బంగాళాఖాతంలో అల్పపీడనం ఏపీకి మూడు రోజుల పాటు వర్షాలు...
గత కొన్ని రోజులుగా బంగాళాఖాతంలో వరుస అల్పపీడనాలు ఏర్పడుతున్నాయి. తాజాగా ఉపరితల ఆవర్తనం ప్రభావంతో సోమవారం దక్షిణ మధ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడిందని భారత వాతావరణ శాఖ అమరావతి విభాగం వెల్లడించింది. దీని ప్రభావం కారణంగా వచ్చే 48 గంటల్లో మరింత బలపడి తీవ్ర అల్పపీడనంగా మారుతుందని తెలిపింది. ఇది క్రమంగా పశ్చిమ వాయువ్య దిశగా పయనిస్తూ తమిళనాడు తీరంవైపు దూసుకొస్తుందని వెల్లడించింది.
ఈ అల్పపీడన ప్రభావం కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా వర్షాలు కురుస్తాయని తెలిపింది. ముఖ్యంగా, ఈ నెల 17 నుంచి 19వ తేదీ వరకు కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు ఐఎండీ వెల్లడించింది. కోస్తాంధ్ర, రాయలసీమ మినహా మిగిలిన ప్రాంతాల్లో 17 నుంచి 20వ తేదీ వరకు ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.