మంగళవారం, 7 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సిహెచ్
Last Modified: మంగళవారం, 16 అక్టోబరు 2018 (18:10 IST)

'పని రాక్షసుడు' నారా లోకేష్‌ను పట్టుకుని అంత మాట అంటారా?

రాష్ట్రాభివృద్ధికి సీఎం చంద్రబాబునాయుడు, మంత్రి లోకేష్ అహర్నిశలూ కృషి చేస్తున్నారని, అటువంటి వారిని ప్రశంసిచకపోగా, విమర్శించడం సరికాదని శాసనమండలి విప్ డొక్కా మాణిక్యవరప్రసాద్ మండిపడ్డారు. స్టాన్‌ఫర్డ్ యూనివర్శిటీ నుంచి వచ్చిన లోకేష్ వ్యాపారాలు విడిచిపెట్టి, 10 ఏళ్ల నుంచి రాజకీయాల్లో చురుగ్గా ఉంటున్నారన్నారు. 2014 ఎన్నికల్లో టీడీపీ విజయానికి ఆయన విశేష కృషి చేశారన్నారు. తన తండ్రి సీఎం చంద్రబాబు నాయుడు పనితీరును స్ఫూర్తిగా తీసుకుని, గ్రామీణాభివృద్ధి, ఐటీ శాఖ మంత్రి విశేషమైన సేవలు అందిస్తున్నారన్నారు. 
 
దేశంలోనే ఈ రెండు శాఖల మంత్రిగా ఆదర్శవంతంగా నిలిచారన్నారు. ఎన్నో అవార్డులు, మరెన్నో ప్రశంసలను మంత్రి లోకేష్ సొంతం చేస్తున్నారన్నారు. ఐటీ శాఖ మంత్రిగా దేశవిదేశాలకు చెందిన ఎన్నో ప్రఖ్యాత సంస్థలను రాష్ట్రానికి తీసుకొచ్చి, వేలాది మంది యువతకు ఉపాధి కల్పిస్తున్నారని అన్నారు. నిరుద్యోగ భృతి ద్వారా యువతకు భరోసా కల్పించాలని సూచించింది ఆయనేనన్నారు. టీడీపీ కార్యకర్తల సంక్షేమ నిధి నిర్వహణా బాధ్యతను కూడా మంత్రి లోకేషే చూస్తున్నారన్నారు. శ్రీకాకుళం జిల్లాలో తిత్లి సహాయక చర్యలు మంత్రి లోకేష్ చురుగ్గా పాల్గొంటూ అక్కడి ప్రజల మన్ననలు పొందుతున్నారన్నారు. 
 
పని రాక్షసుడిలా కష్టపడుతున్న మంత్రి లోకేష్‌ను అభినందించకపోగా, ఆయనపై పవన్ బురద జల్లడం సరికాదన్నారు. ఎమ్మెల్సీలను, రాజ్యసభ సభ్యులను కించపరుస్తూ పవన్ మాట్లాడడం సరికాదని శాసనమండలి విప్ డొక్కా మాణిక్యవరప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యాంగమంటేనే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు అనే విషయం పవన్ గుర్తించుకోవాలన్నారు. రాజ్యాంగపరంగా ఎమ్మెల్యేల మాదిరిగానే ఎమ్మెల్సీలకు హక్కులు ఉంటాయన్నారు.

లోక్ సభ సభ్యులు మాదిరిగానే రాజ్యసభ సభ్యులకూ అధికారాలు ఉంటాయన్నారు. దేశంలో ఎమ్మెల్సీలు అయినవారెందరో మంత్రులు, ముఖ్యమంత్రులగా బాధ్యతలు చేపట్టారన్నారు. రాజ్యసభ సభ్యుడిగానే పవన్ కల్యాణ్ అన్నయ్య చిరంజీవి కేంద్రమంత్రి పదవి చేపట్టిన విషయం గుర్తుంచుకోవాలన్నారు. రాజకీయ ఆలోచనలు మార్చుకుని, ఎమ్మెల్సీలు, రాజ్యసభ సభ్యుల విధులు, బాధ్యతలు గురించి తెలుసుకుని మాట్లాడాలని పవన్ కల్యాణ్ కు విప్ డొక్కా మాణిక్యవరప్రసాద్ హితవు పలికారు.