గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : సోమవారం, 5 ఏప్రియల్ 2021 (16:07 IST)

నా మనసు, హృదయం దేశం కోసం, మీ కోసం కొట్టుకుంటాయి: పవన్ కళ్యాణ్ (video)

vakeel pre-release
పవన్ కళ్యాణ్ కొత్త సినిమా వకీల్ సాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ అభిమానుల కేరింతల మధ్య వైభవంగా జరిగింది. హైదరాబాద్ శిల్పకళా వేదికలో జరిగిన ఈ కార్యక్రమం ఆద్యంతం ఆకట్టుకుంది. వకీల్ సాబ్ లోని జనగణ మన పాట లేజర్ షోతో కార్యక్రమం ప్రారంభమైంది. సంగీత దర్శకుడు థమన్ ఆధ్వర్యంలోని మ్యూజికల్ షో అభిమానులను ఉర్రూతలూగించింది.

ఈ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్, నిర్మాత దిల్ రాజు, దర్శకుడు శ్రీరామ్ వేణు, దర్శకుడు జాగర్లమూడి క్రిష్, దర్శకుడు సురేందర్ రెడ్డి, దర్శకుడు హరీష్ శంకర్, దర్శకులు సాగర్ చంద్ర, మైత్రీ మూవీస్ నిర్మాత రవి శంకర్, నిర్మాత ఏఎం రత్నం, నిర్మాత బండ్ల గణేష్, ఎస్ ఆర్ట్ ఎంటర్టైన్మెంట్స్ రామ్ తాళ్లూరి, సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మాత నాగ వంశీ, నాయికలు అంజలి, అనన్య నాగళ్ల తదితరులు పాల్గొన్నారు. 
 
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, నా గుండె చప్పుళ్లయిన నా అభిమానులకు, ఈ కార్యక్రమానికి వచ్చిన అక్కాచెల్లెల్లు, అన్నదమ్ములకు, టీవీల్లో చూస్తున్న ప్రేక్షకులకు ప్రతి ఒక్కరికి పేరు పేరునా నా హృదయపూర్వక నమస్కారాలు. సినిమా ఫంక్షన్ చాలా సంవత్సరాలు అయ్యింది. బండ్ల గణేష్‌లా మాట్లాడలేం కదా. పొలిటికల్ సభలైతే మాట్లాడొచ్చు గానీ ఇక్కడకొచ్చి ఎక్కువ మాట్లాడలేం. మూడు సంవత్సరాలు నేను సినిమా చేయలేదు అనే భావన కలగలేదు.

ఎప్పుడూ నా మనసు, హృదయం దేశం కోసం, మీ కోసం కొట్టుకుంటాయి. ఒక పుస్తకం చదివినా, ఒక వాక్యం చదివినా దేశం కోసమే అనిపిస్తుంటుంది. కాబట్టి మూడు సంవత్సరాలు నేను సినిమాకు దూరంగా ఉన్నానంటే ఆ కాలం నాకు తెలియలేదు. సినిమా పరిశ్రమకు వచ్చి 24 ఏళ్లవుతుంది అని మీరు అంటుండగా వినడమే గానీ నాకు అసలు గుర్తు లేదు. పని చేసుకుంటూ వెళ్లిపోయాను గానీ తెలియదు. తెలుగు చిత్ర పరిశ్రమలో మహోన్నత స్థానానికి వెళ్లిన నిర్మాత దిల్ రాజు నాతో సినిమా చేయడం నేను నిజంగా అదృష్టంగా భావిస్తున్నాను.

ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట. నేను ఎప్పుడూ కలలు కనే వారిని ఇష్టపడతాను. ఏదైనా సరే ఒక కల కనాలి. నేను ఇది సాధిస్తాను, నేను ఈ స్థాయికి వెళ్తాను అని కలలు గనే వారంటే నాకు ఇష్టం. గుంటూరు శేషేంద్ర శర్మ అన్నట్లు కలలు కను కలలు కను కలలు కను నీ కలల్ని తొక్కేస్తున్న పాదాల్ని ఖండించే వరకు కలలు కను అనే మాటలు నాకు చాలా ఇష్టం. 

నేను కోరుకున్నది తప్ప అన్నీ జరిగాయి.
దిల్ రాజు గారు ఎన్నో కలలు గన్నారు. తొలి ప్రేమ షూటింగ్ టైమ్‌లో దిల్ రాజు గారిని నిర్మాత డీవీవీ రాజు గారు తీసుకొచ్చి పరిచయం చేశారు. ఇంకా అప్పటికి ఒక పోస్టర్ మాత్రమే రిలీజ్ చేశాం. ఆ పోస్టర్ చూసి నేను సినిమా కొంటానని దిల్ రాజు గారు రావడం ఆశ్చర్యమేసింది. ఆయనకు సినిమా పట్ల ఒక సెన్స్ ఉందని అనిపించింది. విజయం ఎక్కడ ఉందో తెలుసుకోగల వ్యక్తి దిల్ రాజు. సినిమా మీద ఆయనకున్న ప్యాషన్ అలాంటిది. దిల్ రాజు గారు చిన్న స్థాయి నుంచి వచ్చిన వ్యక్తి కాబట్టి అన్ని విషయాలు తెలుసుకున్నారు.

నా కెరీర్లో మొదటి నుంచి దిల్ రాజు పాత్ర పోషించారు. చాలా సూపర్ హిట్ సినిమాలు డిస్ట్రిబ్యూట్ చేశారు. మా మధ్య ఎందుకో గానీ సినిమా చేయాలని డిస్కషన్ రాలేదు. కానీ వకీల్ సాబ్ సినిమాలో నటించాక.. ఇలాంటి ప్యాషనేట్ ప్రొడ్యూసర్‌తో ఇంకా ముందుగానే సినిమా చేసి ఉండాల్సింది అనిపించింది. ఈ మాట మనస్ఫూర్తిగా చెబుతున్నాను. కానీ నేను సినిమాల కోసం ఎవర్నీ ఏదీ అడగలేను. యాచించలేను. అది నా తత్వం.

దర్శకుడు వేణు మాట్లాడుతూ.. నేను టైలర్ కుటుంబం నుంచి వచ్చాను అన్నాడు. మా నాన్న కానిస్టేబుల్. నేను మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చాను. నా దృష్టిలో ఏ వృత్తి తక్కువ కాదు ఏదీ ఎక్కువ కాదు. డిగ్నిటీ ఆఫ్ లేబర్‌ను నమ్ముతాను. శ్రీరామ్ వేణు గారు చిన్న స్థాయి నుంచి వచ్చారు. ఆయన ఈ స్థాయికి వచ్చి నాతో సినిమా చేశారంటే అది నేను ఇచ్చేది కాదు ఎవరు ఇచ్చేది కాదు. స్వశక్తితో ఆయన సంపాదించుకున్నారు. వేణు తల్లిదండ్రుల కష్టం, పుణ్యం, కుటుంబ సభ్యుల శ్రమ, తోడ్పాడు, ఆయన మేధా శక్తి, మేధస్సు ఇవే ఆయనకు వకీల్ సాబ్ అవకాశాన్నిచ్చాయి. ఇలాంటి చక్కటి దర్శకుడి దగ్గర పనిచేసినందుకు నేను అదృష్టంగా భావిస్తున్నాను.

నేను సినిమాలు చేద్దామనుకోలేదు, వాస్తవానికి అసలు నేను నటుడిని అవుదామనే అనుకోలేదు. త్రివిక్రమ్ గారికి నేనో మాట చెప్పాను. నేను కల గన్నది ఒక్కటే అది నేనో మధ్య తరగతి జీవితం గడపాలని, ఓ చిన్న కుటీరంలో ఎవరు గూర్తు పట్టని జీవితం గడపాలని, కానీ అది నెరవేరలేదు. నేను కోరుకున్నది తప్ప అన్నీ జరిగాయి. ఈ జన్మకు చిన్న జీవితం రాదు మర్చిపొండి అన్నారు త్రివిక్రమ్. (అభిమానులు సీఎం సీఎం అని అంటుండగా) సీఎం అనేది మనం కోరుకోకూడదు, అది జరగిపోవాలి. మీ హృదయంలో స్థానం దొరుకుందని అనుకోలేదు. కానీ ఇంత ప్రేమ ఇచ్చారు. 

Pawan kalyan-prereelase
కేన్సర్‌తో కీమో థెరపీ తీసుకుంటూ కేసు వాదించారు
సమాజం కోసం దేశం కోసం పనిచేస్తూ వెళ్తుంటాం. ఆ క్రమంలో ఉన్నత స్థానం దొరికిందా సంతోషం, మీ గుండెల్లో స్థానం కంటే ఉన్నత స్థానం మరేది ఉంటుంది. అంతకుమించింది ఏదీ లేదు. నేను ఏ పదవి కోసం వెంపర్లాడను, నేను సమాజం కోసం పనిచేసే వ్యక్తిని. బాధ్యతలు ఉంటే ఆధ్యాత్మిక భావాలు రావు అని చిరంజీవి గారు చెప్పిన మాటలే నన్ను నటుడిని చేశాయి. ఆ మాటలే ఇవాళ రాజకీయాల్లోకి తీసుకెళ్లాయి. ముక్కు మూసుకుని ధ్యానం చేసేకంటే, మన సెల్ఫ్ రియలైజేషన్ కంటే కూడా, కష్టాలు నష్టాలు అనుభవిస్తూ, తిట్లు తింటూ కర్మ యోగం చేయడం కష్టం. నేను ఇవాళ కర్మ యోగం చేస్తున్నాను.

