శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : గురువారం, 5 మార్చి 2020 (05:31 IST)

7, 8 తేదీలలో లేపాక్షి వేడుకలు: మధురానుభూతిని మిగిల్చే వైభవం

రాయలసీమ జీవనశైలి, సంస్కృతి ప్రతిబంభించేలా లేపాక్షి ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు అనంతపురం జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు వెల్లడించారు. 

విజయవాడలోని కలెక్టర్ విడిది కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో పర్యాటకశాఖ ఎండి ప్రవీణ్ కుమార్, పర్యాటక శాఖ ప్రాంతీయ సంచాలకులు బి.ఈశ్వరయ్యలతో కలిసి గంధం చంద్రుడు మాట్లాడుతూ.. మార్చి 7, 8 రెండు రోజుల పాటు లేపాక్షి వైభవం-2020 పేరిట ఘనంగా ఉత్సవాలు నిర్వహిస్తున్నామన్నారు. 

ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఈ వేడుకల్లో భాగస్వామ్యం అవ్వాలని కోరారు. రాయలసీమ ప్రాంతంలో ఎన్నో పర్యాటక ప్రదేశాలు ఉన్నాయన్నారు. దక్షిణ భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనంతపురం జిల్లాలో అందమైన కుగ్రామంగా నిలిచిన లేపాక్షి ప్రాంతం అనేది ఒక సాంస్కృతిక మరియు వారసత్వ సంపదగా ఖ్యాతి సంపాదించిందన్నారు.

15 కమిటీలను ఏర్పాటు చేసి, ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తున్నట్లు తెలిపారు. లేపాక్షి గ్రామం కర్ణాటకలోని బెంగళూరు ప్రాంతానికి 120 కిమీ, హిందూపురం ప్రాంతానికి 15 కిమీ దూరంలో ఉందన్నారు.

అనంతపురం జిల్లా యంత్రాంగం మరియు ఆంధ్రప్రదేశ్ టూరిజం శాఖ సంయుక్త  ఆధ్వర్యంలో లేపాక్షి వైభవం 2020 పేరుతో మార్చి 7, 8వ తేదీలలో లేపాక్షిలోని ఏపీఆర్ బిసి బాలుర పాఠశాలలో లేపాక్షి ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుందన్నారు.

ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం కోటి రూపాయలు మంజూరు చేసిందని తెలిపారు. సుమారు రెండు లక్షల మంది పర్యాటకులు వొచ్చే అవకాశం ఉన్నందున, అందుకు అనుగుణంగా ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు.

లేపాక్షి ఉత్సవాలలో సామాజిక మరియు సాంస్కృతిక కార్యక్రమాలు, సాంప్రదాయ క్రీడలను ఉత్సవాల ప్రధాన వేదిక వద్ద పగటిపూట నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినట్లు గంధం చంద్రుడు తెలిపారు.
 
ఈ ఉత్సవాలలో భాగంగా రాయలసీమ ప్రాంతంలోని గొప్ప మరియు ప్రత్యేకమైన వంటకాలను, వివిధ రకాల ఆహార ఉత్పత్తులను ప్రదర్శిస్తున్నట్లు గంధం చంద్రుడు తెలిపారు.

లేపాక్షి యొక్క కళలు మరియు హస్తకళలు గొప్పగా ప్రదర్శించేందుకు బహుళ స్టాల్స్ లను హస్తకళల విభాగం ఆధ్వర్యంలో స్థానిక చేతివృత్తుల వారు ఉత్పత్తులను ప్రదర్శిస్తారన్నారు.

లేపాక్షి ఉత్సవాలు జరిగే రెండు రోజులలో ప్రధాన వేదిక వద్ద లేపాక్షి ఖ్యాతిని ఇనుమడించేలా వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు గంధం చంద్రుడు తెలిపారు.

