శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : సోమవారం, 24 ఆగస్టు 2020 (08:27 IST)

సోనియా రాజీనామా?

వరుసగా వచ్చి పడుతున్న ఓటములు, వయోభారంలతో సతమతమవుతున్న కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియాగాంధీ తన పదవికి రాజీనామా చేశారా?.. పార్టీని నడపడం ఇక తన వల్ల కాదని చేతులెత్తేశారా?.. అవుననే అంటున్నాయి రాజకీయ వర్గాలు.

ఇక ఆమె రాజీనామాను పార్టీ ఆమోదించడమే మిగిలిందని వ్యాఖ్యానిస్తున్నాయి. సార్వత్రిక ఎన్నికల్లో వరుసగా రెండోసారి సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి పాలవడంతో రాహుల్‌ గాంధీ అధ్యక్ష పదవి నుంచి తప్పుకున్నారు. సోనియా గాంధీకి గత ఏడాది ఆగస్ట్‌ 9న తాత్కాలిక చీఫ్‌ బాధ్యతలను కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ కట్టబెట్టింది.

పార్టీనాయకత్వంలో మార్పులు తీసుకురావల్సిన సమయం ఆసన్నమైందన్న చర్చ తెరపైకి వచ్చింది. మరోవైపు పార్టీలో సమర్థ శాశ్వత నాయకత్వ అవసరం, పార్టీలో కొన్ని మార్పులు సూచిస్తూ 23 మంది సీనియర్లు ఆదివారం కాంగ్రెస్‌ అధినేత్రికి లేఖ రాశారు.

దీనిపై సోనియా గాంధీ స్పందిస్తూ, అందరం కలిసి ఉమ్మడిగా కొత్త అధ్యక్షుడిని వెతుకుదామని చెప్పారని సమాచారం. ఇక మీదట పార్టీ సారథ్య బాధ్యతలను మోయలేనని వారితో వ్యాఖ్యానించినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఆగస్టు 10న పార్టీ అధ్యక్ష గడువు ముగియడంతో మరోసారి సోనియానే అధ్యక్ష బాధ్యతలు చేపట్టాలని పార్టీ కమిటీ కోరినప్పటికీ, తాను ఏ మాత్రం సుముఖంగా లేనని ఆమె వారితో పేర్కొన్నట్లు పార్టీ సీనియర్‌ నాయకుడొకరు తెలిపారు.

ఈ నేపథ్యంలో ఆదివారం పార్టీ అధ్యక్ష పదవి నుంచి సోనియా వైదొలిగినట్లు తెలుస్తోంది. సోమవారం జరుగనున్న కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ (సిడబ్ల్యుసి) సమావేశంలో ఆమె రాజీనామాను అధికారికంగా ప్రకటిస్తారని తెలుస్తోంది.

ఒకవేళ అధ్యక్ష పదవికి సోనియా రాజీనామా చేస్తే మరోసారి రాహుల్‌ గాంధీకి పార్టీ పగ్గాలు అప్పగిస్తారా? లేక కొత్త నేతను ఎన్నుకుంటారా? అనేది జాతీయ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.