ఆ ఆశీస్సులు భగవంతుడు నాకు ఇచ్చాడు. నేను ఇంటర్ మధ్యలో వదిలేసిన వ్యక్తిని. బాగా చదువుతాను. వకీల్ సాబ్ అంటే నాకు తెలిసిన మొదటి వకీల్ నానీ పాల్కీవాలా అని ఎమర్జెన్సీ టైమ్‌లో మానవ హక్కుల విషయంలో బలంగా వాదించిన వ్యక్తి. అన్నయ్య నాగబాబు గారు లాయర్ కాబట్టి నానీ పాల్కీవాలా పుస్తకం చదివేవారు. ఆయన గురించి విన్న రోజు నుంచి నాకు లాయర్ వృత్తి మీద చాలా గౌరవ ఏర్పడింది. భువనగిరి చంద్రశేఖర్ గారని మరో లాయర్ నాకు స్ఫూర్తి. చుండూరు దళితుల ఊచకోత కేసులో బలంగా నిలబడిన వ్యక్తి ఆయన.

చంద్రశేఖర్ జీవితం కోల్పోయారు. కేన్సర్‌తో కీమో థెరపీ తీసుకుంటూ కేసు వాదించారు. ఆయన చనిపోయారు. చంద్రశేఖర్ గారు నాకో పుస్తకం పంపారు. పేదల కోసం, మానవ హక్కుల కోసం పాటుపడే చంద్రశేఖర్, బాలగోపాల్ వంటి  న్యాయవాదులంటే నాకు చాలా గౌరవం. నేను చాలా అదృష్టం చేసుకున్నాను కాబట్టే ఈ పాత్ర చేయగలిగాను. నేను అమితాబ్ అభిమానిని. మీరు నాకోసం గొడవపడినట్లు, నేను అమితాబ్ కోసం గొడవలు పడేవాడిని. నేను ఈ పింక్ సినిమా చూసినప్పుడు ఈ పాత్ర చేయగలనా అనిపించింది.

నేను సినిమా అంటే సామాజిక స్పృహను ఎంతోకొంత చూపించాలని తపన పడుతుంటాను. అప్పుడే సమాజానికి మేలు చేసిన వాడిని అవుతానని అనుకునేవాడిని. ఐటెం సాంగ్‌ల కంటే నా చిత్రాల్లో దేశ భక్తి పాటలు పెట్టుకునేవాడిని. ఐటెం సాంగ్‌ల కంటే దేశభక్తి పాటలంటే నాకిష్టం. నన్ను ఇబ్బంది పెట్టి కెవ్వు కేక లాంటి పాటలు చేయించారు. మీ ఆనందం కోసం నేను కొన్ని చేస్తాను. అయితే వాటికి కొన్ని పరిమితులు ఉంటాయి. నేను అక్కాచెల్లెల్ల మధ్య పెరిగాను. వదిన, చిన్నమ్మ, అత్తలు, అమ్మ .. ఇలా నా జీవితం చుట్టూ ఆడపడుచులు నన్ను గుండెల్లో పెట్టుకుని చూసుకునేవారు. అందుకే నా చిత్రాల్లో మహిళలకు గౌరవమైన పాత్రలు ఉంటాయి.

ఈ వకీల్ సాబ్ సినిమా మా ఇంట్లో ఆడపడుచులకు, స్త్రీ మూర్తులకు, ఇక్కడున్న వారికి, టీవీల్లో చూస్తున్న మహిళలకు, తల్లులకు, ఆడబిడ్డలకు మా తరుపున ఇస్తున్న గౌరవం. మీ త్యాగాలకు మేము ఇస్తున్న చిన్న రీప్లే వకీల్ సాబ్ సినిమా. ఆడపిల్ల బయటకెళ్తే జర భద్రం బిడ్డా అని చెబుతుంటారు. వేరే ప్రాంతాలకు షూటింగ్‌లకు వెళ్తే అక్కడ మా యూనిట్ లోని ఆడ పిల్లలను ఏడిపించేవారు. అప్పుడు నేను కర్రపట్టుకుని వెళ్లేవాడిని.

నా చుట్టూ ఉన్న ఆడబిడ్డలను కాపాడుకోలేకపోతే నేనేం హీరోను అనిపించేది. ఆడ బిడ్డల మాన ప్రాణ సంరక్షణ ఈ సమాజానికి చాలా ముఖ్యం. అప్పుడే జై భారత మాతాకి జై అనే నినాదానికి అర్థం. స్త్రీ లేనిదే సృష్టి లేదు. అలాంటి స్త్రీని కాపాడుకోలేకపోతే ఎలా. ముగ్గురు వర్కింగ్ వుమెన్ ఒక ఇబ్బందిలో పడితే వాళ్లను ఆదుకునే లాయర్ క్యారెక్టర్ నేను నటించడం అదృష్టంగా భావిస్తున్నా. అంజలి, అనన్య, నివేదా, శృతి చక్కగా నటించారు అన్నారు.