బుధవారం, 8 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : ఆదివారం, 13 సెప్టెంబరు 2020 (07:31 IST)

ఎవరైనా కోవిడ్ బారిన పడితే.. అది వారి తప్పు కాదు

కోవిడ్-19 తో బాధపడుతున్న వ్యక్తులతో పాటు, వ్యాధిగ్రస్తులకు చికిత్స అందించే వైద్యులు, ఆరోగ్య కార్యకర్తలు, పారిశుద్ధ్య కార్మికులు మరియు పోలీసులు వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవడంలో ఎంతో శ్రమిస్తూ ముందు వరుసలో ఉన్నారు.

కోవిడ్-19 నుండి కోలుకున్న వారు సైతం అలాంటి వివక్షను ఎదుర్కొంటున్నారు. కోవిడ్ వ్యాప్తిని నిరోధించడంలో కీలకపాత్ర పోషిస్తున్న వారు ఎక్కడైనా కనిపించినా, మనతోపాటు ప్రయాణిస్తున్న వారిపట్ల వివక్షచూపకుండా వారిని గౌరవిద్దామంటూ రాష్ట్ర ప్రభుత్వం మాస్కే కవచం పేరుతో విస్తృత ప్రచారం నిర్వహిస్తోంది.  అలాగే బాధ్యత గలిగిన పౌరులుగా ఈ కింద తెలిపిన విషయాలను అర్థం చేసుకొని సహకరించాలని సూచించడం జరుగుతోంది.
 
1. కోవిడ్-19 ఇది అత్యంత వేగంగా వ్యాపించే అంటువ్యాధి మరియు మనలో ఎవరికైనా సోకుతుంది.  అయినప్పటికీ సామాజిక దూరం పాటించడం, క్రమం తప్పకుండా చేతులు కడుక్కోవడం మరియు తుమ్ము/ దగ్గు వచ్చినప్పుడు మోచేతులను లేదా టిష్యూ పేపర్ అడ్డుపెట్టుకోవడం ద్వారా మనల్ని మనం రక్షించుకోవచ్చు.
 
2. అన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ఎవరైనా వైరస్ బారిన పడితే అది వారి తప్పు కాదు. అలాంటి పరిస్థితిలో రోగికి మరియు రోగి కుటుంబానికి మద్దతు, సహకారం ఎంతో అవసరం. వైరస్ కి చికిత్స చేయగల పరిస్థితులు ఉన్నాయని, చాలా మంది వైరస్ నుండి పూర్తిగా  కోలుకున్నారని గమనించాలి.
 
3. ఇటువంటి సంక్షోభ పరిస్థితుల్లో సంరక్షణ మరియు వైద్య / క్లినికల్ సహాయాన్ని అందించడానికి వైద్యులు, నర్సులు మరియు అనుబంధ ఆరోగ్య నిపుణులతో సహా ఆరోగ్య సంరక్షణ కార్మికులు తమ వంతు సేవలను నిర్విరామంగా అందిస్తున్నారు. కోవిడ్-19 ను ఎదుర్కొనడంలో పారిశుద్ధ్య కార్మికులు,  పోలీసులు కూడా ఎంతో శ్రమిస్తున్నారు. వారందరికీ ఇప్పుడు ప్రజల మద్దతు, ప్రశంసలు అవసరం  
 
4. కోవిడ్-19 నిర్వహణలో ప్రత్యక్షంగా పాల్గొంటున్న వారందరికీ వైరస్ వ్యాప్తి నుండి సురక్షితంగా ఉండటానికి తగిన రక్షణ పరికరాలు ఇస్తారు. కాబట్టి వారి నుంచి వైరస్ సోకుతుందన్న భయం వద్దు. 
 
5. ప్రాణాలకు తెగించి అత్యవసర సేవలు అందిస్తున్న వైద్యులు, నర్సులు, అనుబంధ ఆరోగ్య నిపుణులు, ఆరోగ్య సంరక్షణ కార్మికులు, పారిశుద్ధ్య కార్మికులు మరియు పోలీసులు, ఇతర వృత్తి ప్రదాతలను మరియు వారి కుటుంబాలను లక్ష్యంగా చేసుకోవడం కోవిడ్-19కి వ్యతిరేకంగా భారతదేశం చేసే  పోరాటాన్ని బలహీనపరుస్తుంది.  
 
చేయకూడని పనులు:
- సోషల్ మీడియా మరియు ఇతర మీడియాలో వైరస్ బాధితుల లేదా గృహ నిర్బంధంలో ఉన్న వారి పేర్లు లేదా గుర్తింపును ఎప్పుడూ ప్రచారం చేయవద్దు.
 
- భయం మరియు భయాందోళనలను కలిగించే అసత్య వార్తలు వ్యాపింప చేయవద్దు. 
 
- విధి నిర్వహణలో ఉన్న ఆరోగ్య సంరక్షణ మరియు పారిశుద్ధ్య కార్మికులను లేదా పోలీసులను లక్ష్యంగా చేసుకోవద్దు. మీకు సహాయం చేయడానికే వారు అక్కడ ఉన్నారు.
 
- కోవిడ్ -19 వ్యాప్తిని ఏ సంఘానికో లేదా ప్రాంతానికో ఆపాదించవద్దు.
 
- చికిత్సలో ఉన్నవారిని కోవిడ్ బాధితులుగా సంబోధించడం మానుకోండి. అలాగే కోవిడ్ నుండి కోలుకుంటున్న వ్యక్తులను కోలుకుంటున్న వ్యక్తులుగా సంబోధించండి.