సోమవారం, 30 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎంజీ
Last Updated : శనివారం, 30 అక్టోబరు 2021 (13:09 IST)

బాంబులు, రాళ్ళ దాడులు అంటూ చంద్రబాబు వీధి నాటకం: మంత్రి కన్నబాబు

కుప్పం పర్యటనను మీడియాలో హైలెట్ చేయించుకోవడం కోసం.. బాంబులు, రాళ్ళ దాడులు అంటూ చంద్రబాబు వీధి నాటకం ఆడారని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు ఎద్దేవా చేశారు.

తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో మంత్రి కన్నబాబు మాట్లాడుతూ.. చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న సొంత నియోజకవర్గం కుప్పంలో వైయస్ఆర్సీపీ కార్యకర్తలు దాడి చేశారని చెప్పుకోవడానికి ఆయనే సిగ్గుపడాలన్నారు.

కుప్పంలోనూ అన్ని స్థానిక సంస్థల ఎన్నికల్లో చంద్రబాబు ఘోర పరాజయం పొందారని, తన పునాదులు కదిలిపోతున్నాయని, ఎప్పుడూ లేనిది ఈరోజు వంగి వంగి నమస్కారాలు, చౌకబారు రాజకీయాలు మొదలు పెట్టాడని ధ్వజమెత్తారు.

నిన్నటి వరకు గంజాయి, హెరాయిన్ అని, ఆ తర్వాత దాడులని, తద్వారా రాష్ట్రంలో శాంతిభద్రతలు లేవని చెప్పేందుకే చంద్రబాబు కుయుక్తులు, కుట్రలు పన్నుతున్నారని కన్నబాబు దుయ్యబట్టారు. చంద్రబాబు ఉద్దేశపూర్వకంగానే, ఒక ప్లాన్ ప్రకారం, తాను ఏం చెబితే అది రాసే పచ్చ పత్రికలు, చూపించే మీడియా ఉందని  కుప్పం మీటింగ్ లో బాంబులు, రాళ్ళ దాడులు అంటూ ఏమీ జరగని దానిని, జరిగినట్టు సృష్టించి డ్రామాలు చేశారని మండిపడ్డారు. 
 
ఎవరైనా అభివృద్ధిపైనో, సంక్షేమంపైనో చర్చకు రమ్మంటారని, బూతులపై  చర్చకు రమ్మని సవాళ్ళు విసురుతున్నాడంటేనే.. చంద్రబాబు ఎంతగా దిగజారుడు రాజకీయాలు చేస్తున్నాడో అర్థం చేసుకోవచ్చు అన్నారు. చర్చకు ఎక్కడికి రావాలో, మంత్రులు రావాలో, మరెవరైనా రావాలో చంద్రబాబు చెబితే తాము సిద్ధం అన్నారు. 
 
మంత్రి కురసాల కన్నబాబు మాట్లాడుతూ.. ఇంకా ఏమన్నారంటే..
1- ప్రధానంగా ఇవాళ ఈనాడు దినపత్రికలో రైతు ఆత్మహత్యల్లో ఏపీ మూడో స్థానంలో ఉందని ఓ కథనం ప్రచురించింది. గత ఏడాది కన్నా ఈఏడాది బలవన్మరణాలు పెరిగాయని రాసింది. తాను రైతు పక్షపాతిని అని, రైతుకు ఎంత చేసినా అది తక్కువేనని, రైతు అభివృద్ధి, సంక్షేమానికి పెద్ద పీట వేసి పరిపాలిస్తానని గౌరవ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిగారు ఏదైతే చెప్పారో,  అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఆ విధంగా పాలన చేస్తున్నారు.

చెప్పిన హామీలే కాకుండా చెప్పని పథకాలు కూడా రైతు సంక్షేమం కోసం అమలు చేస్తున్నారు. వైయస్సార్‌ రైతుభరోసా-పీఎం కిసాన్‌ మొదలుకొని, వైయస్సార్‌ ఉచిత పంటల బీమా పథకం, వైయస్సార్‌ వడ్డీలేని రుణాలు, వైయస్సార్‌ జలకళ వరకూ వివిధ పథకాలు అమలు చేయడంతో పాటు, ఎక్కడా రైతుకు సాయం అందించే విషయంలో ఎలాంటి అలక్ష్యం లేకుండా చెప్పిన సమయానికి ఆర్థిక సాయం అందించడంతో పాటు వ్యవస్థను సక్రమంగా సరిదిద్దే ప్రయత్నం చేస్తున్నారు.

