సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 29 అక్టోబరు 2023 (10:44 IST)

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు : పోటీకి తెలుగుదేశం పార్టీ దూరం

chandrababu
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయరాదని తెలుగుదేశం పార్టీ నిర్ణయించింది. ఈ మేరకు ఆ పార్టీ రాష్ట్ర నాయకత్వానికి పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు స్పష్టతనిచ్చారు. పేరుకే పోటీ చేయడం కంటే దూరంగా ఉండడమే ఉత్తమమని ఆ పార్టీ నిర్ణయించుకుంది. ఈ మేరకు టీడీపీ తెలంగాణ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్‌కు చంద్రబాబు సూచించినట్టు సమాచారం. 
 
ప్రస్తుతం స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో అరెస్టయి రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా చంద్రబాబు ఉన్నారు. పార్టీ అధినేత జైలులో ఉన్నందువల్ల తెలంగాణ ఎన్నికలపై దృష్టి సారించలేమని ఆ పార్టీ భావించింది. ఈ నేపథ్యంలో శనివారం రాజమండ్రి సెంట్రల్ జైలులో ములాఖత్ సందర్భంగా కాసానికి చంద్రబాబు సూచించారు.
 
తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్నట్టు కాసాని కోరగా.. ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలంగాణపై దృష్టిసారించలేదని చంద్రబాబు చెప్పినట్టుగా తెలుస్తోంది. ఏపీ ఎన్నికల్లో పోరాడి విజయం సాధిస్తే తెలంగాణలో కూడా పార్టీ సులభంగా బలపడుతుందని చంద్రబాబు సూచించారు. 
 
తెలంగాణ ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు రాకుంటే బాధపడాల్సి ఉంటుందని, ఇప్పటికైతే పోటీ కష్టమని అనిపిస్తోందని కాసాని జ్ఞానేశ్వర్‌కు సర్దిచెప్పినట్లు తెలిసింది. బరిలో దిగితే పూర్తి స్థాయిలో యుద్ధం చేయాలని, ప్రస్తుతం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నామో చూస్తున్నారు కదా అని సర్దిచెప్పినట్టు సమాచారం.