధికారులు ఇటీవల 2019-2020 సంవత్సర నిధులు విడుదల చేశారు. 
 
దీనిపై బుధవారం జరిగిన విచారణకు కృష్ణా జిల్లా పూర్వ కలెక్టర్, డీఆర్‌డీఏ పీవోలు హాజరుకాలేదు. వారి తరఫు న్యాయవాదులు సైతం హాజరుకాకపోవడంతో హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. వారిద్దరిపై  కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీచేసింది.