గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 27 మార్చి 2021 (17:15 IST)

నీలం సాహ్ని రాజీనామా

సీఎం ముఖ్యసలహాదారు పదవికి మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని రాజీనామా చేశారు. ఆమె రాజీనామాను ప్రభుత్వం ఆమోదించింది. ప్రధాన కార్యదర్శిగా పదవీవిరమణ చేసిన తర్వాత ఆమెను ప్రభుత్వ సలహాదారుగా నియమించారు.

అయితే ఈ పదవిలో సాహ్ని రెండేళ్ల పాటు ఉండేవారు. అనూహ్య పరిణామాల నేపథ్యంలో సాహ్నిని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా ప్రభుత్వం నియమించింది. త్వరలో ఆమె ఎస్‌ఈసీగా బాధ్యతలు చేపడుతారు. దీంతో ఆమె ప్రభుత్వ ముఖ్యసలహాదారు పదవికి రాజీనామా చేశారు. 
 
రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నీలం సాహ్నిని నియమిస్తూ గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నియామకం కోసం రాష్ట్రప్రభుత్వం రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారులు శామ్యూల్‌, ఎల్‌.ప్రేమ్‌చంద్రారెడ్డి, నీలం సాహ్ని పేర్లలతో కూడిన జాబితాను ఆయనకు పంపించింది. అయితే గవర్నర్‌ ఈ ముగ్గురి రికార్డులతో పాటు గత మూడేళ్లలో రిటైరైన 11 మంది ఐఏఎస్‌ అధికారుల పేర్లను కూడా పరిగణనలోకి తీసుకోవడం గమనార్హం. 
 
జగన్మోహన్‌రెడ్డి అక్రమాస్తుల కేసుల్లో శామ్యూల్‌ కూడా సహనిందితుడని, ఆయన్ను రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నియమించవద్దంటూ ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ కూడా డిమాండ్‌ చేసింది. కేసుల కారణంగా ఆయన పేరును గవర్నర్‌ పక్కనపెట్టేశారు.

మిగిలిన ప్రేమ్‌చంద్రారెడ్డి, నీలం సాహ్నిలకు సంబంధించిన వార్షిక రహస్య నివేదిక(ఏసీఆర్‌)లను తెప్పించుకున్నారు. వారి సర్వీసులో చివరి ఐదేళ్లకు చెందిన ఏసీఆర్‌లను పరిశీలించారు. ఇందులో నీలంకే అత్యధిక మార్కులు రావడంతో ప్రేమ్‌చంద్రారెడ్డి పేరును కూడా పక్కనపెట్టారు.