శుక్రవారం, 8 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 3 ఏప్రియల్ 2021 (09:16 IST)

టీడీపీ ఏపీ ఉపాధ్యక్ష పదవికి జ్యోతుల నెహ్రూ రాజీనామా

పరిషత్ ఎన్నికలను బహిష్కరించాలని టీడీపీ అధినేత చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. చంద్రబాబు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ టీడీపీ ఏపీ ఉపాధ్యక్ష పదవికి జ్యోతుల నెహ్రూ రాజీనామా చేశారు.

అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ టీడీపీ అధిష్టానం జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను బహిష్కరించడం నిరాశ కలిగించిందని చెప్పారు. అయితే రాష్ట్ర  ఉపాధ్యక్ష పదవికి మాత్రమే రాజీనామా చేశానని తెలిపారు.

జగ్గంపేట నియోజకవర్గం టీడీపీ ఇన్‌చార్జ్‌గా మాత్రమే కొనసాగుతానని ప్రకటించారు. నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికీ అండగా ఉంటానని జ్యోతుల నెహ్రూ భరోసా ఇచ్చారు.
 
పరిషత్ ఎన్నికలను బహిష్కరిస్తూ టీడీపీ నిర్ణయం తీసుకుంది. అందుకు కారణం కూడా ఆ పార్టీ తెలిపింది. అక్రమాలు జరిగిన ఎన్నికలనే కొనసాగిస్తున్నారని, ఎస్‌ఈసీ తీరును తప్పుబడుతూ ఎన్నికలు బహిష్కరిస్తున్నట్లు టీడీపీ అధిష్టానం ప్రకటించింది.

బలవంతపు, అక్రమ ఏకగ్రీవాలపై చర్యలు తీసుకోక పోవడాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు తప్పుబట్టారు. పొలిట్‌బ్యూరో నిర్ణయం మేరకు ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఎన్నికల బహిష్కరణ కఠిన నిర్ణయమే అయినా తప్పడంలేదని చంద్రబాబు వ్యాఖ్యానించారు. 
 
రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ శుక్రవారం నిర్వహించే పార్టీల సమావేశంలో కూడా ఈ డిమాండ్‌ను బలంగా వినిపించాలని టీడీపీ భావించింది. అయితే ఆ సమావేశం జరపకుండానే కమిషనర్‌ నోటిఫికేషన్‌ జారీ చేయడంపై ఆ పార్టీ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

గత ఎస్‌ఈసీ రమేశ్‌కుమార్‌ కొంత ప్రయత్నం చేసినా వైసీపీ దౌర్జన్యాలను, అధికార దుర్వినియోగాన్ని అడ్డుకోలేకపోయారని..  కొత్త కమిషనర్‌ ఆ మాత్రం ప్రయత్నం కూడా చేసే పరిస్థితి లేనప్పుడు ఇక ఈ ఎన్నికల్లో పాల్గొనడం వల్ల ప్రయోజనం ఏమిటని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు