శనివారం, 28 సెప్టెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 30 అక్టోబరు 2023 (22:05 IST)

మద్యం కంపెనీలకు అక్రమంగా అనుమతులు ఇచ్చారంటూ.. మండిపడిన లోకేశ్...

chandrababu
టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుపై ఏపీ ప్రభుత్వం మరో కేసు నమోదు చేసింది. గత ఏపీ ప్రభుత్వ హయాంలో మద్యం కంపెనీలకు అక్రమంగా అనుమతులు ఇచ్చారంటూ చంద్రబాబును ఏ3గా పేర్కొంటూ కేసు నమోదు చేశారు. చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో మద్యం కంపెనీలకు అక్రమంగా అనుమతులు ఇచ్చారన్న ఆరోపణలపై ఏపీ సీఐడీ ఈ కేసు నమోదు చేసింది. ఈ కేసులో చంద్రబాబు పేరును ఏ3గా పేర్కొంది. ఈ పిటిషన్‌పై విచారణకు విజయవాడ ఏసీబీ కోర్టు కూడా అనుమతి ఇచ్చింది. 
 
కాగా, చంద్రబాబును ఇప్పటికే స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో అరెస్టు రాజమండ్రి జైలులో బంధించారు. అలాగే, ఫైబర్ గ్రిడ్ కేసు, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసుల్లో ఆయన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇపుడు తాజాగా మద్యం అనుమతుల కేసును నమోదు చేసింది. దీనికి ఏసీబీ కోర్టు అనుమతి ఇచ్చిన నేపథ్యంలో చంద్రబాబును మరోసారి అరెస్టు చేసేందుకు సీఐడీ సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది. 
 
తన తండ్రి చంద్రబాబుపై ఏపీ ప్రభుత్వం మద్యం అనుమతుల కేసు నమోదు చేయడంపై నారా లోకేశ్ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. కక్ష సాధింపులకు మరో రూపమే జగన్ అని మండిపడ్డారు. కక్ష సాధింపులో నువ్వు ఆంధ్రా గోల్డో, ప్రెసిడెంట్ మెడల్ బ్రదర్ అంటూ ఘాటుగా స్పందించారు. పిచ్చికి వాడుతున్నట్టే కక్ష సాధింపు ధోరణికి కూడా మందులు వాడాలని అన్నారు.