- ఈ క్రమంలోనే అధికారంలో వచ్చిన వెంటనే తొలి క్యాబినెట్‌ లోనే.. రైతు ఎవరైనా బతకలేక తనువ చాలిస్తే... వారి కుటుంబాన్ని ఆదుకునేందుకు రూ.7 లక్షలు పరిహారం ఇస్తామని, సంఘటన జరిగిన వెంటనే ఆ జిల్లా కలెక్టర్‌, లేదా జాయింట్‌ కలెక్టర్‌, స్థానిక శాసనసభ్యుడితో పాటు అందుబాటులో ఉ‍న్న మంత్రులు అక్కడకు వెళ్లి ఆ కుటుంబాన్ని పరామర్శించి వెంటనే పరిహారం అందించాలని ముఖ్యమంత్రిగారు ఆదేశాలు ఇచ్చారు. ఇందుకు సంబంధించి జిల్లా కలెక్టర్ల వద్ద అత్యవసర నిధి కోసం కోటి రూపాయలు జమ చేయడం కూడా జరిగింది.

- వ్యవసాయ సంబంధ కారణాల వల్ల రైతులు ఆత్మహత్య చేసుకుంటే వారికి సాయం అందించాలని ముఖ్యమంత్రిగారు ఆదేశించారు. అందుకు సంబంధించిన డేటాను పరిశీలించి, 450 కుటుంబాలను గుర్తించి ఒక్కో కుటుంబానికి రూ.5లక్షల పరిహారం ఇచ్చాం.
 
2- ఎన్‌సీఆర్బీ ఇచ్చిన డేటా ప్రకారమంటూ 2020లో ఏపీలో 889మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నట్లు ఈనాడు దిన పత్రిక రాసింది. వీరిలో ఆత్మహత్యలు చేసుకున్నవారిలో కౌలు రైతులు మొదటి స్థానంలో ఉన్నారంటూ అందుకు సంబంధించిన గణాంకాలు ఇచ్చారు. నిజంగానే ఆంధ్రప్రదేశ్‌లో ఇన్ని ఆత్మహత్యలు జరుగుతున్నాయా అనే బాధతో ఈనాడు ఈ వార్త రాసిందా? లేకుంటే ప్రభుత్వం మీద బురద చల్లడానికి..  పండగ చేసుకుందామనే ఉద్దేశంతో ఈ వార్త రాసిందా.. అని పరిశీలించేందుకు లోతుగా వెళ్లాల్సి ఉంది.

- ఇదే ఎన్‌సీఆర్బీ ఇచ్చిన నివేదికలో ‘రైతులు, రైతు కూలీలుగా వర్గీకరించి, ఆ కేటగిరిలో, ఆవృతిలో ఉన్న ఎంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారన్న వివరాలు ఇస్తున్నాం తప్ప, వారి మరణాలకు గల కారణాలను (కాజ్‌ ఆఫ్‌ సూసైడ్‌) తాము ఇవ్వడం లేదని’ స్పష్టం చేసింది. కానీ ఈనాడు మాత్రం వారంతా బతకలేక రైతులు చనిపోతున్నారన్నట్టుగా రాసింది. 
- వాస్తవాలు చెప్పాల్సి వచ్చినప్పుడు.. మన రాష్ట్రంలో ఎంతమంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారనే డేటా తీసుకుంటే 2020లో 225మంది ఆత్మహత్యలు చేసుకున్నట్లు ప్రభుత్వం నియమించిన ఆయా జిల్లాల త్రిసభ్య కమిటీలు నివేదికలు ఇచ్చాయి. ఎక్కడైనా ఆత్మహత్య నమోదు అయితే.. జిల్లా స్థాయి అధికారులు అక్కడకు వెళ్లి కమిటీ వేసి, నిర్ధారించిన తర్వాత బాధిత కుటుంబాలకు పరిహారం అందిస్తాం.

