గురువారం, 9 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 23 అక్టోబరు 2020 (21:20 IST)

పాపం.. హిమాలయాల్లో విహరిస్తున్న 'మన్మథుడు'!

టాలీవుడ్ మన్మథుడు అక్కినేని నాగార్జున ఇపుడు హిమాలయ పర్వతాల్లో చక్కర్లు కొడుతున్నారు. నిన్నామొన్నటివరకు ప్రముఖ తెలుగు చానెల్‌లో వస్తున్న బిగ్ బాస్ 4వ సీజన్‌కు హోస్ట్‌గా వ్యవహరిస్తూ వచ్చారు. అయితే ఇపుడు ఉన్నట్టుండి హిమాలయాలకు ఎందుకు వెళ్లారనే కదా మీ సందేహం. అయితే, ఈ కథనం చదవండి. 
 
ప్రస్తుతం నాగార్జున 'వైల్డ్ డాగ్' అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం తాజా షెడ్యూల్ హియాలయ పర్వత శ్రేణుల్లో సాగుతోంది. 'వైల్డ్ డాగ్' షూటింగ్ కోసం రోహ్ టాంగ్ పాస్ ప్రాంతానికి వెళ్లినట్టు నాగ్ స్వయంగా వెల్లడించారు. తన ట్విట్టర్ ఖాతాలో ఓ వీడియోను పోస్ట్ చేశారు. 
 
సముద్ర మట్టానికి 13 వేల అడుగుల ఎత్తున ఉన్న రోహ్ టాంగ్ పాస్‌లో ఉన్నానని, ప్రస్తుతం ఇక్కడ ఎంతో ఆహ్లాదకరంగా ఉందని నాగ్ వెల్లడించారు. నవంబరు నుంచి మే నెల వరకు ఇక్కడి వాతావరణం ఎంతో ప్రమాదకరంగా ఉంటుందని, అందుకే ఈ ప్రాంతాన్ని మూసివేస్తారని వివరించారు. 
 
అయితే, తాము 'వైల్డ్ డాగ్' షూటింగ్ కోసం ఇక్కడికి వచ్చామని, ఎంతో ఉత్సాహభరిత వాతావరణంలో చిత్రీకరణ సాగుతోందని తెలిపారు. నీలాకాశం, ఎత్తయిన పర్వతాలు, సరస్సులతో ఎంతో అందంగా ఉన్న ప్రదేశంలో షూటింగ్ చేస్తున్నామని, 7 నెలల తర్వాత షూటింగులో పాల్గొంటుండటం ఆనందంగా ఉందని అన్నారు. 21 రోజుల్లో షూటింగ్ పూర్తవుతుందని, ఆ తర్వాత తిరిగి భూమిపై కాలు మోపుతానని చెప్పుకొచ్చారు. 
 
అయితే, నాగ్ బిగ్ బాస్ రియాల్టీ షోకు హోస్ట్ గా వ్యవహరిస్తున్న నేపథ్యంలో ఇకపై ఆయన కొనసాగడంపై స్పష్టతలేదు. దీనిపై స్టార్ మా చానల్ వెల్లడించాల్సిందే! కాగా, వైల్డ్ డాగ్ చిత్రం ఉగ్రవాదం నేపథ్యంలో తెరకెక్కుతున్నట్టు తెలుస్తోంది. ఈ చిత్రానికి అహిషోర్ సాల్మన్ దర్శకుడు.