టీటీడీ ఆధ్వర్యంలోని శ్రీ వెంకటేశ్వర భక్తి చానల్ చైర్మన్ పదవికి పృథ్వీరాజ్ రాజీనామా చేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సిద్ధాంతాన్ని గౌరవిస్తూ ఎస్వీబీసీ చైర్మన్ పదవికి రాజీనామ చేస్తున్నట్టు పృథ్వీ ప్రకటించారు. ఒక మహిళతో పృథ్వీ అసభ్యంగా మాట్లాడినట్టు కొన్ని ప్రసార మాధ్యమాల్లో ఆడియో ప్రసారాలు జరగడంతో.. టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి విజిలెన్స్ విచారణకు ఆదేశించారు.
దీంతో ఆడియో టేపుల్లోని వాయిస్ శాంపిల్‌ను టీటీడీ విజిలెన్స్ అధికారులు ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించారు. అలాగే ఈ అంశాన్ని వైవీ సుబ్బారెడ్డి సీఎం వైఎస్ జగన్ దృష్టికి కూడా తీసుకెళ్లారు. దీంతో పృథ్వీని రాజీనామా చేయాల్సిందిగా సీఎం వైఎస్ జగన్ ఆదేశించినట్టుగా తెలిసింది.
అయితే ఈ క్రమంలో తనపై వచ్చిన ఆరోపణలను ఖండించిన పృథ్వీ తాను ఎటువంటి విచారణకైన సిద్దమేనని స్పష్టం చేశారు. ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ ‘నాపై వచ్చిన ఆరోపణలు అవాస్తవం. ఆ ఆరోపణలపై టీటీడీ విజిలెన్స్ అధికారులతో విచారణ జరిపించాలని కోరాను.
నేను ఎస్వీబీసీ చైర్మన్‌గా 2019 జూలై 28న ప్రమాణం స్వీకారం చేశాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి, వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డికి కృతజ్ఞతలు. ప్రక్షాళన దిశగా ఎస్వీబీసీ కోసం పనిచేశాను. తిరుపతిలో ఉన్నప్పుడు రాజకీయాల గురించి మాట్లాడాను అని అన్నాను.
ఇదంతా చూస్తుంటే నన్ను దెబ్బతీయడం కోసమే.. ఈ కుట్రలు చేసినట్టు ఉంది. పార్టీ సిద్ధాంతానికి కట్టుబడి ఉన్నాను. రైతులందరినీ పెయిడ్ ఆర్టిస్టులు అనలేదు. అన్నం పెట్టే రైతుని నేను పెయిడ్ ఆర్టిస్టులు అనలేదు. కార్పొరేటు ముసుగులో ఉన్నవారి గురించి మాట్లాడితే అంత కోపం ఎందుకు?.
అసలైన రైతులు నా మాటల వల్ల బాధపడితే వారికి క్షమాపణలు చెప్తున్నా. నామీద కుట్రలు చేస్తున్నారని కొందరు మీడియా మిత్రులు చెప్పారు. నకిలీ వాయిస్ పెట్టి నాపై దుష్ప్రచారం చేశారు. మేకప్‌మేన్ వెంకట్‌రెడ్డి ప్రవర్తన సరిగా లేదని.. హైదరాబాద్ ఆఫీస్‌లో పనిచేయమని చెప్పాను. దీంతో వరదరాజులు అనే వ్యక్తితో కలిసి అసత్య ప్రచారం చేశారు.
నా వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బకొట్టినందుకు బాధ కలుగుతోంది. పార్టీ సిద్దాంతాన్ని గౌరవిస్తూ రాజీనామా చేస్తున్నాను. కాంట్రాక్టు ఉద్యోగుల నియామకంలో నా ప్రమేయం లేదు. విజిలెన్స్ రిపోర్ట్ వచ్చాక వాస్తవాలు తెలుస్తాయి. మహిళతో మాట్లాడింది నేను కాదు. నా గొంతును ఎవరో మిమిక్రీ చేశారు.