ఇదంతా పూర్తి పారదర్శకంగా జరుగుతోంది. ఏ విషయంలో అయినా పారదర్శకంగా ఉండాలని ముఖ్యమంత్రిగారే స్వయంగా చెప్పబట్టే.. 225 మరణాలు కనిపించాయి. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం మాదిరిగా, మరణాలను తొక్కిపెట్టాలనుకుంటే.. ఈ నెంబర్‌ కూడా కనిపించదు. వాస్తవాలు ప్రజలకు తెలియాలనే ఉద్దేశంతో మేము పారదర్శకంగా ఉన్నాం.

- అయితే ఎన్‌సీఆర్బీ డేటాకు, మన డేటాకు మధ్యలో కొంత గ్యాప్‌ ఉంటుంది. ఎందుకంటే, వ్యవసాయ కారణాల వల్లే ఆత్మహత్యలు చేసుకున్నారా లేక.. ఆ కేటగిరి పరిధిలో ఉండి, వేరే కారణాల వల్ల ఆత్మహత్యలు చేసుకున్నారా.. అన్న అంశంపై జిల్లా త్రిసభ్య కమిటీలు క్షుణ్ణంగా విచారించి, వారికి నష్టపరిహారం చెల్లిస్తున్నాం. 

- దీనిపై 2020 సెప్టెంబర్‌లో రాష్ట్ర అగ్రికల్చర్‌ కమిషనర్‌ ...రైతు ఆత్మహత్యల గణాంకాలు చూసినప్పుడు, ఎన్సీఆర్బీకి పోలీసు శాఖ పంపిస్తున్న గణాంకాలు, మా గణాంకాల మధ్య వ్యత్యాసం ఉందని, దాన్ని సరిచూసుకోవాల్సి ఉందంటూ రాష్ట్ర పోలీస్‌ అధికారులకు ఓ లేఖ కూడా రాశారు. ఎన్‌సీఆర్బీ వెల్లడించినట్లు 889 మరణాలు కరెక్ట్‌ కాదు. 
 
3- ఏదైనా ఒక సంఘటన జరిగితే, వెంటనే రాష్ట్ర ప్రభుత్వం మీద బురద చల్లుదామనే ఆతృత  ఈనాడులో  కనిపిస్తుంది. వాస్తవాలను విశ్లేషించడం లేదు. మేము అధికారంలోకి రాగానే పాత కేసులను కూడా డేటాలోకి తీసుకుంటే 2014లో 160మంది రైతులు ఆత్మహత్యలు జరిగినట్లు ఎన్‌సీఆర్బీ రికార్డులు చెబుతున్నాయి. ఆ ఏడాది మొత్తం వెరిఫికేషన్‌ జరిగితే కేవలం 100 మంది రైతులు మాత్రమే వ్యవసాయ అనుబంధ సమస్యలతో ఆత్మహత్యలు చేసుకున్నట్లు నిర్థారణ అయింది. 

- అలాగే 2015లో 516మంది ఆత్మహత్యలు జరిగినట్లు ఎన్‌సీఆర్బీ చెబితే కేవలం 259మంది నిర్థారణ కాగా, 2016లో 239మంది అని ఎన్‌సీఆర్బీ చెబితే 134మంది, 2017లో 375 మందిఅని ఎన్‌సీఆర్బీ చెబితే 185 మంది, 2018లో 365 మంది ఎన్‌సీఆర్బీ చెబితే, 178మంది, 2019లో 628మంది అని ఎన్‌సీఆర్బీ చెబితే364మంది, 2020 వచ్చేసరికి 889 మంది అని ఎన్‌సీఆర్బీ చెబితే225మంది రైతులు వ్యవసాయ సంబంధ సమస్యలతో ఆత్మహత్యలు చేసుకున్నారనేది వాస్తవ పరిస్థితి.
 
4- రాష్ట్ర రైతాంగం కోసం ప్రభుత్వం ద్విముఖ వ్యూహంతో పనిచేస్తోంది. 1, తక్షణమే తాత్కాలికంగా ఆదుకోవడం, 2. భవిష్యత్‌లో వ్యవస్థను సరిదిద్ది రైతాంగానికి అవసరం అయిన మౌలిక వసతులు కల్పించి మార్కెట్‌ ధరలకు గిట్టుబాటు కల్పించేలా ప్రభుత్వం పనిచేస్తోంది.