రాయలసీమ అంటే ఫ్యాక్షనిజం కాదు, ఆప్రాంత వాసుల మంచి లక్షణాలు, ఆదరాభిమానాలు అనే విషయం చేటిచెప్పేలా వేడుకలు నిర్వహిస్తున్నామని గంధం చంద్రుడు అన్నారు. లేపాక్షి ఉత్సవాలలో బ్రెజిల్ దేశంలో కర్నొవెల్ నిర్వహించే రీతిలో శోభాయాత్ర ను నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

వీటిలో భాగంగా ఎడ్లబండ్ల పోటీలు, కత్తి సాము, కోలాటం, చెక్కభజన, తోలు బొమ్మలాట, కర్ర సాము లాంటి గ్రామీణ క్రీడాపోటీలను ఎంతో గొప్పగా నిర్వహిస్తున్నామన్నారు. రాయలసీమ ప్రాంతంలో ని ప్రాచీన కళలు భవిష్యత్ తరాలకు అందించే లక్ష్యంతో వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు. 

రాష్ట్ర పర్యాటక శాఖ మేనేజింగ్ డైరెక్టర్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ.. రాష్ట్ర ఆర్థిక స్వావలంబనలో పర్యాటక శాఖ ప్రాముఖ్యత పెరిగిపోయింది. పర్యాటక, అనుబంధ రంగాల ద్వారా యువతకు మెరుగైన  ఉపాధి అవకాశాలు అందుబాటులో ఉన్నాయన్నారు.

16వ శతాబ్దంలో నిర్మించిన లేపాక్షిలోని వీరభద్ర స్వామి దేవాలయం అద్భుతమైన చారిత్రక సంపదగా విఖ్యాతి చెందిందన్నారు.  పర్యాటక శాఖ ద్వారా 13 జిల్లాలలోని సందర్శనీయ ప్రదేశాలకు తగిన ప్రాచుర్యం కలిగించేందుకు చర్యలు చేపట్టడం జరుగుతున్నదని తెలిపారు. 

హిందూమత ప్రాముఖ్యతకు ఆనవాలుగా నిలిచిన లేపాక్షి కళాఖండాలను సంరక్షించేందుకు, భవిష్యత్తు తరాలకు లేపాక్షి ఘనతను చాటిచెప్పేందుకు ఉత్సవాలు నిర్వహిస్తున్నామని అన్నారు.  ఇప్పటికే రాష్ట్రంలో దేవాలయ సందర్శన పరంగా పర్యాటక రంగం లో ఎంతో విశిష్టతను సంతరించుకుందన్నారు.

తెలుగు సంస్కృతి సంప్రదాయాలను తెలియజెప్పేలా అద్భుతమైన గొప్ప కళాఖండాలు, చిత్రాలు, కళలు, ఎన్నో లేపాక్షిలో ఉన్నాయన్నారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి, పర్యాటకులు పెద్ద ఎత్తున హాజరై, ఈ వేడుకలను విజయవంతం చేయాలని కోరారు.

లేపాక్షి సాంస్కృతిక వైభవం, ప్రసిద్ధి, ప్రశస్తి, వారసత్వం, ఘన కీర్తి ప్రపంచానికి తెలిసేవిధంగా ఉత్సవాలను ఘనంగా నిర్వహించడం జరుగుతుంది.
 
సాంప్రదాయ నృత్య ప్రదర్శనలు
సంధ్య మూర్తి బృందంచే రాయలసీమ జానపద నృత్యం ప్రదర్శన - హేమచంద్ర మరియు శ్రావణ భార్గవి, సింహ, భార్గవి పిల్లయి, ఎంసీ చైతు, కాజల్ మరియు శ్యామల బృందంచే లైవ్ లో సంగీత విభావరి శివ ప్రసాద్ మరియు సత్యల స్టాండప్ కామెడీ ప్రదర్శన, శాండ్ యానిమేషన్ షో, లేజర్‌ ప్రదర్శనలు