ఆదివారం, 3 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 1 డిశెంబరు 2019 (17:07 IST)

మద్యం సేవించి వాహనం నడిపితే ఇకపై ఫోటోను కూడా...

రోడ్డు ప్రమాదాలకు కారణం అవుతున్న వారిపై ట్రాఫిక్ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఇందులోభాగంగా, ఇప్పటికే పలు రకాల చర్యలు తీసుకుంటున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పట్టుబడితో వారి ఫోటోలను కూడా విడుదల చేయాలని భావిస్తున్నారు. 
 
నిజానికి మద్యం సేవించి వాహనాన్ని నడిపి పోలీసులకు చిక్కిన కొంతమంది పైరవీలు చేసి వేరేవ్యక్తి పేరుతో కేసులు నమోదు చేయించి కోర్టుకు వెళ్లకుండా తప్పించుకుంటున్నారు. వీటికి చెక్ పెట్టేందుకు పోలీసులు సరికొత్త వ్యూహం అనుసరించారు. ఇందుకోసం కొత్త బ్రీత్‌ ఎనలైజర్‌లు పోలీసులకు అందుబాటులోకి వచ్చాయి. అందులో ఆల్కహాల్‌ శాతంతో పాటు, వ్యక్తి ఫోటో, పరీక్ష సమయంలో వీడియో రికార్డింగ్‌ వస్తుంది. 
 
దీంతో ఇక మద్యం సేవించి వాహనం నడిపిన వారు పోలీసులకు చిక్కితే కోర్టుకు వెళ్లితీరాల్సిందే. సత్యనారాయణపురం ఫుడ్‌జంక్షన్‌ వద్ద మూడో ట్రాఫిక్‌ పోలీస్టేషన్‌ సీఐ దుర్గారావు ఆధ్వర్యంలో శనివారం సిబ్బంది కొత్త మిషన్లతో పరీక్షలు నిర్వహించి మద్యం సేవించి వాహనాలు నడుపుతున్నవారిపై కేసులు నమోదు చేశారు. పలు వాహనాలను సీజ్‌ చేశారు.
 
కాగా, ఈ మూడో ట్రాఫిక్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలో ఈ సంవత్సరం మద్యం సేవించి వాహనం నడుపుతున్న 599 మందిపైన కేసులు నమోదు చేశాం. వారిని కోర్టులో హాజరు పరచగా పది మందికి జడ్జి జైలు శిక్షసైతం విధించారు. ఒక్క నవంబరు నెలలోనే 83 మంది మద్యంసేవించి వాహనం నడుపుతూ పట్టుబడినట్టు పోలీసులు వెల్లడించారు.