ఈ ఆరోగ్య సంక్షోభాన్ని ఓడిద్దాం: సోనియా గాంధీ
దేశ రక్షణ కోసం నిత్యం శ్రమిస్తున్న వైద్యులు, పోలీసులు, ఇతర అత్యవసర సిబ్బందిని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ కొనియాడారు. ఈ మేరకు సోనియా ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు.
కొవిడ్-19పై పోరులో ప్రజలకు కాంగ్రెస్ సహకరిస్తుందని, ప్రజల వెన్నంటే ఉంటుందని తెలిపారు. అతి త్వరలోనే వైరస్ను అంతమొందించడంలో దేశం విజయం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో దేశరక్షణకు పాటుపడుతున్న వైద్యులు, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులు, ఇతర అత్యవసర సేవల్లో విధులు నిర్వర్తిస్తున్న సిబ్బంది సేవల కంటే గొప్ప దేశభక్తి ఏముంటుందని కొనియాడారు.
వారి స్ఫూర్తిని తీసుకొని మరింత ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ, ఐక్యతాభావంతో ఈ ఆరోగ్య సంక్షోభాన్ని ఓడిద్దాం అని దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. కరోనా మహమ్మారిని ఓడించేందుకు దేశ ప్రజలు చూపుతున్న తెగువ, సహనానికి సోనియా కృతజ్ఞతలు తెలిపారు.
ఇదే స్ఫూర్తిని మున్ముందూ కొనసాగించాలని పిలుపునిచ్చారు. అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావొద్దని సూచించారు. జాతిని ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించనున్న కాసేపటి ముందు సోనియా ఈ వీడియో సందేశాన్ని విడుదల చేశారు.