గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 5 ఏప్రియల్ 2021 (12:59 IST)

టైలర్ కొడుకునైన నాకు పవన్‌ను డైరెక్ట్ చేసే ఛాన్స్ రావడం అదృష్టం : వేణు శ్రీరామ్

తెలుగులో కేవలం రెండు చిత్రాలకు మాత్రమే దర్శకత్వం వహించిన దర్శకుడు వేణు శ్రీరామ్. ఈయనకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ను డైరెక్ట్ చేసే గొప్ప అవకాశాన్ని దక్కించుకున్నారు. వీరిద్దరి కాంబినేషన్‌లో దిల్ రాజు నిర్మాతగా తెరకెక్కిన చిత్రం వకీల్ సాబ్. ఈ చిత్రం ఈ నెల 9వ తేదీన ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ నేపథ్యంలో ఈ చిత్ర ప్రీరిలీజ్ ఈవెంట్ ఆదివారం హైదరాబాద్ నగరంలో జరిగింది. 
 
ఇందులో దర్శకుడు వేణు శ్రీరామ్ మాట్లాడుతూ, ఈ ప్రాజెక్టును 'దిల్' రాజు నాకు అప్పగించినప్పుడు నాకు చాలా సంతోషం కలిగింది. పవన్ చేసే అవకాశం ఉందని అన్నప్పుడు మరింత ఆనందంతో పొంగిపొయాను. త్రివిక్రమ్ ద్వారా పవన్ కల్యాణ్‌ని కలవాల్సి వచ్చింది. త్రివిక్రమ్ కాల్ చేయగానే ఆయన ఇంటికి వెళ్లాను.
 
త్రివిక్రమ్ నన్ను వెంటబెట్టుకుని పవన్ కల్యాణ్ దగ్గరికి తీసుకువెళతారేమోనని భావించాను. కానీ త్రివిక్రమ్ ‌రూమ్‌లో ఆరడుగుల కటౌట్‌ను చూశాను.. ఆ కటౌట్ పేరే పవన్ కల్యాణ్. ఆయన అక్కడ చాలా ప్రశాంతంగా కూర్చుని కనిపించారు. చిన్నప్పుడు నేను హిమాలయాలను గురించి విన్నాను. 
 
ఆ తర్వాత ఓ సారి షూటింగ్ కోసం వెళ్లినప్పుడు హిమాలయాలను దగ్గరగా చూశాను. పవన్ కల్యాణ్‌ని మూడు అడుగుల దూరంలో చూసినప్పుడు నాకు హిమాలయాలు గుర్తుకు వచ్చాయి. హిమాలయాల్లోని ప్రశాంతత ఆయన ఎదురుగా కూర్చున్నప్పుడు నాకు లభించింది. ఒక మామూలు టైలర్ కొడుకునైన నాకు పవన్ సినిమా చేసే అవకాశం రావడం నేను చేసుకున్న అదృష్టం అని కాస్తంత భావోద్వేగంతో చెప్పుకొచ్చారు.