- ఇప్పటివరకూ 18వేల 7 77కోట్ల రూపాయిలు రైతు భరోసా-పీఎం కిసాన్‌ కింద మా ప్రభుత్వం రైతులకు ఇవ్వడం జరిగింది. దేశ చరిత్రలోనే తొలిసారిగా ముఖ్యమంత్రిగారు కౌలు రైతులకు కూడా వైయస్సార్‌ రైతు భరోసా ఇచ్చారు. మా ప్రభుత్వ చిత్తశుద్ధికి ఇదే నిదర్శనం. ఎక్కడైనా సంక్షేమ పథకం మొదలైతే లబ్ధిదారుల సంఖ్య తగ్గుతూ ఉంటుంది.

అయితే ఈ రాష్ట్రంలో అర్హులైనవారికి అన్యాయం జరగకూడదని, ప్రభుత్వంపై భారం పడినా పర్వాలేదని ముఖ్యమంత్రిగారు ఆదేశాలు ఇస్తే.. ఇవాళ 50లక్షల పైచిలుకు రైతు కుటుంబాలకు సాయం అందుతోంది.

- ఆనాడు రైతు బాంధవుడు అంటే వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డిగారు గుర్తుకు వచ్చేవారు. ఇవాళ ఆయన వారసుడిగా వైఎస్‌ జగన్‌గారు తండ్రి కన్నా రెండు అడుగులు ముందుకు వేస్తూ, రైతులు , వ్యవసాయానికి సంబంధించిన సంక్షేమానికి ఎక్కువ కృషి చేస్తున్నారు.

-  రైతు భరోసా కేంద్రాలను తీసుకుంటే దేశం మొత్తం ఆంధ్రప్రదేశ్‌లో అమలు అవుతున్న ఈ పథకం శభాష్‌ అంటూ ఇతర రాష్ట్రాలు సైతం ప్రశంసలు కురిపిస్తున్నాయి.
ఆర్బీకేలలో అన్ని రకాలు సేవలు అందేలా తీర్చిదిద్దాం. దాదాపుగా 10,780 ఆర్బీకేలు పనిచేస్తున్నాయి. దేశంలో అత్యున్నత స్థాయిలో పనిచేస్తున్నది మన రాష్ట్రంలోని వ్యవసాయ రంగమని గర్వంగా చెప్పగలుగుతున్నాం.
 
పెట్టుబడి సాయం ఇస్తున్నందుకు ఆత్మహత్యలు చేసుకుంటారా..?
5- అసలు ఈ రాష్ట్రంలో రైతులు ఎందుకు ఆత్మహత్యలు చేసుకోవాలి. రైతులకు పెట్టుబడి సాయం ఇస్తున్నందుకు ఆత్మహత్యలు చేసుకోవాలా? సున్నవడ్డీ పంటరుణాలు సకాలంలో ఇస్తున్నందుకా? దేశంలోనే ఎక్కడా లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో ఉచిత పంటల భీమా అందిస్తున్నందుకా?

దయచేసి ఈనాడు ఈ వార్తలను రాసేటప్పుడు వాస్తవాలను పరిగణనలోకి తీసుకుంటే మంచిది. ప్రతి జిల్లాలో ఉండే నివేదికలు తీసుకుని సరిచూసుకుంటే బాగుంటుంది. ఎంతకాలం అబద్ధాలు చెప్పుకుని పబ్బం గడుపుకుంటారు.

- రూ. 3 వేల కోట్లతో ధరల  స్థిరీకరణ పెట్టి.. కోవిడ్ సమయంలో కూడా రూ. 5,800 కోట్లు పై చిలుకు ఖర్చు చేసి, ధాన్యం, మొక్కజొన్న, జొన్న, తదితర పంటలు కొనుగోలు చేశాం. పొగాకు సంక్షోభంలో పడితే మార్క్ ఫెడ్ ను రంగంలోకి దింపి కొన్నాం. రెండేళ్ళకాలంలోనే  రూ. 30 వేల కోట్లు ఖర్చు చేసి ధాన్యాన్ని కొన్నాం.
 
