ఆదివారం, 12 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Raju
Last Updated :హైదరాబాద్ , గురువారం, 13 ఏప్రియల్ 2017 (03:46 IST)

ఆత్మహత్య చేసుకునే మొగుడూ కొడతాడు.. చివరి చూపుకు వస్తే అత్తింటి బంధువులూ కొడతారు..ఇదేం న్యాయం?

భారతదేశంలో డిప్రెషన్ లేదా మానసిక కుంగుబాటు అనే మాటకు, భావనకు అర్థం తెలియని వాళ్లు చాలామందే ఉన్నట్లుంది. కుంగుబాటుకు గురై భర్త చనిపోతే అతడి వ్యాధి, అతడు ఉన్న పరిస్థితులు అన్నీ పక్కన బెట్టి.. ఆత్మహత్య చ

భారతదేశంలో డిప్రెషన్ లేదా మానసిక కుంగుబాటు అనే మాటకు, భావనకు అర్థం తెలియని వాళ్లు చాలామందే ఉన్నట్లుంది. కుంగుబాటుకు గురై భర్త చనిపోతే అతడి వ్యాధి, అతడు ఉన్న పరిస్థితులు అన్నీ పక్కన బెట్టి.. ఆత్మహత్య చేసుకున్నాడనే ఒకే కారణంతో భార్యమీద నింద మోపటం ఎలాంటి న్యాయం? సమస్యలను నిబ్బరంగా ఎదుర్కొనే స్థయిర్యం కోల్పోయి భర్త ఆత్మహత్య చేసుకుంటే, అతడి చివరిచూపుకోసం వస్తే అతడి భార్య అనికూడా చూడకుండా అందరిముందూ దాడిచేయడం ఏ సంస్కృతికి చిహ్నం అని నిలదీస్తున్నారు ఒక విద్యాధిక వివాహిత.
 
ఈ అన్యాయానికి అడ్డుకట్ట వేయాలనే తలంపుతో మీడియా ముందుకు వచ్చిన ఎన్నారై మధుకర రెడ్డి భార్య స్వాతి ఆడదానికి, మగాడికి మధ్య తప్పు విలువలు ఆపాదించిన మన సమాజపు దుర్నీతిని కడిగిపారేశారు. అమెరికాలో వారం రోజుల కింద  ఆత్మహత్య చేసుకున్న ఎన్నారై మధుకర్‌రెడ్డి ఆత్మహత్య వివాదంలో అతడి భార్య స్వాతి స్పందించారు. తనపై మధుకర్‌ రెడ్డి తల్లిదండ్రులు చేస్తున్న ఆరోపణలను ఆమె తోసిపుచ్చారు. భార్యాభర్తల మధ్య జరిగిన ఫోన్‌కాల్స్‌ రికార్డులను స్వాతి బుధవారం మీడియాకు వివరించారు.
 
తమ మధ్య గొడవల వల్లే మధుకర్ రెడ్డి ఆత్మహత్యకు పాల్పడ్డాడని అతడి బంధువులు తనపై దాడిచేయడం సమర్ధనీయం కాదన్న స్వాతి పెళ్లయినప్పటినుంచి భర్తలో డిప్రెషన్ ఉన్న విషయం అతడి తల్లిదండ్రులకు కూడా చెప్పానని, భార్యాభర్తల మధ్య ఎలాంటి గొడవలూ లేకున్నా మధు బంధువులే అతడిని తప్పుదోవ పట్టించారని ఆరోపించారు. కావాలనే తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.  చిన్న చిన్న గొడవలు తప్పా మేమిద్దరం అన్యోన్యంగానే ఉండేవాళ్లమని అయితే ఆస్తుల కోసం మధుకర్‌రెడ్డి తల్లిదండ్రులు తమ మధ్య సమస్యలు సృష్టించారని స్వాతి ఆరోపించారు. 
 
గత రెండు నెలల నుంచి మధుకర్‌ రెడ్డి తీవ్ర డిప్రెషన్‌లోకి వెళ్లాడని స్వాతి అన్నారు. డిప్రెషన్ వల్లే తనను కొట్టి ఆ తరువాత క్షమాపణ కోరే వాడని తెలిపారు. మధుకర్‌రెడ్డి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకోకుండా తానే వేధింపులకు పాల్పడ్డానని అతని తల్లిదండ్రులు ఆరోపణలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రవీందర్‌ రెడ్డి అనే వ్యక్తి తమని చాలా డిస్టర్బ్‌ చేశాడని, తన గురించి అతడు ఇక్కడ చెడుగా చెప్పేవాడని అన్నారు. ఈ విషయం తెలిసి మధు వారితో మాట్లాడటం మానేశారని స్వాతి తెలిపారు. 
 
