గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్

వైకాపాకు ఓట్లేస్తే.. శ్రీరాముడు తల నరికేందుకు లైసెన్స్ ఇచ్చినట్టే : పవన్

తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికల్లో అధికార వైకాపాకు ఓటు వేస్తే... గత కొన్ని నెలులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న హిందూ ఆలయాల కూల్చివేతలను ప్రోత్సహించి, శ్రీరాముడి విగ్రహాల తలలు నరికేందుకు లైసెన్సులు ఇచ్చినట్టేనని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. 
 
తిరుపతి లోక్‌సభ ఉపఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం ఆయన బీజేపీ - జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్థి రత్నప్రభతో కలిసి రోడ్‌షో నిర్వహించారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో ప్రసంగించారు. బీజేపీ- జనసేన ఉమ్మడి అభ్యర్థి రత్నప్రభను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. 
 
ఈ సందర్భంగా ఆయన ప్రసంగింస్తూ, 'వైసీపీకి 151 మంది ఎమ్మెల్యేలు, 22 మంది ఎంపీలు ఉండి ఏం చేశారు? ఆరు నెలలు కర్రసాము చేసి మూలనుండే ముసలమ్మను కొట్టినట్టు... సామాన్యులపై బెదిరింపులు, దౌర్జన్యాలకు దిగుతున్నారు. మీకు దమ్ముంటే నాపైకి రండి. ఎలాంటి గొడవ పెట్టుకుంటారో నేను సై' అంటూ సవాల్ విసిరారు. 
 
రాష్ట్రంలో వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పార్టీ ఎమ్మెల్యేల బెదిరింపులు, గూండాగిరీ ఎక్కువ అయిపోతోంది. శాంతిభద్రతలు ఏ స్థాయిలో దిగజారిపోయాయంటే వైఎస్‌ వివేకానంద హత్యకు గురైతే ఇప్పటికీ నిందితులను పట్టుకోలేదు. కోడికత్తి కేసుకు కూడా వదిలేశారు. చిన్నాన్న హత్య కేసు నిందితులను పట్టుకుని సోదరికి న్యాయం చేయని జగన్‌ రాష్ట్రానికి ఏమిచేస్తాడు?’ అని పవన్ సూటిగా ప్రశ్నించారు. 
 
'ఎన్నికల ప్రచార సమయంలో ఎంతోమంది యువత ఆవేదన వ్యక్తం చేస్తుంటారు. పోలింగ్‌ సమయంలో మాత్రం ఎందుకు భయపడుతున్నారు? ఒక ఎమ్మెల్యే భయపెడితే భయపడిపోవాలా? వైసీపీ ఎమ్మెల్యేలకు ఎక్కడ నుంచి డబ్బులు వస్తున్నాయి? ఓటుకు రెండువేలు ఎక్కడ నుంచి ఇస్తున్నారు? నన్ను సినిమాలు వదిలేసి అడ్డదారులు తొక్కమంటారా? రాగి సంగటి తిని బతుకుతా. కానీ అడ్డమైన పనులు చేయం' అని ప్రకటించారు. 
 
అంతేకాకుండా, తిరుపతిలో ఓటు అడిగేందుకు వచ్చే వైకాపావాళ్ళను ఒకటే అడగండి. 150కి పైగా ఆలయాలను కూల్చారు. రాముడి తల నరికేశారు. ఈ రోజుకూ దోషులను పట్టుకోలేక పోయారు. ఏ ముఖం పెట్టుకున ఓటు అడుగుతారని నిలదీయండి అని ఓటర్లకు పవన్ పిలుపునిచ్చారు. పైగా, ఈ ఎన్నికల్లో వైకాపాకు ఓట్లు వేస్తే.. ఆ పార్టీ దౌర్జన్యాలను, ఆలయాల కూల్చివేతలను ప్రోత్సహించినట్టే అవుతుందన్నారు.