శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 14 సెప్టెంబరు 2019 (17:57 IST)

అవినీతిపై ప్రజా ఆయుధంగా లోకాయుక్త.. జస్టీస్ పి.లక్ష్మణరెడ్డి

అవినీతిపై ప్రజా ఆయుధంగా లోకాయుక్త వ్యవస్థ తోడ్పడుతుందని ఆంధ్రప్రదేశ్ లోకాయుక్తగా నియమితులైన జస్టీస్ పి.లక్ష్మణరెడ్డి పేర్కొన్నారు. జనచైతన్య వేదిక రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో శనివారం విజయవాడలో గేట్వే హోటల్ కాన్ఫెరెన్స్ హాలులో ఆత్మీయ సత్కార సభ జరిగింది.

జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్య‌క్షులు వి.లక్ష్మణరెడ్డి అధ్యక్షత వహించారు. జస్టిస్ వి.లక్షణరెడ్డి ప్రసంగిస్తూ అవినీతి నిర్మూలనకు, పారదర్శక పాలనకు ప్రజలను జాగృతులను చేయాలన్నారు. అన్నా హజరే కృషితో కేంద్రంలో లోక్ పాల్ వ్యవస్థ అవతరించడం మంచి పరిణామం అన్నారు.

అన్ని రాష్ట్రాలలో బలమైన లోకాయుక్త వ్యవస్థలు ఏర్పడాలన్నారు. వ్యవస్థ అంతా అవినీతిమయంగా మారిందని ఈ పరిస్థితులలో ప్రజలు,మేదావులు, స్వచ్చంద సంస్థలు అవినీతికి వ్యతికేకంగా బలమైన ఉద్యమాలు చేయాలన్నారు. విద్యాధికులలోనే అవినీతి ఎక్కువగా వుందని అన్నారు.

సార్వభౌమాధికారులుగా వుండాల్సిన ప్రజలు నిస్సహాయులుగా మారుతున్నారన్నారు. తప్పు ఋజువైతే ఏ స్థాయిలో వున్న ప్రజా ప్రతినిధినైనా, అధికారులనైనా ఉపేక్షించేదిలేదన్నారు. మీమీ ప్రాంతాలలో జరుగుతున్న అవినీతిపై ఋజువులతో లోకాయుక్తకు ఫిర్యాదు చేయాలని, సత్వర న్యాయం చేయటానికి కృషి చేస్తానని హామి ఇచ్చారు.

తప్పుడు కేసులు ఫిర్యాదు చేస్తే సంవత్సరం పాటు జైలు శిక్షతో కూడిన శిక్ష వుంటుందని హెచ్చరించారు. జనచైతన్య వేదిక రాష్ట్ర అద్యక్షులు వి.లక్ష్మణరెడ్డి ప్రసంగిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి వై.యస్. జగన్ మోహన్ రెడ్డి నిరంతరం అవినీతి రహిత పాలన, పారదర్శక పాలన కోరుకుంటున్నారని లోకాయుక్త నియామకం వారి లక్ష్యాన్ని నెరవేరుస్తుందన్నారు.

గ్రామ సచివాలయ సిబ్బంది, వాలంటీర్లకు అవినీతి నిర్మూలనపై తగిన శిక్షణ అందిస్తే సత్ఫలితాలు వస్తాయనీ, అవినీతి గణనీయంగా తగ్గుతుందన్నారు. జనచైతన్య వేదిక మద్య వ్యతిరేక ఉద్యమంతో పాటు అవినీతికి వ్యతిరేరకంగా ప్రజలను జాగృతులను చేయటానికి కృషి చేస్తామన్నారు.

ప్రముఖ న్యాయకోవిదుడు, తెలుగు ప్రజలు ఐక్యంగా వుండాలని, అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలని ఆకాంక్షించే జస్టీస్ పి. లక్ష్మణరెడ్డిని రాష్ట్ర ప్రభుత్వం లోకాయుక్తగా నియమించడాన్ని అభినందించారు.

ప్రముఖ మానసిక వ్యాధి నిపుణులు ఇండ్ల రామసుబ్బారెడ్డి, సెంట్రల్ కస్టమ్స్ జాయింట్ కమీషనర్ యం. శ్రీకాంత్, జి.యస్.టి డిప్యూటి కమీషనర్ సి.యస్.రాజు, రిటైర్డ్ జాయింట్ కమీషనర్ ఎక్సైజ్ జి. జోషప్, జనచైతన్య వేదిక రాష్ట్ర ఉపాద్యక్షులు ప్రొఫెసర్ జి.విజయసారధి, ప్రముఖ విద్యావేత్త కన్నా మాస్టర్, రాష్ట్ర ప్రభుత్వ గెజిటెడ్ ఆఫీసర్స్ అద్యక్షులు కె.వి.కృష్ణయ్య, రాష్ట్ర అర్చక సంఘం అద్యక్షులు సాయినాథ్ తదితరులు ప్రసంగించి, జస్టీస్ పి.లక్ష్మణరెడ్డిని ఘ‌నంగా సత్కరించారు.