1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్

ఉండవల్లి నివాసానికి చేరుకున్న చంద్రబాబు.. దద్దరిల్లిన బెజవాడ బెంజి సర్కిల్

chandrababu convoy
స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకి ఏపీ హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. దీంతో ఆయన మంగళవారం సాయంత్రం రాజమండ్రి జైలు నుంచి విడుదలై.. సుధీర్ఘ సమయం ప్రయాణం చేసిన బుధవారం ఉదయానికి ఆయన విజయవాడ ఉండవల్లిలోని తన నివాసానికి చేరుకున్నారు. అంతకుముందు ఆయనకు రోడ్డు మార్గం పొడవున అపూర్వ స్వాగతం లభించింది. ముఖ్యంగా, విజయవాడ బెంజి సర్కిల్ దద్దరిల్లిపోయింది. చంద్రబాబుకు ఘన స్వాగతం లభించింది. 
 
బుధవారం వేకువజామున 3.30 గంటల సమయంలో చంద్రబాబు కాన్వాయ్ రామవరప్పాడు మీదుగా విజయవాడ నగరంలోకి ప్రవేశించింది. అప్పటికే ఎదురుచూస్తున్న అభిమానులు ఆయనను చూడగానే ఒక్కసారిగా కేరింతలు కొడుతూ రోడ్లపైకి వచ్చారు. 'జై చంద్రబాబు, జై తెలుగుదేశం' అంటూ నినాదాలతో మారుమోగించారు. విజయవాడ నిర్మలా కాన్వెంట్, బెంజి సర్కిల్ పరిసరాలు జైచంద్రబాబు నినాదాలతో దద్దరిల్లిపోయాయి. కనకదుర్గ వారధి, తాడేపల్లి, ఉండవల్లి సెంటర్లలో చంద్రబాబు రాకకోసం జనం గంటల తరబడి ఎదురుచూశారు. గతంలో ఎన్నడూ చూడని విధంగా తెల్లవారుజామున సైతం విజయవాడ నగర ప్రజలు చంద్రబాబును చూసేందుకు గంటల తరబడి నిరీక్షించారు.
cbn convoy
 
తెల్లవారుజామున 4.45 గంటలకు విజయవాడ నగరంలోని బెంజిసర్కిల్‌కు చంద్రబాబు చేరుకోగానే, ఆయన కాన్వాయ్‌కు అపూర్వస్వాగతం లభించింది. విజయవాడ నగరానికి చెందిన వేలాదిమంది మహిళలు, కార్యకర్తలు, అభిమానులు పెద్దఎత్తున చంద్రబాబుకు ఘనస్వాగతం పలికారు. పెల్లుబుకిన ఆనందంతో మహిళలు హారతులు ఇచ్చారు. ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, గద్దె అనురాధ, నెట్టెం రఘురామ్, నక్కా ఆనంద్ బాబు, దేవినేని ఉమ, తంగిరాల సౌమ్య, ఆచంట సునీత, నాగుల్ మీరా, కేశినేని చిన్ని, ఇతర ముఖ్యనేతలు అధినేతకు ఘనస్వాగతం పలికారు. 
 
కాగా మంగళవారం సాయంత్రం 4.15 గంటల సమయంలో రాజమండ్రి నుండి చంద్రబాబు బయలుదేరారు. అభిమానుల తాకిడి ప్రభావంతో ఆయన సుధీర్ఘ నిర్విరామ ప్రయాణం చేయాల్సి వచ్చింది. అయితే, మధ్యంతర బెయిల్‌కు సంబంధించి కోర్టు నిబంధనలకు లోబడి చంద్రబాబు కారు లోపల నుంచే అభిమానులకు అభివాదం చేస్తూ ముందుకుసాగారు. బెంజిసర్కిల్ నుంచి కనకదుర్గ వారధి వైపు వెళ్లాల్సిన కాన్వాయ్‌ను పోలీసులు బందరు రోడ్డు, ఫైర్ స్టేషన్, వినాయకుడి గుడి, ప్రకాశం బ్యారేజి మీదుగా ఉండవల్లి వెళ్లేవిధంగా దారిమళ్లించారు.