మధుకర్‌ రెడ్డి చివరిసారి మాట్లాడిన ఫోన్‌కాల్‌ రికార్డును స్వాతి..మీడియాకు వినిపించారు. తమ మధ్య గొడవలు చాలా చిన్నవని, డిప్రెషన్ ప్రభావం వల్ల తన భర్త ఎప్పుడూ కొట్టడం, తిట్టడం చేసేవాడని...అయినా మధుకర్‌రెడ్డి అంటే తనకు చాలా ఇష్టమన్నారు. గత రెండు వారాలుగా మధు తనపై చాలా ప్రేమ చూపించాడని, చనిపోయే రోజు మధ్యాహ్నం 2 గంటలకు తాను ఫోన్‌లో మాట్లాడినట్లు చెప్పారు. సాయంత్రం 5.30 గంటలకు ఇంటికి వచ్చేసరికి మధు ఉరి వేసుకుని ఉన్నాడన్నారు. తన భర్త మృతదేహాన్ని కూడా చూడనివ్వలేదని, తనపై భర్త కుటుంబసభ్యులు దాడికి పాల్పడ్డారన్నారు. తనకు రక్షణ లేదని, తన పాపకు ఏమవుతుందోననే భయంగా ఉందన్నారు. తనతో పాటు, తన కుటుంబసభ్యులకు రక్షణ కల్పించాలని స్వాతి కోరారు.
 
ఉద్యోగం పోతుందనే భయం మధుకు మొదలైందని తెలిపింది. డిప్రెషన్‌‌లో ఉన్న తన భర్త ట్రీట్‌మెంట్‌ తీసుకున్నట్లు చెప్పింది.  కొంతకాలంగా తన భర్త మూడీగా ఉన్నాడని, ఈ విషయాన్ని తన అత్తమామలకు కూడా చెప్పినట్లు తెలిపింది. మానసిక ఒత్తిడి, ఉద్యోగ భయం, కుటుంబ సభ్యుల వల్లే తన భర్త ఆత్మహత్య చేసుకున్నాడని స్వాతి వెల్లడించింది. గతంలో మధుకర్‌ రెడ్డి పంపిన ఈ మెయిల్‌ని ఆమె మీడియాకు చూపించింది. 
 
భర్త జీవితంలో సగభాగమైన భార్య,  భర్త జీవితంలో అత్యంత సన్నిహిత వ్యక్తిగా మసలే భార్య, భర్త కొట్టే దెబ్బల్ని కూడా సహించే భార్య, చివరిక్షణం వరకు సుఖంలోనూ, కష్టం లోనూ కూడా తోడుగా నిలిచే భార్య.. అదే భర్త అనూహ్యంగా చనిపోతే, ఆత్మహత్య చేసుకుంటే చివరి చూపుకు కూడా నోచుకోకుండా తరిమేసే, దాడిచేసి చితకబాదే మెట్టింటి వారి ఘన సంస్కృతిని వేలెత్తి చూపుతోంది. భర్త శవం మీద కూడా హక్కులు లేకుండా చేసే అమానుషం భారతీయ కుటుంబాల్లో ఉంటున్నప్పుడు భర్తలేని స్త్రీల రక్షణను ఎవరు పట్టించుకుంటారు? 
 
కుంగుబాటు ప్రభావంతో  చిన్న చిన్న గొడవలతో భర్త తనను కొట్టినా తర్వాత మామూలు స్థితికి వచ్చినప్పుడు మనస్ఫూర్తిగా క్షమాపణలు కోరేవాడని, ఇకముందు ఆలా జరగకుండా చూసుకుంటానని హామీ ఇచ్చేవాడని స్వాతి చెబుతున్న నేపధ్యంలో బాధితురాలిని మరింత బాధించే సంస్కృతిని ఎవరు పారదోలాలి? తనకు రక్షణ లేదని, తన పాపకు ఏమవుతుందోననే భయం వ్యక్తం చేస్తున్న ఆమెకు ఎవరు రక్షణను ఇవ్వాలి. 
 
ఒక్కమాట నిజం. ఇది పోలీస్ స్టేషన్లో తేలే  పరిష్కారం కానేకాదు. కుటుంబ వ్యవస్ధ చట్రంలోనే ఏదో లోపం ఉంది. మార్పు అక్కడ మొదలైతేనే దీనికి సమూల పరిష్కారం లభిస్తుందేమో..