సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ప్రీతి చిచ్చిలి
Last Updated : బుధవారం, 22 మే 2019 (16:18 IST)

మందు ప్రియులకు షాకింగ్ న్యూస్... 24 గంటల పాటు షాపులు బంద్

ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు మొదలుకావడానికి ఇంకొన్ని గంటల సమయం మాత్రమే ఉంది. దేశవ్యాప్తంగా ఈ ఫలితాల కోసం ప్రజలంతా ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఇక తెలుగు రాష్ట్రాల్లోనూ హోరాహోరీగా ఎన్నికలు ముగిసిన తర్వాత ఫలితాల కోసం దాదాపుగా 45 రోజుల నుండి ఎదురుచూపులు కొనసాగుతున్నాయి. 
 
ఇక ఎప్పుడెప్పుడా అంటూ ఎదురుచూస్తున్న ఆ రోజు మరికొన్ని గంటల్లో రానుంది. అయితే పాపం ఓట్ల లెక్కింపు మందుబాబులకు పెద్ద చిక్కే తెచ్చిపెట్టింది. కౌంటింగ్ ఎఫెక్ట్‌తో మద్యం దుకాణాలు మూతపడనున్నాయి. 
 
గురువారం తెలుగు రాష్ట్రాల్లో ఓట్ల లెక్కింపు సందర్భంగా ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం మద్యం దుకాణాలు, వైన్స్‌, బార్లు, కల్లు దుకాణాలు మూసివేయాల్సిందిగా ఎక్సైజ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈసీ ఆదేశాలతో 23న (గురువారం) ఉదయం 6 గంటల నుంచి 24వ తేదీ ఉదయం 6 గంటల వరకు మద్యం దుకాణాలు మూసే ఉంటాయి. నిబంధనలను ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని ఎక్సైజ్ అధికారులు హెచ్చరిస్తున్నారు. 
 
ఈ వార్తతో జాగ్రత్తపడిన కొంతమంది మందుబాబులు ముందు జాగ్రత్తగా బుధవారమే స్టాక్ తెచ్చి ఇంట్లో పెట్టుకుంటున్నారట. ఇక చిన్న చిన్న గ్రామాల్లో అయితే బెల్ట్ షాపులు ఉండనే ఉన్నాయి కాబట్టి, దిగులు లేదు.