బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 29 ఆగస్టు 2020 (10:09 IST)

ఏపీ జూడాలకు ఉచితంగా కోవిడ్ వైద్యసేవలు

కరోనా మహమ్మారిని ఎదుర్కొనే సమయంలో తమ ప్రాణాలను పణంగా పెట్టి ఫ్రంట్ వారియర్స్‌గా పనిచేస్తున్న ఆంధ్రప్రదేశ్ జూనియర్ డాక్టర్స్‌కు కోవిడ్‌కు సంబంధించి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలను ఉచితంగా అందించనున్నట్లు సాయి భాస్కర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అధినేత, ప్రముఖ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్ డాక్టర్ బూసిరెడ్డి నరేందర్ రెడ్డి తెలిపారు.

విజయవాడ పుష్ప హోటల్ సెంటర్‌లోని సాయి భాస్కర్ హాస్పిటల్‌లో ఏపీ జూడాల సంఘం ప్రతినిధులకు ఈ మేరకు లిఖితపూర్వక హామీ పత్రాన్ని డాక్టర్ నరేందర్ రెడ్డి అందజేశారు. రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ వైద్యశాలలో పనిచేస్తున్న జూనియర్ డాక్టర్లు కోవిడ్ వైద్య సేవలు అందించే క్రమంలో కరోనా బారినపడిన సమయంలో వైద్య సేవలు పొందాలనుకునే వారు తక్షణం తమను సంప్రదించాలని సూచించారు.

మైల్డ్ , మోడరేట్, సివియర్ స్టేజీలలో సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిస్థాయిలో అందించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. గుంటూరులోని రెండు, విజయవాడలోని పుష్ప హోటల్ సెంటర్‌లో ఉన్న సాయి భాస్కర్ హాస్పిటల్‌లో కోవిడ్ వైద్య సేవలు అందించనున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు ప్రభుత్వ వైద్య శాఖ ఉన్నతాధికారులకు ఈమెయిల్ ద్వారా సమాచారాన్ని అందించినట్లు నరేందర్ రెడ్డి తెలిపారు.

జూడాల సంఘం ప్రతినిధులు డాక్టర్ కె.రాహుల్‌రాయ్, డాక్టర్ ఎస్.కార్తీక్ గౌడ్ మాట్లాడుతూ మానవతా దృక్పథంతో తమకు కోవిడ్ సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందించేందుకు ముందుకొచ్చిన డాక్టర్ నరేందర్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. కరోనా బారిన పడిన జూనియర్ డాక్టర్లకు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందించాల్సిందిగా ఇప్పటికే ప్రభుత్వాన్ని కోరామని తెలిపారు.

ఈ సమయంలో ప్రభుత్వ సహాయ స్పూర్తితో తమ కష్టాన్ని గుర్తించి తామున్నామంటూ ముందుకు రావడం అందరికీ కొండంత ధైర్యాన్నిచ్చింద‌న్నారు. కార్యక్రమంలో సాయి భాస్కర్ హాస్పిటల్ వైద్యులు డాక్టర్ కోటగిరి ఆకర్ష్, డాక్టర్ దొడ్డపనేని విజయ్‌కుమార్, డాక్టర్ దీపక్ తదితరులు పాల్గొన్నారు.