1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : గురువారం, 18 జనవరి 2024 (08:42 IST)

ఆనాటి రామన్న రాజ్యాన్ని తిరిగి సాధించుకుంటాం : ఎన్టీఆర్‌కు చంద్రబాబు నివాళి

ntr
తెలుగు ప్రజల ఆరాధ్య నటుడు, టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్.టి.రామారావు వర్థంతి వేడుకలు గురువారం జరుగుతున్నాయి. ఈ సందర్భంగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సోషల్ మీడియా వేదికగా నివాళులు అర్పించారు. దేశంలో సంక్షేమ పాలకు ఆద్యుడైన ఎన్టీఆర్ వర్థంతి సందర్భంగా ఆ మహనీయుడి స్మృతికి నివాళులు అంటూ ఎక్స్ వేదికగా స్పందించారు. దేశంలో సంక్షేమపాలనకు ఆద్యుడు ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఆ మహనీయుని స్మృతికి నివాళులు. 
 
ఒకే ఒక జీవితం... రెండు తిరుగులేని చరిత్రలు. కృషి, పట్టుదల, క్రమశిక్షణ అనే ఆయుధాలతో ఒక రైతుబిడ్డ సాధించిన అద్వితీయ విజయానికి ప్రతీక నందమూరి తారక రామారావు గారు. తెలుగునాట నిరుపేదకు అలనాటి రామరాజ్య సంక్షేమాన్ని అందించిన మానవతావాది... తెలుగు జాతికి తరతరాలకు సరిపడా ఖ్యాతిని వారసత్వంగా ఇచ్చిన తెలుగు వెలుగు ఎన్టీఆర్. పేదరికం లేని సమాజాన్ని, కులమతాలకు అతీతమైన సమసమాజాన్ని స్థాపించాలన్న ఎన్టీఆర్ కలను నిజం చేయడమే మన కర్తవ్యం కావాలి.
 
బలహీన వర్గాల అణచివేత, పేదలను ఇంకా పేదలుగా మారుస్తున్న పాలన, సమాజంలో ఏ ఒక్కరికీ దక్కని భద్రతలతో తెలుగునేల అల్లాడుతున్న ఈ వేళ... తిరిగి రామరాజ్య స్థాపనకు ఎన్టీఆర్ స్ఫూర్తిగా మనందరం కదలాలి. అందుకే 'తెలుగుదేశం పిలుస్తోంది. రా...  కదలిరా!' అని ఆనాడు  ఎన్టీఆర్ ఇచ్చిన పిలుపు స్ఫూర్తిగా... నేను  'రా... కదలిరా!' అని పిలుపునిచ్చాను. తెలుగు ప్రజలరా! రండి...  ఆనాటి రామన్న రాజ్యాన్ని తిరిగి సాధించుకుందాం. ఎన్టీఆర్ కు అసలైన నివాళి అర్పించుదాం అంటూ పేర్కొన్నారు.