చంద్రబాబు భార్య భువనేశ్వరికి తప్పిన పెనుముప్పు... ఏంటది? ఎలా?
టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరికి పెనుముప్పు తప్పింది. ఆమె ప్రయాణించిన ఇండిగో విమానం ల్యాండింగ్ గేర్ తెరుచుకోలేదు. దీంతో ఆ విమానం కొద్దిసేపు గాల్లోనే చక్కర్లు కొట్టింది. దీంతో ఏం జరుగుతుందో తెలియని ఆయోమయ పరిస్థితులు నెలకొన్నాయి.
నిజం గెలవాలి పేరుతో ఆమె రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబు అరెస్టును జీర్ణించుకోలేక ప్రాణాలు కోల్పోయిన మృతుల కుటుంబాలను ఆమె కలుసుకుంటా వారికి ఆర్థిక సాయం చేస్తూ, ఆ కుటుంబాలను ఓదార్చుతున్నారు. ఇందులోభాగంగా, ఆమె మంగళవారం నుంచి హైదరాబాద్ నుంచి విజయవాడకు వచ్చారు.
ఆమె ప్రయాణించిన ఇండిగో విమానం విజయవాడ గన్నవరంలో ల్యాండింగ్‌కు ప్రయత్నించగా, వీల్ తెరుచుకోలేదు. దీంతో పైలట్ ఆ విమానాన్ని మళ్లీ గాల్లోకి తీసుకెళ్లారు. కొద్దిసేపు విమానం గాల్లోనే చక్కర్లు కొట్టడంతో ఏం జరుగుతుందో తెలియక ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు.
ఆ తర్వాత కొద్దిసేపటికి ల్యాండింగ్ గేర్ తెరుచుకోవడంతో వీల్ బయటకు వచ్చింది. దీంతో విమానాన్ని పైలెట్ సురక్షితంగా కిందికి దించడంతో ప్రతి ఒక్కరూ ఊపిరి పీల్చుకున్నారు. ఆ తర్వాత గన్నవరం విమానాశ్రయంలో ఆమెకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్, మాజీ మంత్రి దేవినేని ఉమ తదితరులు స్వాగతం పలికారు. ఆమె మంగళవారం రేపల్లె, పర్చూరు, ఒంగోలు నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు.