1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎంజీ
Last Updated : శనివారం, 30 అక్టోబరు 2021 (12:37 IST)

నవంబరు 7 నుంచి పాపికొండల పర్యాటకం రెడీ

తూర్పుగోదావరి జిల్లా పాపికొండల పర్యాటకం మళ్లీ ప్రారంభం కానుంది. కచ్చులూరు బోటు ప్రమాదం జరిగిన రెండేళ్ల విరామానంతరం పాపికొండల పర్యాటకానికి అధికారులు సర్వం సిద్ధం చేస్తున్నారు.

నవంబరు 7 నుంచి టూరిజం ప్రారంభం కానున్నట్లు ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో ఇప్పటికే తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం పూడిపల్లి పోశమ్మగండి ఆలయం వద్ద ఏర్పాటు చేసిన కంట్రోలు రూంలో అన్ని అనుమతులతో 11 టూరిజం బోట్లను సిద్ధం చేశారు.

మొత్తం రెండు ప్రభుత్వ, 9 ప్రైవేటు బోట్లు సహా.. 11 టూరిజం బోట్లకు కాకినాడ పోర్టు అధికారులు తనిఖీలు నిర్వహించి ఫిట్‌నెస్‌ అనుమతులు ఇచ్చారు.

ప్రస్తుతం గోదావరి నీటిమట్టం 26 మీటర్లుగా ఉందని, 30 మీటర్ల పరిధి వరకూ అనుమతులు ఇవ్వాల్సిందిగా ధవ ళేశ్వరం గోదావరి హెడ్‌ వర్క్స్‌ ఈఈని కోరినట్లు ఏపీ టూరిజం డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌ డీఎం వీరనారాయణ తెలిపారు. గోదావరిలో రూట్‌ పర్మిషన్‌ ధవళేశ్వరం జలవనరుల శాఖ అధికారులు ఇప్పటికే ఇచ్చినట్లు తెలిపారు.
 
ఏపీ టూరిజం తరఫున లైఫ్‌ జాకెట్లు సేఫ్టీ మెజర్‌మెంట్‌ తీసుకుంటామని, టికెట్లు బుక్‌ చేసుకుంటే.. రాజమహేంద్రవరం నుంచి గండిపోశమ్మ ఆలయం వరకూ రోడ్డు మార్గాన టూరిస్టులను తీసుకువస్తామని తెలిపారు.

ఉదయం తొమ్మిది గంటలకు పాపికొండల విహార యాత్రకు బయలుదేరి, సాయంత్రం ఆరు గంటలకు తిరిగి గండి పోశమ్మ గుడివద్దకు చేరుకుంటామని వివరించారు. టికెట్‌ ధర ఒకరికి రూ.1,250 నిర్ణయించామని, టికెట్‌లు ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకోవాలని తెలిపారు.

ప్రయాణంలో ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం స్నాక్స్‌ తామే అందిస్తామని తెలిపారు. ప్రయాణికుల భద్రత కోసం ఒక ఎస్కార్ట్‌ బోటు ఏర్పాటు చేశామని, ప్రతి బోటుకూ సమాచారం అందే విధంగా శాటిలైట్‌ ఫోన్‌ ఉంటుందని, మరో ఫోన్‌ కంట్రోల్‌ రూం వద్ద ఉంటుందని చెప్పారు.

కంట్రోల్‌ రూం వద్ద రెవెన్యూ, పోలీస్‌ సిబ్బంది తనిఖీల అనంతరం దేవీపట్నం పోలీ్‌సస్టేషన్‌ వద్ద బోట్‌ను ఎస్‌ఐ తనిఖీ చేస్తారని తెలిపారు.

పాపికొండల పర్యటన ప్రారంభం కానున్న నేపథ్యంలో పోలవరం మండలం కొరుటూరులో అటవీశాఖ నూతనంగా నిర్మించిన కాటేజీలు, ఐటీడీఏ ఆధ్వర్యంలోని కాటేజీలు సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యాయి.