గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 4 ఏప్రియల్ 2024 (11:01 IST)

సీఎం జగన్మోహన్ రెడ్డికి పురంధేశ్వరి లీగల్ నోటీసులు.. ఎందుకో తెలుసా?

purandeswari
ఏపీ ముఖ్యమంత్రి, వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డికి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ చీఫ్ దగ్గుబాటి పురంధేశ్వరి లీగల్ నోటీసులు పంపించారు. విశాఖ డ్రగ్స్ వ్యవహారంలో సంధ్యా ఆక్వా కంపెనీకి, పురంధేశ్వరికి సంబంధాలు ఉన్నాయంటూ వైకాపా నేతలు ఆరోపిస్తున్న విషయం తెల్సిందే. ఈ ఆరోపణలను పురంధేశ్వరి మొదటి నుంచి ఖండిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో, సీఎం జగన్మోహన్ రెడ్డికి పురంధేశ్వరి ఈ నెల ఒకటో తేదీన లీగల్ నోటీసులు పంపారు.
 
జగన్, ఆయన సతీమణి భారతీ రెడ్డికి చెందిన సొంత పత్రిక సాక్షిలో గత నెల 22 నుంచి 24 వరకు వరుసగా మూడ్రోజుల పాటు తనపై అసత్య కథనాలు ప్రచురించారని పురంధేశ్వరి ఆరోపించారు. సంధ్యా ఆక్వా కంపెనీలో తన కుటుంబ సభ్యులు భాగస్వాములుగా ఉన్నారని ఆ కథనాల్లో పేర్కొన్నారని, వాస్తవానికి ఆ కంపెనీకి, తన కుటుంబ సభ్యులకు సంబంధం లేదని స్పష్టం చేశారు. సంధ్యా ఆక్వా యాజమాన్యంతో తమకు ఎలాంటి బంధుత్వం లేదని తెలిపారు.
 
సాక్షి పత్రిక ప్రచురణ సంస్థ జగతి పబ్లికేషన్స్ పరువునష్టం కింద రూ.20 కోట్లు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నామని వివరించారు. వైసీపీ నేతలు చేసే తప్పుడు ప్రచారానికి ముఖ్యమంత్రిగా, వైసీపీ పార్టీ అధినేతగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బాధ్యత వహించాల్సి ఉంటుందని లీగల్ నోటీసులో స్పష్టం చేశారు. తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు పురంధేశ్వరి తన న్యాయవాది వీవీ సతీశ్ ద్వారా లీగల్ నోటీసు పంపారు.
 
తాజాగా, ఈ అంశంపై పురంధేశ్వరి సోషల్ మీడియాలో స్పందించారు. డ్రగ్స్ కేసులో దోషులను, అసలు నిజాలను దాచిపెడుతున్న వైసీపీ నేతలు ప్రతిపక్షాల మీద నెట్టివేసే కుతంత్రాలు చేస్తున్నారని మండిపడ్డారు. సంధ్యా ఆక్వా కంపెనీతో, తనకు గానీ, తన కుటుంబానికి గానీ ఎలాంటి సంబంధం లేదని తెలిపారు. ఎలాంటి మచ్చ లేని తన రాజకీయ జీవితంపై జగన్, అతని అనుచరులు జగతి పబ్లికేషన్స్ ద్వారా చేస్తున్న అసత్య ప్రచారాలను ఖండిస్తూ న్యాయపరమైన పోరాటం చేస్తున్నానని పురంధేశ్వరి వెల్లడించారు.