ప్రేమ పేరుతో మోసం చేశాడు.. భార్యను అలా వదిలించుకున్న ఐపీఎస్ ఆఫీసర్..
ప్రేమ పేరుతో ఒక అమ్మాయిని ప్రేమ వివాహం చేసుకుని..ఆ తర్వాత ఐపీఎస్‌గా సెలెక్ట్ అవడంతో భార్యను వదిలించుకొని తన రేంజ్‌లో మరో వివాహం చేసుకోవాలనుకున్నాడు ఓ ట్రైన్ ఐపీఎస్ ఆఫీసర్ ప్లాన్ చేసుకున్నాడు. కథ అడ్డం తిరగడంతో సస్పెండయ్యాడు. వివరాల్లోకి వెళ్తే కడప జిల్లాకు చెందిన మహేశ్వర్ రెడ్డి... చదువుకోవడానికి హైదరాబాద్ వచ్చాడు.
కష్టపడి చదివి గ్రూప్ వన్ జాబ్ సంపాదించాడు. ఆల్ ఇండియా సర్వీసెస్‌లో చేరాలని నిర్ణయించుకున్నాడు. అశోక్‌నగర్‌లో ఉంటూ చదువు కొనసాగించాడు. ఉస్మానియా యూనివర్సిటీలో ఇంజినీరింగ్ చేస్తూ సివిల్స్‌కు ప్రిపేరయ్యాడు. సరిగ్గా అదే సమయంలో మహేశ్వర్ రెడ్డికి భావన అనే అమ్మాయితో పరిచయం ఏర్పడింది. అది కాస్తా ప్రేమగా మారింది.
ఇద్దరూ పెళ్లి చేసుకుని గాంధీనగర్‌లో కాపురం కూడా పెట్టారు. ఇంతలో మహేశ్వర్ రెడ్డి ఐపీఎస్‌కు సెలెక్టయ్యాడు. అప్పట్నుంచీ అతని ప్రవర్తనలో మార్పు వచ్చింది. మన వివాహం గురుంచి మా ఇంట్లో తెలియదని తెలిస్తే మా తల్లిదండ్రులు ఆత్మహత్య చేసుకుంటారని భావనను బెదిరించాడు. తనకు విడాకులు ఇస్తే నిన్ను మంచిగా చూసుకుంటానని నమ్మించాడు.
తనను మహేశ్వర్‌రెడ్డి మోసం చేశాడని గ్రహించిన భావన దళిత సంఘాలను ఆశ్రయించింది. వారి అండతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఏడాదిన్నర క్రితం కీసర రిజిస్టర్ ఆఫీసులో తనను పెళ్లి చేసుకున్నాడని, ఇప్పుడు ఐపీఎస్‌కు సెలెక్ట్ కావడంతో వేరే పెళ్లికి సిద్ధమవుతున్నాడని ఫిర్యాదులో పేర్కొంది. విడాకుల కోసం బెదిరింపులకు దిగుతున్నాడని చెప్పింది.
ఫిర్యాదుపై స్పందించిన కీసర పోలీసులు మహేశ్వర్ రెడ్డిపై కేసు నమోదు చేశారు. విచారణ జరిపి నోటీసులు జారీ చేశారు. ఇక, కేంద్ర హోంశాఖకు కూడా భావన ఫిర్యాదు చేసింది. ఈ కేసుపై దర్యాప్తు చేసిన హోంశాఖ.. మహేశ్వర్‌రెడ్డిని సస్పెండ్ చేసింది.
అయితే, వ్యక్తిగత ఆరోపణలతో ఒక ట్రైనీ ఐపీఎస్‌ను సస్పెండ్ చేయడం ఇదే మొదటిసారని పోలీసు అధికారులు చెబుతున్నారు. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ట్రైనింగ్ నుంచి సస్పెన్షన్ కొనసాగుతుందని అధికారులు స్పష్టం చేశారు. భావన పోరాటాన్ని మహిళా సంఘాలు శబాష్ అంటున్నాయి.