బుధవారం, 4 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 31 అక్టోబరు 2023 (11:35 IST)

టీడీపీ చీఫ్ చంద్రబాబుకు మధ్యంతర బెయిల్‌ మంజూరు

chandrababu
స్కిల్‌డెవలప్‌మెంట్‌ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు మధ్యంతర బెయిల్‌ మంజూరైంది. ఆయన దాఖలు చేసిన అనుబంధ పిటిషన్‌పై సోమవారం విచారణ పూర్తిచేసిన హైకోర్టు మంగళవారం తీర్పు వెలువరించింది. న్యాయమూర్తి జస్టిస్‌ తల్లాప్రగడ మల్లికార్జునరావు తీర్పు వెల్లడించారు. 
 
స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో ఏసీబీ కోర్టు బెయిలు ఇచ్చేందుకు నిరాకరించడంతో చంద్రబాబు హైకోర్టును ఆశ్రయించారు. అనారోగ్య కారణాలరీత్యా చికిత్స నిమిత్తం మధ్యంతర బెయిలు మంజూరు చేయాలని అనుబంధ పిటిషన్‌ వేశారు. దీనిపై సోమవారం ఇరువర్గాల వాదనలు ఆలకించిన కోర్టు... తీర్పును మంగళవారానికి రిజర్వుచేసింది. ఆప్రకారంగా మంగళవారం నాలుగు వారాల పాటు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.
 
వచ్చే నెల 24 వరకు బెయిల్..
స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసు విచారణను హైకోర్టు 4 వారాల పాటు వాయిదా వేసింది. మెడికల్ గ్రౌండ్స్ పై చంద్రబాబుకు వచ్చే నెల 24 వరకు బెయిల్ మంజూరు చేసినట్లు న్యాయవాదులు చెబుతున్నారు. బెయిల్ కు సంబంధించి కోర్టు ఎలాంటి షరతులు విధించిందనే వివరాలు తెలియాల్సి ఉందని చెప్పారు. బెయిల్ కు సంబంధించిన తీర్పు కాపీ వచ్చాకే పూర్తి వివరాలు తెలుస్తాయని వివరించారు. కాగా, ప్రధాన బెయిల్ పిటిషన్ వచ్చే నెల 10న విచారణకు రానుంది.
 
సెప్టెంబర్ 9 న చంద్రబాబు అరెస్టు..
స్కిల్ డెవలప్ మెంట్ స్కీంలో అవకతవకలు జరిగాయనే ఆరోపణలతో ఏపీ సీఐడీ అధికారులు టీడీపీ చీఫ్ చంద్రబాబును నంద్యాలలో అరెస్టు చేశారు. ఆ తర్వాత కోర్టు ఆదేశాలతో చంద్రబాబును రాజమండ్రి జైలుకు తరలించారు. సెప్టెంబర్ 10 నుంచి 52 రోజులుగా చంద్రబాబు జైలులోనే ఉన్నారు. అయితే, కొన్ని రోజులుగా చంద్రబాబు పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. బెయిల్ మంజూరు కావడంతో ఈ రోజు సాయంత్రం కానీ, రేపు ఉదయం కానీ చంద్రబాబు జైలు నుంచి బయటకు వస్తారని కోర్టు వర్గాలు చెబుతున్నాయి.