గురువారం, 2 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 18 సెప్టెంబరు 2021 (10:33 IST)

ఛార్ ధామ్ యాత్ర పునః ప్రారంభం.. కోవిడ్ నిబంధనలు పాటిస్తేనే అనుమతి

chardham yatra
కరోనా వైరస్ కారణంగా సుదీర్ఘకాలం పాటు ఆపివేయబడిన ఛార్ ధామ్ యాత్ర శనివారం నుంచి పునః ప్రారంభం అయింది. నైనిటాల్ హైకోర్టు నిషేధం ఎత్తివేసిన తర్వాత ఛార్‌ధాం యాత్రకు ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కోవిడ్ నెగిటివ్ రిపోర్టుతో పాటు వ్యాక్సిన్ పొందిన వ్యక్తులను మాత్రమే ఛార్‌ధాం యాత్రకు అనుమతిస్తారు. 
 
బద్రీనాథ్‌లో ప్రతిరోజూ 1,000 మంది, కేదార్‌నాథ్‌లో 800 మంది, గంగోత్రిలో 600 మంది, యమునోత్రిలో 400 మంది యాత్రికులను మాత్రమే అనుమతించాలని నిర్ణయించారు. యాత్రికులు కనీసం 15 రోజుల క్రితం రెండు డోసుల కొవిడ్ వ్యాక్సిన్ పొంది సర్టిఫికెట్ చూపించాలని సర్కారు సూచించింది. 
 
హిమాలయ పర్వతాల్లోని దేవాలయాలను సందర్శించే భక్తుల సంఖ్యపై కోర్టు రోజువారీ పరిమితిని కూడా విధించింది. భక్తులు కోవిడ్ మార్గదర్శకాలు పాటించాలని, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే యాత్రికులు స్మార్ట్ సిటీ పోర్టల్‌లో తమ పేర్లను నమోదు చేసుకోవాలని హైకోర్టు ఆదేశించింది.
 
దేవాలయాల చుట్టూ ఉన్న ఏ ఒక్క స్నానఘట్టాల్లోనూ స్నానం చేయడానికి ఎవరినీ అనుమతించరాదని కూడా కోర్టు ఆదేశించింది. చమోలి, రుద్రప్రయాగ్,  ఉత్తరకాశి జిల్లాల్లో చార్ ధామ్ యాత్ర సందర్భంగా పోలీసు బలగాలను మోహరించారు.