గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Updated :విజ‌య‌వాడ‌ , గురువారం, 21 అక్టోబరు 2021 (09:48 IST)

ధ్వంసం అయిన ఫర్నీచర్ మధ్యలో చంద్రబాబు దీక్ష

ప్రత్యేకమైన పరిస్థితుల్లో తాను దీక్ష చేస్తున్నట్లు టిడిపి జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. రాష్ట్రంలో టిడిపి కార్యాలయాలు, కార్యకర్తలపై దాడులకు నిరసనగా చంద్రబాబు 36 గంటల దీక్ష చేపట్టారు. మంగళగిరిలోని టిడిపి కేంద్ర కార్యాలయంలో దుండగుల దాడిలో ధ్వంసం అయిన ఫర్నీచర్ మధ్యలో చంద్రబాబు దీక్షలో కూర్చున్నారు.
 
చంద్రబాబు దీక్షా కార్యక్రమాన్ని టిడిపి రాష్ట్ర అధ్యక్షులు కె. అచ్చెన్నాయుడు ప్రారంభించారు. పార్టీ కీలక నేతలు చంద్రబాబు దీక్షా శిబిరం వద్దకు చేరుకుంటున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ,  దాడుల విషయంపై డీజీపీకి ఫోన్ చేస్తే స్పందించ లేదని ఆరోపించారు. తన ఫోన్ కాల్ తీసుకోవడానికి డీజీపీ నిరాకరించారు అని పేర్కొన్నారు. ఈ దాడులు తమపై జరిగినవి కాదని ప్రజాస్వామ్యంపై జరిగిన దాడులు అని వ్యాఖ్యానించారు. 
 
ఒక్క చోట కాదు రాష్ట్రంలో చాలా చోట్ల దాడులు జరిగాయి అని ప్రస్తావించారు. పక్కా ప్రణాళికతో టిడిపిని  తుద‌ముట్టించాలి అనే ఉద్దేశ్యంతోనే దాడి జరిగిందని అన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయి అని విమర్శించారు. టిడిపి కార్యాలయాలు, నేతలే లక్ష్యంగా దాడులు జరుగుతున్నాయి అని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు ఏం చెయ్యాలో చేసి చూపిస్తాను అని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్య స్ఫూర్తికి ప్రతిబింబం ఎన్టీయార్ భవన్ అని వ్యాఖ్యానించారు. టిడిపి నేత పట్టాభి ఇంటిపైనా దాడి చేశారు అని ప్రస్తావించిన చంద్రబాబు పట్టాభి అరెస్టును తీవ్రంగా ఖండించారు. 
 
దాడులపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా కి ఫోన్ చేసి దాడులను విషయాన్ని వివరించినట్లు తెలిపారు. విలువలతో కూడిన పార్టీ టిడిపి అని ప్రస్తావించారు. పట్టాభి చేసిన వ్యాఖ్యలు అభ్యంతరం అయితే సీఎం జగన్, అతను మంత్రులు మాట్లాడే భాషకు చర్చపై సిద్దమా? అని చంద్రబాబు ప్రశ్నించారు.