గురువారం, 5 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 13 ఫిబ్రవరి 2023 (12:45 IST)

గవర్నర్ హరిచందన్ బదిలీ కావడం బాధాకరం : సీఎం జగన్

jagan
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నరుగా ఉన్న బిశ్వభూషణ్ హరిచందన్ బదిలీ కావడం చాలా బాధాకరమని ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఆదివారం ఏడు రాష్ట్రాలకు గవర్నర్లను కేంద్రం నియమించింది. ఇందులోభాగంగా ఏపీ గవర్నర్ హరిచందన్‌ను ఉత్తరాఖండ్‌కు బదిలీ చేసింది. ఏపీ గవర్నర్‌గా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ అబ్దుల్ నాజర్‌ను నియమించింది. 
 
ఈ నేపథ్యంలో ఏపీ గవర్నర్ హరిచందన్ బదిలీపై ముఖ్యమంత్రి జగన్ స్పందించారు. గవర్నర్ హరిచందన్‌తో కలిసి పని చేయడం గౌరవంగా భావిస్తున్నానని తెలిపారు. ఆయనతో తన అనుబంధం ఆత్మీయతతో కూడుకున్నదని తెలిపారు. రాష్ట్రం నుంచి ఆయన వెళ్ళిపోవడం చాలా బాధాకరమన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయం సజావుగా సాగడంలో హరిచందన్ కీలక పాత్రను పోషించారని తెలిపారు. 
 
ఏపీకి ఆయన చేసిన సేవలకు గాను కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని చెప్పారు. అదేసమయంలో ఛత్తీస్‌గఢ్ గవర్నరుగా బాధ్యతలు స్వీకరించబోతున్న హరిచందన్‌కు అభినందనలు తెలుపుతున్నట్టు చెప్పారు. అదేసమయంలో ఏపీ నూతన గవర్నర్‌గా నియమితులైన జస్టిస్ అబ్దుల్ నాజర్‌ను సాదరంగా ఆహ్వానిస్తున్నట్టు చెప్పారు.