శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : శనివారం, 4 మే 2019 (14:43 IST)

అవసరాలు తీరాక మోడీతో చంద్రబాబు గొడవ : కేవీపీ ఫైర్

ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుపై కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు విమర్శలు గుప్పించారు. గత ఐదేళ్ళ కాలంలో చంద్రబాబు వల్ల రాష్ట్రానికి జరిగిన న్యాయం కంటే నష్టమే అధికంగా జరిగిందన్నారు. 
 
ఆయన శనివారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ, నాలుగు దశాబ్దాల ఏపీ ముఖ్యమంత్రి అనుభవం హెరిటేజ్ ఆస్తులను, రాష్ట్రానికి అప్పులను పెంచిందని ఆయన ఆరోపించారు. పోలవరం విషయంలో రాష్ట్రంపై అదనపు భారం పడటానికి కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించదని చెప్పారు. పోలవరం విషయంలో కేంద్రంతో ఏపీ ముఖ్యమంత్రి కుమ్మక్కై చేసిన ద్రోహాన్ని ఆంధ్రజాతి ఖచ్చితంగా గుర్తుంచుకుంటుందన్నారు. 
 
విభజన వల్ల ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న ఏపీకి కేంద్రం నుంచి ఆర్థిక తోడ్పాటును పొందేందుకు తాను చేస్తున్న ప్రయత్నానికి ముఖ్యమంత్రి కూడా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. పోలవరం నిర్మాణం విషయంలో ఏపీ ముఖ్యమంత్రి వైఖరి వల్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తీరని నష్టం జరిగిందని కేవీపీ ఆరోపించారు. ఏపీ ముఖ్యమంత్రి స్వార్థం కోసం రాజకీయ ప్రయోజనాల కోసం కేంద్ర ప్రభుత్వంతో లాలూచీ పడి, మరికొంతకాలం గొడవలు పెట్టుకుని, మీవల్ల రాష్ట్రానికి మేలు జరుగుతుందని నమ్మి అధికారం కట్టబెట్టిన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తీరని ద్రోహం చేవారని మండిపడ్డారు. 
 
రాష్ట్ర ప్రయోజనాలను ఫణంగా పెట్టి స్వప్రయోజనాలే లక్ష్యంగా పోలవరం నిర్మాణాన్ని ఏపీ ముఖ్యమంత్రి తన చేతుల్లోకి తీసుకున్నారని ఆరోపించిన కేవీపీ... పోలవరం నిర్మాణం తన చేతుల్లోకి వస్తే తనకు జరిగే లాభాన్ని గుర్తుతెచ్చుకొని ఏపీ ముఖ్యమంత్రి కేంద్ర ప్రభుత్వం చెప్పినదానికల్లా ఒప్పుకున్నారని కేవీపీ విమర్శలు గుప్పించారు.