మంగళవారం, 28 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ttdj
Last Updated : సోమవారం, 16 జనవరి 2017 (08:39 IST)

టీడీపీలోకి కలెక్షన్‌ కింగ్‌ మోహన్‌బాబు... ఫిబ్రవరి 12న ముహుర్తం.. వేదిక విజయవాడ?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అధికార తెలుగుదేశానికి వలసల సంఖ్య పెరిగిపోతోంది. వైకాపా నుంచే ఇప్పటికే అధికసంఖ్యలో వలసలు పోతుండగా ప్రస్తుతం సినీనటుడు కూడా అధికారపార్టీలోకి క్యూకట్టారు. సినీపరిశ్రమలో తనకంటూ ప

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అధికార తెలుగుదేశానికి వలసల సంఖ్య పెరిగిపోతోంది. వైకాపా నుంచే ఇప్పటికే అధికసంఖ్యలో వలసలు పోతుండగా ప్రస్తుతం సినీనటుడు కూడా అధికారపార్టీలోకి క్యూకట్టారు. సినీపరిశ్రమలో తనకంటూ ప్రత్యేకస్థానం సంపాదించుకున్న కలెక్షన్‌ కింగ్‌ మోహన్‌బాబు తిరిగి సొంత గూటికే వెళ్ళేందుకు సిద్ధమయ్యారు. గతంలో తెలుగుదేశం పార్టీలో ఉన్న మోహన్ బాబు ఆ పార్టీలోకి వెళ్ళేందుకు మరోసారి నిర్ణయించుకున్నారు. ఎన్నికలు దగ్గరలో లేకున్నా ఇప్పటి నుంచో పార్టీలో చురుగ్గా ఉంటే తర్వాత అవకాశాలు దానికదే వస్తుందన్నది మోహన్ బాబు ఆలోచనగా ఉంది.
 
తెలుగు చిత్ర సినీపరిశ్రమలో చరిష్మా ఉన్న వ్యక్తి మోహన్ బాబు. ఒకప్పుడు అగ్రహీరోలలో ఒకరుగా ఉన్న మోహన్ బాబు కొంతకాలం టీడీపీలో పనిచేశారు. దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావును గురువుగా భావించే మోహన్ బాబు ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చారు. అయితే కొన్నిరోజుల పాటు మాత్రమే ఉన్న ఆయన ఆ తర్వాత రాజకీయాలకు దూరమవుతూ వచ్చారు. 
 
అన్ని పార్టీల నాయకులతో సన్నిహిత సంబంధాలున్న మోహన్ బాబు చివరకు అధికార పార్టీలోకి తిరిగి వెళ్ళాలని నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఇదంతా బాగానే ఉన్నా తెదేపాలోకి వెళ్ళాలనుకోవడం ఆయన సొంత నిర్ణయం అందుకే కుటుంబ సభ్యులెవరూ ఆయనకు అడ్డుచెప్పరు. ఇది ప్రతి ఒక్కరికీ తెలిసిందే. సంక్రాంతి రోజున చిత్తూరు జిల్లా నారావారిపల్లిలో ఉన్న చంద్రబాబునాయుడును స్వయంగా మోహన్‌బాబు కలవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. అది కూడా గంటకుపైగా మోహన్ బాబు బాబుతో మాట్లాడటం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అయితే బయటకు వచ్చిన మోహన్ బాబు మాత్రం కేవలం సంక్రాంతి శుభాకాంక్షలు మాత్రమే చెప్పానని, మరెలాంటి రాజకీయం లేదని చెప్పి వెళ్లిపోయారు. 
 
కానీ మోహన్‌ బాబు పార్టీలోకి వస్తానని చెప్పిన విషయాన్ని ఏకంగా ఆయనతో పాటు వచ్చిన సన్నిహితులే చెప్పడం ఇక్కడ కొసమెరుపు. అంతేకాదు ఫిబ్రవరి 12వ తేదీ విజయవాడ వేదికగా టీడీపీలో చేరిపోయేందుకు ముహూర్తం ఖరారు చేసుకున్నారట.