1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Updated :విజయవాడ , శనివారం, 18 సెప్టెంబరు 2021 (16:15 IST)

తండ్రి, కొడుకులు రాష్ట్రంలో గందరగోళం సృష్టిస్తున్నారు

పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా పని చేసిన చంద్రబాబు నాయుడు కోడెల వర్ధంతి సభలో అయ్యన్నపాత్రుడు చేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, రాష్ట్ర మంత్రులపై అసభ్యకరంగా మాట్లాడించిన విధానంపై సభ్య సమాజం తలదించుకుంటోందని వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, పొన్నూరు ఎమ్మెల్యే కిలారి వెంకట రోశయ్య అన్నారు. రాష్ట్ర ప్రజలకు అయ్యన్నపాత్రుడు క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
 
పొన్నూరు పట్టణంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ కార్యాలయంలో శనివారం రాష్ట్ర అధికార ప్రతినిధి, పొన్నూరు ఎమ్మెల్యే కిలారి వెంకట రోశయ్య మీడియా సమావేశం నిర్వహించి చంద్రబాబు టీమ్ పై ధ్వజమెత్తారు. చంద్రబాబు నాయుడు హైదరాబాద్ లో ఉన్నన్నాళ్లు రాష్ట్రం ప్రశాంతంగా ఉందని, తిరిగి బాబు రాష్ట్రంలో అడుగుపెట్టిన నాటి నుంచి గందరగోళ పరిస్థితులను సృష్టించే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు.
 
 అయ్యన్న మాటలపై నిరసన తెలియజేసేందుకు వెళ్ళిన ఎమ్మెల్యే జోగి రమేష్ పై వందలాది మంది టిడిపి గుండాలు, రౌడీషీటర్లతో దాడికి పాల్పడిన విధానాన్ని చూస్తుంటే మీ వైఖరి ఏమిటో స్పష్టమవుతోందన్నారు. ముఖ్యమంత్రి జగన్ సారధ్యంలో రాష్ట్రం సంక్షేమాంధ్రప్రదేశ్ గా రూపాంతరం చెందటం చూసి ఓర్వలేక, అక్కసుతో చంద్రబాబు లోకేష్ టీమ్ రాష్ట్రంలో గందరగోళ పరిస్థితులను సృష్టిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని నిప్పులుచెరిగారు. 
 
మీకు దమ్ముంటే, మీలో ఏదైనా సత్తా ఉంటే నేరుగా చర్చకు రావాలని చంద్రబాబు, లోకేష్ కు ఎమ్మెల్యే కిలారి సవాల్ విసిరారు. ప్రజల బాగోగులు ఏనాడు పట్టని మీకు ముఖ్యమంత్రి జనరంజక పాలన చూసి కన్నుకుడుతోందన్నారు. జోగి రమేష్ పై దాడికి తెగబడింది కాక ఇక్కడి మాజీ శాసనసభ్యుడితో పాటు మరికొందరు కులాల ప్రస్తావన తీసుకువచ్చి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. గతంలో రాష్ట్రంలో టిడిపి శ్రేణులు చేసిన కుట్రలు కుతంత్రాలు కోకొల్లలని, త్వరలో మీ అందరి బండరాలు బయటకు వస్తాయని హెచ్చరించారు. నైతిక విలువలు పాటించే వారైతే రాష్ట్ర ప్రజలకు పచ్చపార్టీ శ్రేణులు క్షమాపణ చెప్పాలన్నారు ఎమ్మెల్యే కిలారి వెంకట రోశయ్య.