6- చంద్రబాబు చేత చంద్రబాబు కోసం నడుపుతున్న వ్యవస్థలుగా కొన్ని పత్రికలు, చానల్స్‌ పనిచేస్తున్నాయి. వాటి గురించి ప్రజలకు ఏమని చెప్పాలి. చంద్రబాబు కుప్పం పర్యటన సందర్భంగా తనపై దాడి జరుగుతున్నట్లు డ్రామా క్రియేట్‌ చేస్తూ వీధి నాటకం వేస్తున్నారు. సభలోకి వచ్చి బాంబులు వేయడానికి ప్రయత్నించారని మాట్లాడుతున్నారు. చంద్రబాబు తన సొంత నియోజకవర్గంలో వైయస్సార్‌ సీపీ కార్యకర్తలు దాడి చేశారంటూ చెప్పుకుంటుంటే టీడీపీకి సిగ్గు పోవడం లేదా? చంద్రబాబు మీద వైయస్సార్‌ సీపీ కార్యకర్తలు దాడి చేయాల్సిన అవసరం లేదు.
 
7- రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయంటూ చూపించే ప్రయత్నంలో భాగంగా.. నిన్నటివరకూ ఢిల్లీ వీధుల్లో ఎలా విష ప్రచారం చేశారో... దానికి కొనసాగింపే కుప్పంలో డ్రామా. అన్ని స్థానిక ఎన్నికలలో ఓటమి పాలైన టీడీపీ, ఆఖరికి తన సొంత నియోజకవర్గంలో కూడా  పునాది కదిలిపోతుందనే భయంతో చౌకబారు ప్రవర్తనే నిదర్శనం.

ఢిల్లీ వెళ్లి ప్రచారం చేసి, రాష్ట్రపతిని కలిసి రాష్ట్రంలో అరాచకం జరిగిపోతుందంటూ అసత్యాలు ప్రచారం చేశారు. ఒక వ్యక్తి హుందాతనానికి భంగం కలిగించేలా వ్యవహరిస్తే వారిపై చర్యలు తీసుకోవాలని న్యాయస్థానాలు కూడా చెప్పాయి. మరి రాష్ట్ర ప్రతిష్టను దిగజారేలా చంద్రబాబు ప్రవర్తిస్తున్నారు కదా.. ఆయనపై చర్యలు ఎందుకు తీసుకోకూడదు. 
 
1973లోనే గంజాయిపై చింతపల్లిలో తొలి కేసు నమైదైంది
8- గంజాయి అంశం ఇవాళ్టిది కాదు. 1973లో చింతపల్లిలో మొదటి కేసు నమోదు అయింది. అంతకు ముందు నుంచే గంజాయిని ఒడిశా సరిహద్దుల్లో పండిస్తున్నారనేది అందరికీ తెలిసిందే.

టీడీపీ హయాంలో ఉవ్వెత్తున గంజాయి మాఫియా రెచ్చిపోయిన విషయం మేము చెప్పింది కాదు .. సాక్షాత్తూ ఆ పార్టీ నేతలు, టీడీపీ హయాంలో అప్పటి మంత్రులు గంటా శ్రీనివాసరావు, అయ్యన్నపాత్రుడు మాట్లాడటం వాస్తవం కాదా?

విశాఖ నుంచే దేశమంతా గంజాయి సరఫరా జరుగుతోంది అని... దాన్ని అదుపు చేయలేకపోతున్నామని గంటా శ్రీనివాసరావు మాట్లాడారు. దీనిమీద మీరేమంటారు? 2016-17 లోనే ఈ పరిస్థితి ఉంటే చంద్రబాబు ఎందుకు ఉపేక్షించారు? వారి వాటాల కోసం ఉన్నతస్థాయిలో ఉన్నవారు కూడా కొట్లాడుకుంటున్నారని వార్తలు వస్తే ఎందుకు పట్టించుకోలేదు..?
 
9- జగన్‌ గారు అధికారంలోకి రాగానే గంజాయి మొక్కలు పుట్టినట్టు, అక్రమంగా సాగు చేస్తున్నట్లు టీడీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. మరి మీ హయాంలో తులసి మొక్కలు సాగు చేశారా? మీరా నీతులు చెప్పేది? డేటా తీసుకుంటే అయిదేళ్ల కాలంలో గంజాయి మీద దాడులు, అరెస్ట్‌లు చూస్తే, దానికన్నా ఈ రెండేళ్ల కాలంలో మా ప్రభుత్వం దాడులు, అరెస్ట్‌ లు చేయించింది ఎక్కువ.

