పట్టణ ప్రణాళిక నమూనాను అధ్యయనం కోసం గుజరాత్‌లో పర్యటిస్తోన్న ఏపీ ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం
ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం గుజరాత్ రాష్ట్రంలో తమ మూడు రోజుల పర్యటనను గురువారం ఆరంభించింది. ఈ పర్యటన ద్వారా గుజరాత్ రాష్ట్రంలో పట్టణ ప్రణాళిక పథకాల అమలు మరియు ప్రణాళికాయుతమైన నగరాభివృద్ధిలో వాటి ప్రభావం అధ్యయనం చేయనున్నారు. రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాలలో పట్టణ ప్రణాళిక పథకాలను అమలు చేయాలని ప్రణాళిక చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రయత్నాల నేపథ్యంలో ఈ అధ్యయన పర్యటన జరుగుతుంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పురపాలక వ్యవహారాలు మరియు నగరాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి వై శ్రీలక్ష్మి నేతృత్వంలోని ప్రభుత్వ ఉన్నతాధికారులు, మున్సిపల్ కమిషనర్లు, టౌన్ ప్లానర్లు మరియు గృహ, నగరాభివృద్ధి అధికారులతో కూడిన 25 మంది ప్రతినిధుల బృందం గుజరాత్‌లో పర్యటిస్తుండటంతో పాటుగా అహ్మాదాబాద్‌లోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ టౌన్ ప్లానర్స్ ఇండియా (ఐటీపీఐ) అధికారులతో గురువారం సమావేశమయ్యారు.
గుజరాత్‌లో పట్టణ ప్రణాళిక నమూనా విజయవంతమైంది. రాష్ట్రంలో ప్రణాళికాబద్దమైన అభివృద్ధికి అది తోడ్పాటునందించింది. అయితే, ఇది విస్తృతస్థాయి, సాంకేతిక ప్రక్రియ. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ బృందం ఇక్కడ ఈ పట్టణ ప్రణాళిక నమూనా ఏవిధంగా పనిచేస్తుందో అర్ధం చేసుకోవాలనుకుంటుంది. సమగ్రమైన పట్టణ ప్రణాళికకు సంబంధించి పలు అంశాలను ప్రతినిధి బృందానికి తెలియజేశాం అని ఎన్‌కె పటేల్, జాతీయ అధ్యక్షులు-ఐటీపీఐ అన్నారు.
శుక్రవారం, ఈ ప్రతినిధి బృందం అహ్మదాబాద్‌లో పర్యటించడంతో పాటుగా పట్టణ ప్రణాళిక పథక అనుభవాలను సొంతం చేసుకున్నారు. ఆ తరువాత, అహ్మదాబాద్ నగరాభివృద్ధి అధికారులతో పట్టణ ప్రణాళిక పథకాల పునర్నిర్మాణం గురించి చర్చించనున్నారు. ప్రతినిధి బృంద పర్యటన వివరాల ప్రకారం వారు శుక్రవారం సాయంత్రం అహ్మదాబాద్ మున్సిపల్ కార్పోరేషన్‌ను సందర్శించనున్నారు. తద్వారా అభివృద్ధి హక్కుల బదిలీ(టీడీఆర్) వ్యవస్థను అర్థం చేసుకోవడంతో పాటుగా మురికివాడల అభివృద్ధి పథకం, రవాణా ఆధారిత అభివృద్ధి గురించి కూడా తెలుసుకోనున్నారు.
ఈ పర్యటన చివరి రోజైన శనివారం, ఈ ప్రతినిధి బృందం ఇంటర్నేషనల్ ఫైనాన్స్ టెక్-సిటీ (గిఫ్ట్)ను సందర్శించడంతో పాటుగా దేశంలోని ఒకే ఒక్క అంతర్జాతీయ ఆర్ధిక సేవల కేంద్రం (ఐఎఫ్‌ఎస్‌సీ)ను సైతం సందర్శించనుంది.