మమతకు షాక్.. పార్టీకి సీనియర్ మంత్రి రాజీనామా
అసెంబ్లీ ఎన్నికలకు ముందే తృణమూల్ కాంగ్రెస్ కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ సీనియర్ నాయకుడు, రవాణా, నీటిపారుదల శాఖ మంత్రి సువేందు అధికారి శుక్రవారం తన పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను ముఖ్య మంత్రి మమతా బెనర్జీకి పంపారు.
ఒక కాపీని గవర్నర్ జగదీప్ దంఖర్ కు మెయిల్ చేశారు. గత కొంత కాలంగా పార్టీకి దూరంగా ఉంటున్న ఆయన చివరకు ప్రభుత్వం నుంచి వైదొలగుతున్నట్టు వెల్లడించారు. దీంతో రానున్న అసెంబ్లీ ఎన్నికలకు ముందే తృణమూల్ అధినేత మమతా బెనర్జీకి భారీ షాక్ తగిలినట్టయింది.
గురువారం హూగ్లీ రివర్ బ్రిడ్జ్ కమిషన్ చైర్మన్ పదవి నుంచి తప్పుకున్న ఆయన... తాజాగా తన మంత్రి పదవి నుంచి కూడా తప్పుకున్నారు. ఈ మేరకు ఆయన ముఖ్యమంత్రికి రాసిన లేఖలో తన రాజీనామాను వెంటనే ఆమోదించాలని కోరారు.
అయితే, రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తిరిగి అధికారం చేపట్టాలని చూస్తోన్న మమతకు... అధికారి రాజీనామాతో అసమ్మతి సెగ భారీగానే తగిలినట్లయింది.
క్లిష్టసమయంలో ఒక్కొక్కరు దూరమవుతుండడం, మరీ ముఖ్యంగా ఈ నెలలో జరిగిన క్యాబినెట్ సమావేశానికి ఐదుగురు మంత్రులు గైర్హాజరు కావడం ఆ పార్టీలో మరింత కలవరం పుట్టిస్తోంది. దీంతో తృణమూల్ కాంగ్రెస్‌లో తాజా తిరుగుబాటు చర్చనీయాంశంగా మారింది.