- 2019లో మేం అధికారంలోకి వచ్చాక 3లక్షల కేజీల గంజాయిని పట్టుకుని, 5వేలమందిని అరెస్ట్‌ చేసి 15వందల వాహనాలు సీజ్‌ చేశారు. ఇంకా తప్పించుకుని తిరుగుతున్నవారు 2,600మంది ఉన్నట్లు పోలీసుల లెక్కలు చెబుతున్నాయి. దీంట్లో తెలంగాణ, మహారాష్ట్ర, తమిళనాడు, ఒడిశా, గుజరాత్‌ కు చెందిన ట్రేడర్స్‌, వ్యాపారులు ప్రమేయం ఉన్నట్లు పోలీసుల రికార్డులు చెబుతున్నాయి.  

- ఒడిశాలో 7 జిల్లాల్లో,  మన రాష్ట్రంలో తొమ్మిది మండలాల్లో గంజాయి సాగు జరుగుతోందని అధికారులు చెబుతున్నారు. గంజాయి సాగుపై స్పష్టమైన మార్పు వచ్చేలా ఉక్కుపాదం మోపాలని ముఖ్యమంత్రిగారు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. దీన్ని ఖచ్చితంగా అరికట్టి తీరాలని సీఎం జగన్ గారు స్పష్టంగా చెప్పారు. ఇటువంటి ఆదేశాలు ఆరోజే చంద్రబాబు హయాంలో ఎందుకు ఇవ్వలేకపోయారు. ఆనాడు ఎందుకు గంజాయిపై ఉక్కుపాదం మోపలేకపోయారు..?

- 2016లో శ్రీలంకలో గంజాయిని పట్టుకుంటే.. ఆ విచారణలో తేలిందేమంటే ఏపీ నుంచి ఈ రవాణా సాగుతుందని గవర్నమెంట్‌ ఆఫ్‌ ఇండియాకు ఆ  ప్రభుత్వం తెలిపింది. దీనిపై అప్పటి ప్రభుత్వాన్ని గవర్నమెంట్‌ ఆఫ్‌ ఇండియా మొట్టికాయలు వేసింది. ఆరోజు అధికారంలో ఉంది చంద్రబాబు నాయుడే. ఒడిశా సరిహద్దుల్లో పండించిన గంజాయి...ఏపీ ద్వారా రవాణా కావడం వల్ల మన రాష్ట్రానికి అపఖ్యాతి వస్తోంది. దీనికోసం ప్రభుత్వం పెద్ద ఎత్తున చర్యలు తీసుకుంటుంది. ఏరియల్ సర్వే జరిపి, అరికట్టేందుకు కూడా ముఖ్యమంత్రి ఆదేశాలు ఇచ్చారు.
 
10- ప్రభుత్వం ఇంత చేస్తుంటే.. వీటన్నింటిని మరుగుపడేలా ఢిల్లీ వీధుల్లో చంద్రబాబు ప్రెస్‌మీట్లు పెట్టి రాష్ట్ర ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిగారిని కించపరుస్తున్నా అనుకుంటూ రాష్ట్ర ప్రజల మనోభావాలను దెబ్బతీస్తున్నారు. దీనిపై పవన్‌ కల్యాణ్‌ కూడా లెక్కలు సరిచూసుకుంటే బాగుంటుంది.

చంద్రబాబు అయిదేళ్ల కాలంలో 3వేల ఎకరాల్లో గంజాయి సాగును ధ్వంసం చేసినట్లు రికార్డులు చెబుతున్నాయి. మరి అప్పుడు గంజాయి సాగు అవుతున్నట్లేగా?

- ఇప్పుడు లక్షలాది కేజీలు గంజాయి స్వాధీనం చేసుకుని, వందలాది వాహనాలు సీజ్‌ చేసి తన, మన లేకుండా తుక్కురేగకొడుతున్నారు. మనకన్నా 17 రాష్ట్రాలు గంజాయి సాగులో ముందున్నాయి. అయినా చంద్రబాబు మాత్రం ఏపీ మొదటి స్థానంలో ఉందంటూ పచ్చి అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు.