ఈ ఘటనపై పోలీసులుకు ఫిర్యాదు చేశాను. ఏ ఉద్యోగి కూడా నాపై వేరే ఉద్దేశం లేదు. నేను మద్యం మానేసి చాలా కాలం అయింది. పద్మావతి అమ్మవారి పవిత్ర స్థలంలో మందు తాగుతున్నానని చెడు ప్రచారం చేశారు. వైద్యులతో నాకు పరీక్షలు చేసినా సిద్దమే. ఎస్వీబీసీ చానల్ నిధులు ఒక్క రూపాయి కూడా తినలేదు. నాపై దుష్ప్రచారం చేయడంతో మా కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమవుతున్నారు.
నాపై దుష్ప్రచారం చేసినవారికి సవాలు విసురుతున్నాను. నేను ఏ పరీక్షకైనా సిద్దంగా ఉన్నాను. నాపై వచ్చిన అపవాదులు తొలగిపోయాక మళ్లీ బాధ్యతలు తీసుకుంటాను. నా రాజీనామాను ఫ్యాక్సులో పంపించాను. ఇక పదో తేదీ నాపై దాడి జరిగింది. కొందరు వ్యక్తులు నా మొహంపై పిడిగుద్దలు గుద్ది పారిపోయారు. ’ అని తెలిపారు.
తనను దెబ్బతీసేందుకు కొంతమంది అనేక రకాలుగా ప్రయత్నించారని ఆరోపించారు. ఫేక్ వాయిస్‌తో తనపై దుష్ప్రచారం చేశారని, తాను మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించలేదని చెప్పుకొచ్చారు. తన కుటుంబం, స్నేహితులు ఎంతో బాధపడ్డారని పృథ్వీ ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్వీబీసీ ఉద్యోగులతో స్నేహంగా ఉంటానని, పద్మావతి గెస్ట్‌హౌస్‌లో మందు తాగానని దుష్ప్రచారం చేశారని చెప్పారు.
తనకు మందుతాగే అలవాటు లేదని, పద్మావతి గెస్ట్‌హౌస్‌లో తాగానని నిరూపితమైతే ఈ చెప్పుతో కొట్టండని తన కాలికి ఉన్న చెప్పును తీసి మీడియా మైకుల ముందు పృథ్వీ పెట్టడంతో మీడియా ప్రతినిధులు విస్తుపోయారు. తాను తాగలేదని, ఎలాంటి పరీక్షలకైనా సిద్ధమని పృథ్వీ ప్రకటించారు.
పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేస్తానని, తిరుమలలో అన్యమత ప్రచారాన్ని ఖండించానని పృథ్వీ చెప్పుకొచ్చారు. నటుడు పోసాని కృష్ణమురళి తనకు మంచి మిత్రుడని నటుడు పృథ్వీ చెప్పారు. తమ ఇద్దరి మధ్య గొడవలు పెట్టి వివాదాలు సృష్టించారని ఆరోపించారు. పోసాని తిట్టినా ఆశీర్వాదంగానే భావిస్తానని తెలిపారు.
విజిలెన్స్ విచారణ చేపట్టాలని కోరానని, ఆరోపణలకు భయపడి పారిపోనని పేర్కొన్నారు. విచారణ పూర్తయ్యాక ఎస్వీబీసీలో తిరిగి అడుగుపెడతానని పృథ్వీ తెలిపారు.
రాజధాని రైతులపై పృథ్వీరాజ్ వ్యాఖ్యలకు నటుడు పోసాని కృష్ణ మురళి కౌంటరిచ్చిన విషయం తెలిసిందే. రాజధాని రైతుల్ని పెయిడ్ ఆర్టిస్టులు అనడం ఘోరమన్నారు. 3 పంటలు పండే భూముల్ని రాజధాని కోసం వదులుకున్నారని, రైతులు చొక్కా, ప్యాంట్లు వేసుకోకూడదా? అని పోసాని ప్రశ్నించారు.
రైతుల్ని పెయిడ్ ఆర్టిస్టులు అన్న పృథ్వీ సిగ్గుపడాలన్నారు. ఎవరు పెయిడ్ ఆర్టిస్టులు? అమరావతి ఆడపడుచులా? అమరావతిలో ఉన్న కమ్మ వాళ్లా? అని పోసాని ప్రశ్నల వర్షం కురిపించారు.