-  బాబు వైఖరేంటో తెలియని రాజకీయ పార్టీలు దేశంలో ఏమీలేవు. చంద్రబాబు ఒంటరిగా ఎప్పుడూ పోరాటం చేయలేడు. రాష్ట్రంపై ఇటువంటి విష ప్రచారం చేసి, అసలు చంద్రబాబు ఏం సాధిద్దామనుకుంటున్నారు? 

- డీజీపీ ఇంట్లో వెతికితే గంజాయి దొరుకుతుందంటూ బాబు తనయుడు లోకేష్ చెప్పడం చూస్తుంటే.. వీరికి అసలు ఏ కొంచెమైనా సిగ్గుందా అని అనుమానం కలుగుతోంది. ఎవరి ఆత్మాభిమానం అయినా దెబ్బతీయవచ్చనే అధికారం మీకుందని ఫీల్‌ అవుతున్నారు.
 
11- వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి తర్వాత ఈ రాష్ట్రంలో అసాంఘిక శక్తుల మీద ఉక్కుపాదం మోపుతున్న స్ట్రాంగ్‌ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిగారే.  అయినా చంద్రబాబు ఎంతకాలం ఇలా అబద్ధాలు చెబుతూ బతుకుతారు. ఎంతకాలం ఈ సానుభూతి డ్రామాలు చేస్తారు..? 
 
- రాష్ట్రంలో ఎటువంటి సంక్షోభం లేదు. అధికారం కోల్పోయిన తర్వాత టీడీపీ రాజకీయ సంక్షోభంలో కూరుకుపోయింది. టీడీపీలో శూన్యం ఆవహించింది. 
- లోకేష్ తాను పప్పు కాదని  బ్రాండింగ్ చేసుకునేందుకు.. బూతులు తిట్టే పనిలో పడ్డాడు.
 
12- రైతాంగాన్ని ఆదుకునే ముఖ్యమంత్రుల జాబితాను తీస్తే..  వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిగారు మొదటి స్థానంలో ఉంటారు. ఇప్పటికైనా చంద్రబాబు, ఆయన తప్పెటగుళ్లు ఆలోచించి పనిచేస్తే బాగుంటుంది. 
 
- అమరావతి రైతుల దేవస్థానం టు న్యాయస్థానం యాత్రకు కోర్టు అనుమతి ఇచ్చిందని మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానంగా.. అయితే రాష్ట్రంలో మూడు రాజధానులకు వ్యతిరేక యాత్ర, మూడు ప్రాంతాల అభివృద్ధికి వ్యతిరేక యాత్ర,  ఆస్తులను కాపాడుకునే యాత్ర, చంద్రబాబు నాయుడు ప్రోత్సహిస్తున్న యాత్ర.. అని పేరుపెట్టుకుని యాత్ర చేయమనండి, బాగుంటుంది. దానికి దేవస్థానం... న్యాయస్థానం అని పేరు పెట్టడం ఏంటి..? 
 
- కొంతమంది వ్యక్తుల ప్రోద్బలంతో రియల్‌ ఎస్టేట్‌ ప్రయోజనాల కోసం పోరాటం పేరుతో కొనసాగిస్తున్న యాత్ర అది. న్యాయస్థానం నుంచి దేవస్థానం అంటూ పవిత్ర వ్యవస్థలను అందులోకి లాక్కురావడం సరికాదు. 
 
- విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మా ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేయడంతోపాటు, కార్మిక సంఘాల ప్రతినిధులుతో సమావేశమై విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను అమ్మడానికి వీల్లేదని కేంద్రానికి లేఖ రాయడం, కేంద్రమంత్రులకు విజ్ఞప్తి చేయడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం చేయగలిగింది అంతా చేస్తుంది. ముఖ్యమంత్రి స్టాండ్‌ ఎప్పుడూ క్లియర్‌ గా ఉంటుంది. చెప్పారంటే చేస్తారు అంతే. మనసులో ఒకటి పెట్టుకుని, బయట మరొకటి మాట్లాడం ఆయనకు చేతకాదు. ఇంతకన్నా ఇంకేమీ క్లారిటీ కావాలి.